‘మయన్మార్’ నుంచే పసిడి స్మగ్లింగ్
దేశంలో 2021లో 797.3 మెట్రిక్ టన్నుల బంగారం వినియోగం జరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం విడుదల చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్‌ఐ) స్మగ్లింగ్ నివేదిక వెల్లడించింది.
2021-22లో 833 కిలోల పట్టివేత
దేశంలోకి 525.82 మెట్రిక్ టన్నుల దిగుమతి
797.3 మెట్రిక్ టన్నుల వినియోగం
డీఆర్‌ఐ నివేదికలో వెల్లడి
దేశంలో 2021లో 797.3 మెట్రిక్ టన్నుల బంగారం వినియోగం జరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం విడుదల చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్‌ఐ) స్మగ్లింగ్ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో రూ.1,91,000 కోట్ల విలువైన 525.82 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు తెలిపింది. ‘బంగారం వినియోగంలో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానాన్ని భారత్ ఆక్రమించింది. బంగారం ఉత్పత్తిలో భారత్ వాటా పెద్దగా లేనందున స్థానిక వినియోగం కోసం పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. గత అయిదేళ్లలో భారత్‌కు దిగుమతి అయిన బంగారంలో 30% గోల్డ్‌డోర్ బార్స్ ఉన్నాయి. ఇదే సమయంలో డీఆర్‌ఐ 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ మార్గాల నుంచి భారత్‌లోకి అక్రమంగా రవాణా చేస్తున్న 833 కేజీల బంగారాన్ని పట్టుకొంది. భారత్‌లోకి స్మగ్లింగ్ అవుతున్న బంగారంలో అత్యధికం స్విట్జర్లాండ్‌దే అయినా చారిత్రకంగా దేశంలోకి బంగారం స్మగ్లింగ్ మధ్య ప్రాచ్య దేశాల నుంచి విమాన మార్గాల్లో జరుగుతోంది. అయితే దేశీయ వ్యవస్థలు గట్టి నిఘా ఉంచడం వల్ల స్మగ్లర్లు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నార’ని తన నివేదికలో తెలిపింది. అందులోని ముఖ్యాంశాలు..
చైనా నుంచి మయన్మార్.. అక్కడి నుంచి మిజోరం..మణిపూర్
అంతర్జాతీయ విమానాశ్రయల్లో నిఘా పెరగడంతో స్మగ్లర్లు పశ్చిమాసియా నుంచి వచ్చే విమాన మార్గాలను వదిలి చైనా-మయన్మార్ ద్వారా భారత్‌కు భూ మార్గంలో స్మగ్లింగ్ చేయడంపై దృష్టి సారించారు. మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, చైనాలతో భారత్ సరిహద్దులను పంచుకోవడంవల్ల స్మగ్లర్లు ఇప్పుడు భూమార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మయన్మార్ అత్యంత ప్రధాన స్మగ్లింగ్ కేంద్రంగా మారింది. భారత్‌కు అక్రమంగా వచ్చే బంగారంలో 37% మయన్మార్, 7% బంగ్లాదేశ్, 20% మధ్యప్రాచ్యం, 36% ఇతర దేశాల నుంచి వస్తోంది. గత ఏడాది దొరికిన దొంగ సరుకులో 73% మొత్తం మయన్మార్, బంగ్లాదేశ్‌లనుంచి వస్తున్నదేనని తేలింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం స్మగ్లింగ్ బంగారాన్ని చైనా నుంచి మయన్మార్‌కు చేరుస్తున్నారు. తర్వాత మయన్మార్‌లోని మ్యూస్ అనే ప్రాంతం నుంచి మండలే-కలేవా రూట్‌లో భారత్-మయన్మార్ సరిహద్దుకు చేరుస్తున్నారు. ఇక్కడ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు ఉండటం స్మగ్లర్లకు అనుకూలిస్తోంది. మయన్మార్ నుంచి మ్యూస్-మండలే-కలేవా-టెడిం-జొకవతార్, మ్యూస్-మండలే-కలెవా-టము-నాంఫలాంగ్-మోరే అనే రెండు మార్గాలనుంచి బంగారం భారత్‌లోకి తరలుతోంది. ఇక్కడి నుంచి భారత్‌లోని మిజోరం, మణిపుర్‌లోకి వస్తోంది.
ఆ వెసులుబాటుతో వ్యూహం..
భారత్, మయన్మార్ దేశాల మధ్య సామాజిక సంబంధాల మెరుగుకోసం రెండుదేశాల ప్రజలు ఎలాంటి పాస్‌పోర్ట్, వీసా లేకుండా 16 కిలోమీటర్లపాటు అటు, ఇటు రాకపోకలు సాగించవచ్చు. దీంతో స్మగ్లర్లు ఈ రెండుదేశాల సరిహద్దుల్లో ఉన్న ప్రజలను ఎంచుకొని తమ వ్యూహాలకు పదును పెడుతోంది. భారత్‌లో బంగారం అత్యధిక వినియోగం జరుగుతున్నందున ఇక్కడ చట్టబద్ధమైన, స్మగ్లింగ్ బంగారం వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ భారతీయ కుటుంబాలు ఎలాంటి పత్రాలు లేకుండా తమకు పరిచయం ఉన్న దుకాణాల నుంచి బంగారాన్ని కొనుగోలు చేయడం బ్లాక్ మార్కెట్‌కు ఊతమిస్తోంది.
పేస్టులు, ల్యాప్‌టాప్‌ల ద్వారానూ స్మగ్లింగ్
భారతీయ కుటుంబాలవద్ద 25,000 టన్నులకుపైగా బంగారం ఉంది. అందుకే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అత్యధిక బంగారం ఉన్న దేశంగా భారత్‌కు గుర్తింపునిచ్చింది. ఇక్కడ బంగారానికి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని లాభాలు దండుకోవడానికి బంగారం సిండికేట్లు, స్మగ్లర్లు విభిన్నరకాల పద్ధతులు అనుసరిస్తున్నాయి. మానవ శరీరం, యంత్రాలు, తుక్కులో బంగారాన్ని తరలిస్తున్నాయి. విమానాల్లో ప్రయాణించేవారు అత్యధికమంది మలద్వారం, బ్యాగేజ్, వివిధ వస్తువుల్లో దాచుకొని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలుచని ఫాయిల్స్, సూట్‌కేస్ బీడింగ్స్, పేస్ట్, పౌడర్ రూపంలో పట్టుకొస్తున్నారు. భూమార్గంలో అయితే ట్రక్కులు, కార్లు, ప్యాసింజర్ బస్సులు, మోటార్‌సైకిళ్ల ద్వారా తరలిస్తున్నారు. అలాగే ఇంధన ట్యాంకులు, డ్యాష్‌బోర్డులు, ఏసీ ఫిల్టర్లు, సీట్లు, వీల్ యాక్సిల్, ఛాసిస్, స్పేర్‌టైర్లలోనూ దొంగ రవాణా చేస్తున్నారు. అలాగే ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు, ట్రాలీ సూట్‌కేసుల ద్వారానూ తరలిస్తున్నారు. అక్రమ సొమ్ము తరలింపు (మనీలాండరింగ్)నకు బంగారం ఆకర్షణీయమార్గంగా కనిపిస్తోంది. దాని ధరలు స్థిరంగా ఉండటం వల్ల అక్రమంగా సొమ్ము సంపాదించిన నేరగాళ్లు తొలుత ఇందులో డబ్బుపెట్టి తర్వాత దాన్ని సులభంగా ఇతర ఆస్తుల్లోకి మార్చుకుంటున్నారు. మైనింగ్ నుంచి రిటైలింగ్ వరకు చట్టవ్యతిరేకమార్గంలో సంపాదించిన మొత్తాన్ని బంగారంలో పెడుతున్నారు. అంతర్జాతీయంగా దీని ధరల హెచ్చుతగ్గులు వీరికి లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇలా గడించిన సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికీ వీలవుతోంది’’ అని డీఆర్‌ఐ నివేదిక పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్
-
India News
Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్‌ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ
-
India News
Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!