బెజోస్‌ సంపదలో అధిక భాగం వితరణకే

సంపాదించిన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని వితరణ చేయనున్నట్లు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ప్రకటించారు.

Published : 15 Nov 2022 01:32 IST

న్యూయార్క్‌: సంపాదించిన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని వితరణ చేయనున్నట్లు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ప్రకటించారు. ఫోర్బ్స్‌ ‘రియల్‌ టైం’ సంపద గణాంకాల ప్రకారం.. బెజోస్‌ సంపద 124.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే దాదాపు రూ.10.05 లక్షల కోట్లన్నమాట. ఇందులో అధిక భాగాన్ని దానం చేయనున్నట్లు తన ప్రేయసి లారెన్‌ సాంచెజ్‌తో కలిసి ఒక ఆంగ్ల ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో బెజోస్‌ ప్రకటించారు. ఎంత సందపను వితరణ చేస్తారు? ఎవరికి ఇవ్వనున్నారన్న విషయాలను వెల్లడించలేదు. ‘ఈ వితరణ  ఎలా చేయాలన్నదే అసలు కష్టం. అమెజాన్‌ను నిర్మించడమూ సులువుగా జరగలేదు. బాగా కష్టపడ్డాను. ఇందుకు తెలివైన బృందం తోడుగా నిలిచింది. అలాగే దాతృత్వం కూడా చాలా కష్టమైన పనే అని మేం భావిస్తున్నామ’ని ఆ ఇంటర్వ్యూలో బెజోస్‌ పేర్కొన్నారు. కుబేరులందరూ తమ ఆస్తిలో అధిక భాగాన్ని సమాజానికి విరాళంగా ఇవ్వాలంటూ బిల్‌ గేట్స్‌, మిలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ప్రవేశపెట్టిన ‘గివింగ్‌ ప్లెడ్జ్‌’పై సంతకాలు చేయనందుకు బెజోస్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది అమెజాన్‌ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం, బెజోస్‌ తన సమయంలో ఎక్కువ భాగాన్ని దాతృత్వ కార్యకలాపాలపైనే వెచ్చిస్తున్నారు. ఇప్పటికే 10 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.81,000 కోట్ల)ను పర్యావరణ మార్పుపై పోరాటానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని