బేర్‌ పంజా

బేర్‌ ధాటికి వరుసగా నాలుగో రోజూ సూచీలు విలవిలలాడాయి. అంతర్జాతీయంగా మాంద్యం సంభవించవచ్చనే భయాలు పెరగడంతో, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలగా.. సెన్సెక్స్‌, నిఫ్టీ కూడా సోమవారం అదే బాటలో నడిచాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల

Published : 27 Sep 2022 02:27 IST

4 రోజుల్లో రూ.13.30 లక్షల కోట్లు ఆవిరి
డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.67కు

బేర్‌ ధాటికి వరుసగా నాలుగో రోజూ సూచీలు విలవిలలాడాయి. అంతర్జాతీయంగా మాంద్యం సంభవించవచ్చనే భయాలు పెరగడంతో, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలగా.. సెన్సెక్స్‌, నిఫ్టీ కూడా సోమవారం అదే బాటలో నడిచాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి తాజా జీవనకాల కనిష్ఠానికి చేరడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సోమవారం మరో 58 పైసలు కోల్పోయిన రూపాయి రికార్డు కనిష్ఠమైన 81.67కు పడిపోయింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 0.75 శాతం తగ్గి 85.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు నీరసంగానే ట్రేడయ్యాయి. గత 8 ట్రేడింగ్‌ రోజుల్లో విదేశీ మదుపర్లు బిలియన్‌ డాలర్ల (రూ.8000 కోట్లకు పైగా) షేర్లను అమ్మేశారు. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

* సూచీల వరుస నష్టాల నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.13.30 లక్షల కోట్లు తగ్గి రూ.270.11 లక్షల కోట్లకు చేరింది.

* సెన్సెక్స్‌ ఉదయం 57,525.03 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో 57,038.24 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. అనంతరం కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆఖరి గంటన్నరలో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో 953.70 పాయింట్ల నష్టంతో 57,145.22 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 311.05 పాయింట్లు క్షీణించి 17,016.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,978.30- 17,196.40 పాయింట్ల మధ్య కదలాడింది.

* హర్ష ఇంజినీర్స్‌ ఇంటర్నేషనల్‌ షేరు అరంగేట్రం అదిరింది. ఇష్యూ ధర రూ.330తో పోలిస్తే బీఎస్‌ఈలో 34.54% లాభంతో రూ.444 వద్ద షేరు నమోదైంది. ఇంట్రాడేలో 59.87% దూసుకెళ్లి రూ.527.60 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 47.24% లాభంతో రూ.485.90 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,423.83 కోట్లుగా నమోదైంది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 కుదేలయ్యాయి. మారుతీ 5.49%, టాటా స్టీల్‌ 4.22%, ఐటీసీ 3.96%, యాక్సిస్‌ బ్యాంక్‌ 3.40%, ఎన్‌టీపీసీ 3.35%, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.34%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.87%, ఎం అండ్‌ ఎం 2.83%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.60%, రిలయన్స్‌ 2.54% మేర డీలాపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 1.31%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.28%, ఇన్ఫోసిస్‌ 1.06%, అల్ట్రాటెక్‌ 0.50% రాణించాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. స్థిరాస్తి 4.29%, వాహన 3.86%, యుటిలిటీస్‌ 3.72%, విద్యుత్‌ 3.71%, కమొడిటీస్‌ 3.32%, ఇంధన 3.17%, చమురు-గ్యాస్‌ 3.10%, టెలికాం 2.97% పడ్డాయి. బీఎస్‌ఈలో 2980 షేర్లు నష్టాల్లో ముగియగా, 611 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 116 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.


అనిల్‌ అంబానీకి ఉపశమనం: నల్ల ధన నిరోధక చట్టం కింద నమోదైన పన్ను ఎగవేత కేసులో రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఉపశమనం లభించింది. ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులపై నవంబరు 17 వరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని బాంబే హైకోర్టు ఆదేశించింది. రెండు స్విస్‌ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.814 కోట్లకు పైగా వెల్లడించని మొత్తంపై, అనిల్‌ అంబానీ రూ.420 కోట్ల పన్ను ఎగవేశారని ఐటీ విభాగం ఆరోపిస్తోంది. అనిల్‌ అంబానీ ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేశారని, భారత పన్ను అధికారులకు విదేశీ బ్యాంక్‌ ఖాతా వివరాలను కావాలనే వెల్లడించలేదని అభియోగాలు మోపింది.

* 2022-23లో కొత్తగా 100 తెరలను ప్రారంభించేందుకు రూ.350 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు పీవీఆర్‌ సినిమాస్‌ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి ఐనాక్స్‌ లీజర్‌తో విలీనం పూర్తి కావొచ్చని పీవీఆర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎగ్జిక్యూటివ్‌ గౌతమ్‌ దత్తా పేర్కొన్నారు.

* తమ ప్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్‌ (ఈజీఆర్‌)లను తీసుకొచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తుది అనుమతి లభించినట్లు బీఎస్‌ఈ వెల్లడించింది. చిన్న మదుపర్లు, వాణిజ్యసంస్థలు, దిగుమతిదార్లు, బ్యాంకులు, రిఫైనరీ సంస్థలు, బులియన్‌ ట్రేడర్లు, ఆభరణాల తయారీదార్లు, రిటైల్‌ వ్యాపారులు కూడా వీటిని ట్రేడ్‌ చేసేందుకు త్వరలో అవకాశం కల్పిస్తామని తెలిపింది.

* ఉత్తర ప్రదేశ్‌, హరియాణల్లో 33.3 లక్షల ఐఓటీ ఆధారిత స్మార్ట్‌మీటర్లను ఇన్‌స్టాల్‌ చేయనున్నట్ల వొడాఫోన్‌ ఐడియా, ఈఈఎస్‌ఎల్‌ తెలిపాయి. ఇప్పటికే ఈ కంపెనీలు 16.7 లక్షల స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేశాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts