వొడాఫోన్‌ ఐడియా నష్టం తగ్గింది

మార్చి త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఏకీకృత ప్రాతిపదికన రూ.6,418.9 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.6,563.1 కోట్ల కంటే ఈసారి కాస్త తగ్గింది.

Published : 26 May 2023 00:58 IST

దిల్లీ: మార్చి త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఏకీకృత ప్రాతిపదికన రూ.6,418.9 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.6,563.1 కోట్ల కంటే ఈసారి కాస్త తగ్గింది. మొత్తం సేవల ఆదాయం రూ.10,228.9 కోట్ల నుంచి 3 శాతం పెరిగి రూ.10,506.5 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2022-23)లో వొడాఫోన్‌ ఐడియా రూ.29,297.6 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021-22లో కంపెనీ నష్టం రూ.28,234.1 కోట్లుగా ఉంది. విలీనం తర్వాత  మొదటిసారిగా వొడాఫోన్‌ ఐడియా వార్షికాదాయం పెరిగింది. 2021-22లో ఆదాయం రూ.38,489.5 కోట్లు కాగా, 2022-23లో 9.4 శాతం వృద్ధి చెంది రూ.42,133.9 కోట్లకు పెరిగింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ మూలధన వ్యయాలు రూ.560 కోట్లుగా, పూర్తి ఆర్థికంలో రూ.3,360 కోట్లుగా నమోదయ్యాయి. మార్చికి సంస్థ మొత్తం స్థూల రుణాలు రూ.2,09,260 కోట్లకు తగ్గాయి. డిసెంబరులో ఇవి రూ.2,22,890 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ స్పెక్ట్రమ్‌ చెల్లింపులను వాయిదా వేయడం, ఏజీఆర్‌ బకాయిలను ప్రభుత్వానికి ఈక్విటీగా మార్చడమే ఇందుకు కారణం.

కంపెనీకి వినియోగదారు సగటు ఆదాయం (ఆర్పు) 2021-22 నాలుగో త్రైమాసికంలో రూ.124 కాగా, సమీక్షా త్రైమాసికంలో 9.3% పెరిగి రూ.135కు చేరింది. 4జీ చందాదార్లతో పాటు ఆర్పు కూడా పెరగడం కొనసాగుతుందని సంస్థ సీఈఓ అక్షయ ముంద్రా పేర్కొన్నారు. చందాదార్ల సంఖ్య 24.38 కోట్ల నుంచి 22.59 కోట్లకు తగ్గినా, 4జీ చందాదార్ల సంఖ్య మాత్రం 11.81 కోట్ల నుంచి 12.26 కోట్లకు పెరిగినట్లు సంస్థ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు