2026 నుంచి గ్యాస్‌ ధరలపై స్వేచ్ఛ

సహజవాయువు (గ్యాస్‌) ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన కిరీట్‌ పారిఖ్‌ కమిటీ తన నివేదికను సమర్పించింది. దిగ్గజ క్షేత్రాల నుంచే చేసే ఉత్పత్తులకు కనీస, గరిష్ఠ (సీలింగ్‌) ధరలను సిఫారసు చేసింది.

Published : 01 Dec 2022 01:47 IST

దిగ్గజ క్షేత్రాలకు మాత్రం కనీస, గరిష్ఠ ధరలు
కిరీట్‌ పారిఖ్‌ కమిటీ సిఫారసులు

దిల్లీ: సహజవాయువు (గ్యాస్‌) ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన కిరీట్‌ పారిఖ్‌ కమిటీ తన నివేదికను సమర్పించింది. దిగ్గజ క్షేత్రాల నుంచే చేసే ఉత్పత్తులకు కనీస, గరిష్ఠ (సీలింగ్‌) ధరలను సిఫారసు చేసింది. సంక్లిష్ట క్షేత్రాల నుంచి గ్యాస్‌ను వెలికితీసే సంస్థలకు మాత్రం 2026 జనవరి 1 నుంచి ధరలపై స్వేచ్ఛ ఇవ్వాలని పేర్కొంది. దేశంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌లో మూడింట రెండొంతులను ఉత్పత్తి చేసే దిగ్గజ క్షేత్రాల నుంచి వచ్చే సహజ వాయువుకు స్థిర ధరల శ్రేణి ఉండాలని ప్రతిపాదించింది. దీని వల్ల తయారీదార్లు ధరలను అంచనా వేసుకోగలుగుతారు. సీఎన్‌జీ, గొట్టపు వంట గ్యాస్‌ ధరలూ అదుపులో ఉంటాయని భావిస్తోంది. గతేడాది కాలంలో ఈ ధరలు 70 శాతం పెరిగాయి.

కనీసం 4 డాలర్లు.. పరిమితి 6.5 డాలర్లు.. ఏటా 0.5 డాలర్ల పెంపు: ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ ధరలను అంతర్జాతీయ మార్కెట్లలో గ్యాస్‌ ధరలకు బదులుగా, దిగుమతి అయ్యే ముడి చమురు ధరలతో అనుసంధానం చేయాలి. వీటికి కనీస, గరిష్ఠ(సీలింగ్‌) పరిమితిని నిర్దేశించాలని పారిఖ్‌ తెలిపారు.

దీని ప్రకారం..ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి ప్రభుత్వ రంగ తయారీదార్లకు దిగుమతి చమురుకు అనుసంధానంగా ఉండే ధరను చెల్లిస్తారు. కనీస ధర ఒక్కో మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు 4 డాలర్లుగా; గరిష్ఠ పరిమితి ధర 6.5 డాలర్లుగా ఉండాలి. గ్యాస్‌ మిగులు ఉండే దేశాల ధరలతో అనుసంధానం చేసి, లెక్కవేసిన ప్రస్తుత రేటు 8.57 డాలర్లుగా ఉంది. అయితే గరిష్ఠ ధరను ఏటా 0.5 డాలర్ల మేర పెంచాలని పారిఖ్‌ స్పష్టం చేశారు. 2027 జనవరి 1 నుంచి మార్కెట్‌ ఆధారిత రేట్లను నిర్ణయించాలని సలహా ఇచ్చామన్నారు.

వీటికి పరిమితి తొలగింపు: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీ అభివృద్ధి చేస్తున్న సంక్లిష్ట క్షేత్రాలకు మాత్రం ధరల విధానాన్ని మార్చలేదు. ప్రస్తుతం ఈ క్షేత్రాలకు సీలింగ్‌ ధర 12.46 డాలర్లుగా ఉంది. మూడేళ్ల పాటు ప్రభుత్వం నిర్ణయించే ఈ గరిష్ఠ ధరను కొనసాగించాలని, 2026 జనవరి 1 నుంచి ఈ పరిమితిని ఎత్తివేయాలని తెలిపింది.

జీఎస్‌టీలోకి తీసుకురండి: జీఎస్‌టీలోకి సహజ వాయువును తీసుకు రావాలని కమిటీ సలహా ఇచ్చింది. ‘ఈ విషయంపై రాష్ట్రాలకు ఆందోళనలు ఉన్నాయి. దీనిపై ఏకాభిప్రాయాన్ని సాధించే దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామ’ని ఆయన అన్నారు. ఇందువల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పేతే, నష్ట పరిహారం ఇచ్చేందుకు ప్రస్తుతం ఇతర రంగాలకున్న తరహాలోనే ఈ రంగంలోనూ ఒక వ్యవస్థను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని