సెన్సెక్స్‌ 63000

వరుసగా ఏడో రోజూ సూచీలు లాభాల జైత్రయాత్ర కొనసాగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు, విదేశీ మదుపర్ల రూ.9000 కోట్ల కొనుగోళ్ల అండతో సెన్సెక్స్‌ చరిత్రలోనే తొలిసారిగా 63,000 పాయింట్ల ఎగువన ముగిసింది.

Published : 01 Dec 2022 01:48 IST

7 రోజుల్లో రూ.7.59 లక్షల కోట్లు  పెరిగిన మదుపర్ల సంపద  
డాలర్‌ రూ.81.41

రుసగా ఏడో రోజూ సూచీలు లాభాల జైత్రయాత్ర కొనసాగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు, విదేశీ మదుపర్ల రూ.9000 కోట్ల కొనుగోళ్ల అండతో సెన్సెక్స్‌ చరిత్రలోనే తొలిసారిగా 63,000 పాయింట్ల ఎగువన ముగిసింది. గత 7 రోజుల్లో సెన్సెక్స్‌ 1,954.81 పాయింట్లు దూసుకెళ్లింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 41 పైసలు పెరిగి 81.41 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.83 శాతం లాభంతో 84.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత ఏడు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.7.59 లక్షల కోట్లు పెరిగి తాజా రికార్డు గరిష్ఠమైన రూ.288.50 లక్షల కోట్లకు చేరింది.

* సెన్సెక్స్‌ ఉదయం 62,743.47 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 63,303.01 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 417.81 పాయింట్ల లాభంతో 63,099.65 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 140.30 పాయింట్లు రాణించి 18,758.35 దగ్గర స్థిరపడింది. ఒకానొకదశలో ఈ సూచీ 18,816.05 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 రాణించాయి. ఎం అండ్‌ ఎం 4%, అల్ట్రాటెక్‌ 2.16%, పవర్‌గ్రిడ్‌ 2.14%, హెచ్‌యూఎల్‌ 1.78%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.55%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.55%, టాటా స్టీల్‌ 1.51%, టైటన్‌ 1.35%, ఎల్‌ అండ్‌ టీ 1.35% లాభపడ్డాయి.

ఏడాది గరిష్ఠానికి పీ-నోట్ల పెట్టుబడులు: మన స్టాక్‌ మార్కెట్లలోకి పార్టిసిపేటరీ (పీ) నోట్ల ద్వారా వచ్చిన పెట్టుబడులు అక్టోబరు చివరకు రూ.97,784 కోట్లకు పెరిగాయి. ఇది ఏడాది గరిష్ఠ స్థాయి. జూన్‌లో ఈ పెట్టుబడులు 20 నెలల కనిష్ఠమైన రూ.80,092 కోట్లుగా ఉన్నాయి.

* బాసెల్‌-3 నిబంధనలకు లోబడిన టైర్‌-2 బాండ్లను జారీ చేయడం ద్వారా హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్‌ రూ.15,000 కోట్ల వరకు సమీకరించనుంది.

శాంతించిన ఐరోపా ద్రవ్యోల్బణం: ఏడాదిలోనే తొలిసారిగా ఐరోపా ద్రవ్యోల్బణం శాంతించినా, ఇప్పటికీ రెండంకెల్లో ఉంది. అక్టోబరులో 10.6 శాతంగా ఉన్న వినియోగదారు ద్రవ్యోల్బణం నవంబరులో 10 శాతానికి దిగి వచ్చింది. 2021 జూన్‌ తర్వాత ద్రవ్యోల్బణం తగ్గడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని