సీఏల వైఫల్యం వల్లే సత్యం కుంభకోణం

ఖాతా పుస్తకాల్లో అవకతవకలను ముందుగా ఎత్తిచూపడంలో చార్టర్డ్‌ అకౌంటెంట్లు(సీఏలు) విఫలం కావడం వల్లే సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం చోటుచేసుకుందని హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అన్నారు.

Published : 24 Nov 2022 02:37 IST

హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ పరేఖ్‌

దిల్లీ: ఖాతా పుస్తకాల్లో అవకతవకలను ముందుగా ఎత్తిచూపడంలో చార్టర్డ్‌ అకౌంటెంట్లు(సీఏలు) విఫలం కావడం వల్లే సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం చోటుచేసుకుందని హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అన్నారు. బుధవారమిక్కడ సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌కు చెందిన అందరు స్వతంత్ర డైరెక్టర్లు ఆ కంపెనీ వ్యవస్థాపకుడైన బి రామలింగరాజుకు రబ్బరు స్టాంపుల్లా వ్యవహరించార’ని పేర్కొన్నారు. ఖాతా పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడడం ద్వారా, పలు సంవత్సరాల పాటు లాభాలను పెంచి చూపినట్లు స్వయానా ఆ కంపెనీ వ్యవస్థాపకులు రామలింగరాజు 2009 జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది ఏప్రిల్‌లో టెక్‌ మహీంద్రా ఆ కంపెనీని టేకోవర్‌ చేసింది. ఏ కంపెనీకి చెందిన సీఈఓ అయినా.. వాటాదార్ల ప్రయోజనం కోసం పనిచేయాలని పరేఖ్‌ సూచించారు. కొంత మంది వ్యక్తుల దురాశ కారణంగా చాలా వరకు కంపెనీలు కనుమరుగు కావాల్సి వస్తోందన్నారు. సత్యం కుంభకోణంలో ఆరుగురు సీఏల సభ్యత్వాన్ని, వారి సంఘం ఐసీఏఐ అప్పట్లో రద్దు చేసిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌ వంటి ప్లాట్‌ఫారాలు సత్యం కుంభకోణాన్ని ఒక సినిమాలా తీయొచ్చని ఇదే కార్యక్రమంలో ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ ఛైర్మన్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా సరదాగా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని