సంక్షిప్త వార్తలు (9)

జాతీయ మానవ వనరుల అభివృద్ధి (ఎన్‌హెచ్‌ఆర్‌డీ) సంస్థ, 25వ వార్షిక సమావేశం ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సదస్సును తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు.

Published : 31 Jan 2023 02:22 IST

ఎన్‌హెచ్‌ఆర్‌డీ సదస్సు 2 నుంచి

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ మానవ వనరుల అభివృద్ధి (ఎన్‌హెచ్‌ఆర్‌డీ) సంస్థ, 25వ వార్షిక సమావేశం ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సదస్సును తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు. ‘ఆర్థికాభివృద్ధి- భవిష్యత్తు ముఖచిత్రం’  అంశంపై ఆయన ప్రధానోపన్యాసం చేస్తారు. మానవ వనరుల విభాగానికి చెందిన వెయ్యి మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. మానవ వనరులకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారని ఎన్‌హెచ్‌ఆర్‌డీ హైదరాబాద్‌ ఛాప్టర్‌ అధ్యక్షుడు డాక్టర్‌ విపుల్‌ సింగ్‌ పేర్కొన్నారు.


మారుతీ దేశీయ విక్రయాలు 2.5 కోట్లు

దిల్లీ: దేశీయంగా మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఇప్పటివరకు విక్రయించిన మొత్తం వాహనాల సంఖ్య 2.5 కోట్లకు చేరిందని జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ సోమవారం వెల్లడించింది. 2023 జనవరి 9న ఈ ఘనతను ఎంఎస్‌ఐ సాధించిందని పేర్కొంది.


అలుఫ్లూరైడ్‌కు రూ.4.65 కోట్ల లాభం  

ఈనాడు, హైదరాబాద్‌: రసాయనాల తయారీ కంపెనీ అలుఫ్లూరైడ్‌ లిమిటెడ్‌ డిసెంబరు త్రైమాసికానికి రూ. 38.49 కోట్ల ఆదాయంపై రూ.4.65 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.29 కోట్లు, నికరలాభం రూ.1.89 కోట్లే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు ఆదాయం రూ.101.71 కోట్లు, నికరలాభం రూ.9.71 కోట్లు నమోదయ్యాయి. 2021-22 మొదటి 9 నెలలకు రూ.59.56 కోట్ల ఆదాయంపై, నికరలాభం  రూ.2.89 కోట్లు, ఈపీఎస్‌ రూ.3.70 ఉన్నాయి.


453% పెరిగిన మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ లాభం  

ఈనాడు, హైదరాబాద్‌: డిజైనింగ్‌ సేవల సంస్థ మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ డిసెంబరు త్రైమాసికానికి రూ.40.72 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని, రూ.9.20 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాల ఆదాయం రూ.23.83 కోట్లు, నికరలాభం రూ.1.66 కోట్లతో పోల్చితే ఈసారి లాభం 453%, ఆదాయం 71% పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు రూ.104.39 కోట్ల ఆదాయంపై రూ.19.15 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సివిల్‌, మెకానికల్‌ విభాగాలు బాగా రాణించడం వల్లే మెరుగైన లాభాదాయాలు నమోదు చేయగలిగామని కంపెనీ వెల్లడించింది. మెకానికల్‌ విభాగాన్ని అమెరికాకు విస్తరిస్తున్నట్లు తెలిపింది.


హైదరాబాద్‌లో క్యూబిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రవాణా రంగ సంస్థలకు ఇంజినీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌, ఆన్‌లైన్‌ చెల్లింపుల సేవలు అందించే అమెరికా సంస్థ క్యూబిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్స్‌ మనదేశంలో కార్యకలాపాలను విస్తరించేందుకు హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది.  కొద్ది నెలల్లో 150 మంది కొత్త ఉద్యోగులను నియమించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు జెఫ్రీ లావింగర్‌ వివరించారు. బ్రెజిల్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నిర్వహిస్తున్న రవాణా సేవల ప్రాజెక్టుల తరహాలో ఇక్కడా చేపడతామన్నారు.బస్సులు, రైళ్లు, మెట్రో, పార్కింగ్‌, ఫైర్‌ కలెక్షన్‌.. వంటి పలు రకాల సేవలకు ఒకే కార్డుతో చెల్లింపులు చేసే ‘వన్‌ అకౌంట్‌ టికెటింగ్‌’ సేవలను అందిస్తామని అన్నారు.


2500 నియామకాలు: ఫిజిక్స్‌వాలా

దిల్లీ: ప్రస్తుత త్రైమాసికంలో వేర్వేరు విభాగాల్లో 2,500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఎడ్‌టెక్‌ యూనికార్న్‌ సంస్థ ఫిజిక్స్‌వాలా ప్రకటించింది. బైజూస్‌, అన్‌అకాడమీ, వేదాంతు, ఫ్రంట్‌రో వంటి పోటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో, ఈ కంపెనీ నియామకాల ప్రకటన చేయడం విశేషం. ప్రస్తుతం సంస్థలో 6,500 మంది ఉద్యోగులున్నారు. వ్యాపార-డేటా విశ్లేషకులు, కౌన్సిలర్లు, ఆపరేషన్స్‌ మేనేజర్లు, బ్యాచ్‌ మేనేజర్లు, టీచర్లను కొత్తగా నియమించుకోనున్నట్లు తెలిపింది.


ఫిలిప్స్‌లో మరో 6,000 ఉద్యోగాల కోత

ది హేగ్‌: ఫిలిప్స్‌ కంపెనీ మరోసారి ఉద్యోగ కోతల్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 6,000 మందిని రెండేళ్లలో తొలగించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తాజాగా పేర్కొంది. కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన స్లీప్‌ అప్నియా రెస్పిరేటర్లలో లోపాల కారణంగా 2022లో భారీ నష్టాలు (1.6 బిలియన్‌ యూరోలు-సుమారు రూ.14,000 కోట్లు) తలెత్తడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మూడు నెలల్లోనే సంస్థ నుంచి ఉద్యోగ కోతల ప్రకటన వెలువడటం ఇది రెండోసారి.


గెయిల్‌ లాభంలో 90% క్షీణత

దిల్లీ: గెయిల్‌ ఇండియా డిసెంబరు త్రైమాసికంలో రూ.397.59 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.3,800.09 కోట్లతో పోలిస్తే ఇది 90 శాతం తక్కువ. పెట్రోరసాయనాల వ్యాపారంలో రూ.349 కోట్ల నష్టం రావడం వల్లే, ఈసారి లాభం భారీగా తగ్గింది. సహజ వాయువు మార్కెటింగ్‌ విభాగం కూడా నష్టాలే చవిచూసింది. ప్రధాన విభాగమైన ట్రాన్స్‌మిషన్‌ వ్యాపారంలో కూడా పన్నుకు ముందు లాభం సగానికి తగ్గింది. కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ.26,175.60 కోట్ల నుంచి రూ.35,939.96 కోట్లకు చేరింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన నికర లాభం  రూ.3,287 కోట్ల నుంచి 92 శాతం తగ్గి రూ.245 కోట్లకు పరిమితమైంది.


రెనో, నిస్సాన్‌ పరస్పర వాటాలు ఇక సమానం

టోక్యో: జపాన్‌-ఫ్రెంచ్‌ వాహన దిగ్గజ సంస్థలైన నిస్సాన్‌, రెనో తమ సంయుక్త సంస్థలో పరస్పర వాటాలను సమాన స్థాయికి (15%) చేర్చాయి. తమ మధ్య ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాయి. నిస్సాన్‌ మోటార్‌లో రెనో గ్రూప్‌నకు 43.4 శాతం వాటా ఉండగా.. ఒక ఫ్రెంచి ట్రస్టుకు 28.4 శాతం వాటాకు సమానమైన షేర్లను బదిలీ చేయనుంది. అపుడు నిస్సాన్‌లో 15 శాతం వాటాను మాత్రమే రెనో కలిగి ఉంటుందని ఇరు కంపెనీలు తెలిపాయి. నిస్సాన్‌కు ఈ సంస్థలో అంతే వాటా ఉంది. ఇరు కంపెనీలకు వాటాల్లో ఉన్న అంతరం వల్ల రెనోతో పోలిస్తే నిస్సాన్‌ ఎక్కువ లాభదాయకతను నమోదు చేసిన అనంతరం, ఒకలాంటి సంఘర్షణ చోటు చేసుకోవడంతో, తాజా నిర్ణయం తీసుకున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని