తొలి శుక్రవారం ఇచ్చేయండి!

స్టాక్‌ మార్కెట్‌ మదుపర్ల ట్రేడింగ్‌ ఖాతాల్లో నిల్వ ఉన్న నగదును ప్రతి 3 నెలల తర్వాత వచ్చే మొదటి శుక్రవారం నాడు తప్పనిసరిగా వెనక్కి ఇవ్వాలని బ్రోకింగ్‌ సంస్థలకు సెబీ నిర్దేశించింది. ఈ మేరకు వచ్చే నెల 1వ తేదీ నుంచి

Published : 25 Sep 2022 02:17 IST

 మదుపరుల ట్రేడింగ్‌ ఖాతాల్లోని సొమ్ము మూడు నెలలకోసారి వెనక్కి
‘రన్నింగ్‌ అకౌంట్‌ సెటిల్‌మెంట్‌’కు ‘సెబీ’  సరికొత్త నిబంధనలు

ఈనాడు, హైదరాబాద్‌: స్టాక్‌ మార్కెట్‌ మదుపర్ల ట్రేడింగ్‌ ఖాతాల్లో నిల్వ ఉన్న నగదును ప్రతి 3 నెలల తర్వాత వచ్చే మొదటి శుక్రవారం నాడు తప్పనిసరిగా వెనక్కి ఇవ్వాలని బ్రోకింగ్‌ సంస్థలకు సెబీ నిర్దేశించింది. ఈ మేరకు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం..
* త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌, జులై-సెప్టెంబరు, అక్టోబరు-డిసెంబరు, జనవరి-మార్చి) ముగిసిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం నాడు మదుపర్ల ట్రేడింగ్‌ ఖాతాల్లో నిల్వ ఉన్న నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి.
* మూడు నెలలకోసారి కాకుండా, ఒకవేళ మదుపరులు నెలకోసారి తమ ఖాతాల్లో నిల్వ ఉన్న సొమ్ము వెనక్కి ఇవ్వాలని కోరితే, నెల పూర్తయిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలి. దీన్ని ‘రన్నింగ్‌ అకౌంట్‌ సెటిల్‌మెంట్‌’ అంటారు.
* మొదటి శుక్రవారం ‘ట్రేడింగ్‌ హాలిడే’ అయితే, దానికి ముందు రోజు ఈ ప్రక్రియను పూర్తిచేయాలి.
* మదుపర్ల సొమ్మును స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఆలోచనతో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘ఒత్తిడి పెరుగుతుంది’:  ప్రతి మూడు నెలలకోసారి మదుపరుల ట్రేడింగ్‌ ఖాతాల్లో నిల్వ ఉన్న నగదును వెనక్కి ఇచ్చే సంప్రదాయం ఇప్పటికే అమల్లో ఉంది. కాకపోతే స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలు మూడు నెలలకోసారి ఏదో ఒకరోజు ‘సెటిల్‌మెంట్‌’ చేస్తూ వస్తున్నాయి. అందువల్ల ఒక్కో బ్రోకింగ్‌ సంస్థ, ఒక్కో రోజు మదుపరుల ట్రేడింగ్‌ ఖాతాల్లోని నగదు వెనక్కి ఇస్తున్నాయి. దీనికి బదులుగా ఒక్కో త్రైమాసికం ముగిసిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజునే ఈ పని చేయాలని, సెబీ ఇప్పుడు స్పష్టంగా నిర్దేశించింది. కొత్త నిబంధన ప్రకారం ప్రస్తుత జులై- సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి మదుపరుల ట్రేడింగ్‌ ఖాతాల్లోని సొమ్మును స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు వచ్చే నెల మొదటి శుక్రవారం వెనక్కి ఇచ్చివేయాలి.
ఈ మార్పు వల్ల మదుపర్లకు మేలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ బ్రోకింగ్‌ సంస్థలపై ఒత్తిడి పెరిగిపోతుందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. అంతేగాక రన్నింగ్‌ అకౌంట్‌ సెటిల్‌మెంట్‌ తర్వాత ట్రేడింగ్‌ రోజు, షేర్ల క్రయవిక్రయాల నిర్వహించటానికి మదుపరులు తమ బ్యాంకు ఖాతాల నుంచి ట్రేడింగ్‌ ఖాతాలోకి సొమ్ము బదిలీ చేయాలి. కొంతమంది వెనువెంటనే నగదు బదిలీ చేయలేకపోవచ్చు. అందువల్ల ఆ రోజు స్టాక్‌మార్కెట్లో లావాదేవీలు తగ్గొచ్చని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ‘మార్జిన్‌ మనీ’ చెల్లించడం కోసం అదనపు నిధులను బ్రోకింగ్‌ సంస్థలు సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్య రాకుండా బ్రోకింగ్‌ సంస్థలు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని