ఐబీఎం.. ఎస్‌ఏపీ.. కోన్‌.. డౌ

అంతర్జాతీయంగా ఉద్యోగాల కోతను ప్రకటిస్తున్న కంపెనీల్లో మరో 4 చేరాయి. సాంకేతికత దిగ్గజాలైన ఐబీఎం, ఎస్‌ఏపీతో పాటు ఎలివేటర్ల తయారీ సంస్థ కోన్‌, మెటీరియల్స్‌ సైన్స్‌ కంపెనీ డౌ సంస్థల తాజా ప్రకటన చూస్తే, ప్రపంచవ్యాప్తంగా మరో 10,000 ఉద్యోగాల్లో కోత పడుతోంది.

Published : 27 Jan 2023 01:06 IST

మరో 4 కంపెనీల్లో 10,000 ఉద్యోగాల కోత
వ్యయ నియంత్రణలో భాగంగానే

అంతర్జాతీయంగా ఉద్యోగాల కోతను ప్రకటిస్తున్న కంపెనీల్లో మరో 4 చేరాయి. సాంకేతికత దిగ్గజాలైన ఐబీఎం, ఎస్‌ఏపీతో పాటు ఎలివేటర్ల తయారీ సంస్థ కోన్‌, మెటీరియల్స్‌ సైన్స్‌ కంపెనీ డౌ సంస్థల తాజా ప్రకటన చూస్తే, ప్రపంచవ్యాప్తంగా మరో 10,000 ఉద్యోగాల్లో కోత పడుతోంది. అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి డౌ మినహా మిగిలిన సంస్థలు మెరుగైన ఆర్థిక గణాంకాలనే నమోదు చేసినా, వ్యయాలు తగ్గించుకునేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, మెటా లాంటి దిగ్గజాలు వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐబీఎం.. 3900

ఐబీఎం కార్పొరేషన్‌ తమ సిబ్బంది సంఖ్యలో 1.5 శాతానికి సమానమైన 3,900 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబరు త్రైమాసిక ఆదాయం అంచనాలకు మించి నమోదైనా, 2022 వార్షిక నగదు నిల్వల లక్ష్యమైన 10 బిలియన్‌ డాలర్లను అందుకోకపోవడమే ఉద్యోగాల కోతకు కారణమని రాయిటర్స్‌ వార్తా కథనం వెల్లడించింది. 2022కు సంస్థ వద్ద నగదు నిల్వలు 9.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. నిర్వహణ మూలధన అవసరాల కోసం కంపెనీ వ్యయాలు, అంచనాలను మించడమూ మరో కారణం. అయితే పరిశోధన- అభివృద్ధి విభాగాల్లో నియామకాలు కొనసాగుతాయని  ఐబీఎం ముఖ్య ఆర్థిక అధికారి జేమ్స్‌ కవనాఘ్‌ వెల్లడించారు. తాజా ఉద్యోగ కోతలు కిండ్రైల్‌ వ్యాపారం, ఏఐ విభాగంలో భాగమైన వాట్సన్‌ హెల్త్‌ వ్యాపార విభజనకు సంబంధించినవని ఐబీఎం తెలిపింది.

ఎస్‌ఏపీ.. 3000

వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు క్లౌడ్‌ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి సారించాలనే ప్రణాళికలో భాగంగా 3,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఎస్‌ఏపీ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి ఉన్న సిబ్బంది సంఖ్యలో ఇది 2.5 శాతానికి సమానం. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న జర్మనీలో 200 మందినే తొలగిస్తోంది. అక్టోబరు- డిసెంబరులో క్లౌడ్‌ వ్యాపార ఆదాయంలో 30% వృద్ధి లభించినా, ఉద్యోగాల తొలగింపు నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.  

కోన్‌.. 1000

ప్రపంచవ్యాప్తంగా 1,000 మందిని తొలగిస్తున్నట్లు ఎలివేటర్ల తయారీ సంస్థ కోన్‌ వెల్లడించింది. ఇందువల్ల ఏడాదికి 100 మిలియన్‌ యూరోల మేర ఆదా అవుతుందని కంపెనీ భావిస్తోంది. 2022 చివరినాటికి కోన్‌లో 63,277 మంది పనిచేస్తున్నారు. తాజా తొలగింపుల సంఖ్య ఇందులో 1.6 శాతానికి సమానం. సంస్థ ప్రధాన కేంద్రమైన ఫిన్లాండ్‌లో 150 మందిని తొలగిస్తోంది. అక్టోబరు- డిసెంబరులో కోన్‌ ఫలితాలు అంచనాలను మించాయి. ప్రధాన విపణి అయిన చైనాలోనూ వ్యాపారం బాగుంటుందనే సంస్థ ఆశిస్తున్నా, ఉద్యోగ కోతలు ప్రకటించింది.

డౌ.. 2000

ఈ ఏడాదిలో వ్యయాలను 100 కోట్ల డాలర్ల మేర తగ్గించుకోవాలని భావిస్తున్న అమెరికాకు చెందిన మెటీరియల్స్‌ సైన్స్‌ కంపెనీ డౌ.. ప్రపంచవ్యాప్తంగా 2000 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. కంపెనీలో  మొత్తం సిబ్బంది 37,800 మంది ఉన్నారు. అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఈ సంస్థ ప్రకటించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని