మాస్‌చిప్‌ చేతికి అమెరికా కంపెనీ ‘సాఫ్ట్‌నాటిక్స్‌’

హైదరాబాద్‌కు చెందిన మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్‌నాటిక్స్‌ ఇంక్‌.

Published : 29 Mar 2023 03:28 IST

17.25 మి. డాలర్లకు కొనుగోలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్‌నాటిక్స్‌ ఇంక్‌. అనే కంపెనీని కొనుగోలు చేయనుంది. సాఫ్ట్‌నాటిక్స్‌కు మన దేశంలోని పుణె, అహ్మదాబాద్‌లో కార్యాలయాలు ఉన్నాయి. వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ విభాగంలో ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. గత ఏడాదిలో ఈ సంస్థ 4.73 మిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. దీన్ని సొంతం చేసుకోవటం వల్ల ఇంజినీరింగ్‌ నైపుణ్యం, వినియోగదార్లు, ప్రపంచ స్థాయి సామర్థ్యమున్న నాయకత్వం, మానవ వనరులకు తమకు లభిస్తాయని మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ పేర్కొంది. సాప్ట్‌నాటిక్స్‌ను 17.25 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.141 కోట్లు) కొనుగోలు చేసేందుకు మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 47.4 శాతానికి దశల వారీగా నగదు చెల్లిస్తారు. మిగిలిన 52.6% విలువకు 1,14,52,498 మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ షేర్లను ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో కేటాయిస్తారు. రూ.2 ముఖ విలువ ఒక్కో మాస్‌చిప్‌ షేరును రూ.65.22 ధరకు జారీ చేయనున్నట్లు మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. వచ్చే మూడు నెలల కాలంలో సాఫ్ట్‌నాటిక్స్‌ను కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తవుతుందని మాస్‌చిప్‌ వెల్లడించింది. ఇకపై ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ విభాగంలో వేగంగా ఎదిగే అవకాశం తమకు లభిస్తుందని మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ ఎండీ, సీఈఓ వెంకట సుధాకర్‌ సింహాద్రి తెలిపారు. మాస్‌చిప్‌కు 1100 మందికి పైగా ఇంజినీర్లు ఉన్నట్లు, దీనికి తమకు ఉన్న 185 మంది సిబ్బంది జతకలుస్తారని సాఫ్ట్‌నాటిక్స్‌ సీఈఓ రాజేశ్‌ షా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు