IPO: 4 ఐపీఓలు రాబోతున్నాయ్‌

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌లో తొలి పబ్లిక్‌ ఆఫర్ల (ఐపీఓల) సందడి ఉండబోతోంది. 4 కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ.1,100 కోట్ల నిధుల్ని సమీకరించబోతున్నాయి.

Updated : 08 Jan 2024 08:05 IST

రూ.1,100 కోట్ల సమీకరణ లక్ష్యంతో..

దిల్లీ: ఈ వారం స్టాక్‌ మార్కెట్‌లో తొలి పబ్లిక్‌ ఆఫర్ల (ఐపీఓల) సందడి ఉండబోతోంది. 4 కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ.1,100 కోట్ల నిధుల్ని సమీకరించబోతున్నాయి. జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌, న్యూ స్వాన్‌ మల్టీటెక్‌, ఆస్ట్రేలియన్‌ ప్రీమియం సోలార్‌, ఐఎఫ్‌బీ ఫైనాన్స్‌ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.

  • జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌: కొత్త ఏడాదిలో మెయిన్‌బోర్డ్‌ విభాగంలో వస్తున్న తొలి ఐపీఓ ఇదే. ఈనెల 9-11 తేదీల్లో ఈ ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.315-331గా నిర్ణయించారు.      రూ.1,000 కోట్ల నిధుల్ని ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సమీకరించబోతోంది. పూర్తిగా తాజా షేర్లు జారీ చేయనున్నారు. కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ (సీఎన్‌సీ) మెషీన్ల తయారీ సంస్థ అయిన జ్యోతి సీఎన్‌సీ, తాజా ఐపీఓ ద్వారా సమీకరించబోయే మొత్తంలో రూ.475 కోట్లు అప్పులు తీర్చేందుకు, రూ.360 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం, మిగతాది ఇతర కార్పొరేట్‌ అవసరాల కోసం కేటాయించనుంది.
  • న్యూ స్వాన్‌ మల్టీటెక్‌: రూ.33.11 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఐపీఓ 11-15 తేదీల మధ్య ఉండనుంది. ఒక్కో షేరుకు ఇష్యూ ధరను రూ.62-66 గా నిర్ణయించారు. పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారా ఐపీఓ ఉండనుంది. కంపెనీ సేకరించిన నిధుల్లో కొంత భాగం లుధియానాలోని తయారీ యూనిట్‌ మెషినరీ కోసం, మిగతాది రుణాల చెల్లింపు, వర్కింగ్‌ క్యాపిటల్‌, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనుంది.
  • ఆస్ట్రేలియన్‌ ప్రీమియం సోలార్‌: మోనోక్రిస్టలిన్‌, పాలీక్రిస్టలిన్‌ సోలార్‌ మాడ్యూళ్లు తయారు చేసే ఈ సంస్థ,    రూ.28 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. ఈ నెల 11-15 తేదీల్లో ఇష్యూ ఉండనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.51-54ను నిర్ణయించింది. పూర్తిగా తాజా షేర్లు జారీ చేయనున్నారు. మూలధన వ్యయాలు, వర్కింగ్‌ క్యాపిటల్‌, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనుంది.
  • ఐబీఎల్‌ ఫైనాన్స్‌: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ) విభాగంలో ఈ ఏడాది రాబోతున్న తొలి ఐపీఓ ఇదే. ఈనెల 9-11 తేదీల మధ్య ఇష్యూ ఉండనుంది. రూ.33.4 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. ఒక్కో షేరు ధరను రూ.51గా నిర్ణయించింది. 65.5 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. భవిష్యత్‌ వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం ఐపీఓ నిధులను వినియోగించనుంది.
  • కౌసల్య లాజిస్టిక్స్‌ షేరు నమోదు నేడు: కౌసల్య లాజిస్టిక్స్‌ షేరు, ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ మార్కెట్‌లో నేడు నమోదు కానుంది.

రిలయన్స్‌-బ్రూక్‌ఫీల్డ్‌ డేటా కేంద్రం ప్రారంభం వచ్చే వారమే

చెన్నై: బ్రూక్‌ఫీల్డ్‌ భాగస్వామ్యంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చెన్నైలో నెలకొల్పిన డేటా కేంద్రాన్ని వచ్చే వారం ప్రారంభించనున్నట్లు ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. బ్రూక్‌ఫీల్డ్‌, అమెరికా సంస్థ డిజిటల్‌ రియాల్టీ భాగస్వాములుగా ఉన్న సంయుక్త సంస్థలో భాగస్వామిగా చేరేందుకు ఆర్‌ఐఎల్‌ గతేడాది జులైలో రూ.378 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఈ మూడు కంపెనీలకు సంయుక్త సంస్థలో తలో 33% వాటాలు ఉన్నాయి. తమిళనాడు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నుద్దేశించి, దృశ్యమాధ్యమ విధానంలో ప్రసంగించిన అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సదస్సును తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ సహా పలువురు పాల్గొన్నారు.

మొబైల్‌ ఫోన్‌ అసెంబ్లింగ్‌ కార్యకలాపాల కోసం తమిళనాడు ప్రభుత్వంతో రూ.12,082 కోట్ల అవగాహనా ఒప్పందాన్ని టాటా ఎలక్ట్రానిక్స్‌ కుదుర్చుకుంది. జేఎస్‌డబ్ల్యూ రెన్యూవబుల్‌ రూ.12,000 కోట్లు, టీవీఎస్‌ గ్రూప్‌ రూ.5,000 కోట్లు, మిత్సుబిషి ఎలక్ట్రిక్‌    రూ.6,180 కోట్లు,  పెగాట్రాన్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని