లగ్జరీ కార్ల కోసం లెవిటాస్‌ అల్ట్రా

విలాసవంతమైన కార్లు, ఎస్‌యూవీలకు గిరాకీ పెరుగుతోందని జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్షుమన్‌ సింఘానియా అన్నారు.

Updated : 29 Mar 2023 04:06 IST

విడుదల చేసిన జేకే టైర్‌

ఈనాడు, హైదరాబాద్‌: విలాసవంతమైన కార్లు, ఎస్‌యూవీలకు గిరాకీ పెరుగుతోందని జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్షుమన్‌ సింఘానియా అన్నారు. ఈ విభాగంలో రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల విలువైన కార్ల మార్కెట్‌ 80 శాతం వరకూ ఉందన్నారు. రానున్న రెండుమూడేళ్ల పాటు ఇది కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావం, వడ్డీ రేట్లు వాహన రంగంపై పెద్దగా ప్రభావాన్ని చూపడం లేదన్నారు. డెలివరీ కావాల్సిన వాహనాల సంఖ్య ఇప్పటికీ అధికంగానే ఉందని పేర్కొన్నారు. లగ్జరీ కార్ల మార్కెట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ విభాగంలోని కార్ల కోసం ప్రత్యేకంగా ‘లెవిటాస్‌ అల్ట్రా’ టైర్లను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ టైర్లను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మొత్తం ఏడు పరిమాణాల్లో దీన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. కొత్తతరం సాంకేతికతలను ఉపయోగించి, దేశీయ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.800 కోట్లతో కంపెనీ విస్తరణ ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్‌ వాహనాల కోసం ప్రత్యేక టైర్లనూ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. జేకే టైర్‌- ఇండియా ప్రెసిడెంట్‌ అనూజ్‌ కతురియా మాట్లాడుతూ.. మొత్తం దేశీయ టైర్ల విపణి దాదాపు రూ.70,000 కోట్ల మేరకు ఉందన్నారు. 2025 నాటికి ఇది రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ముడిసరకు ధరలు కొన్నాళ్లుగా స్థిరంగానే ఉన్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు