మూలధన వ్యయాలు రూ.11.11 లక్షల కోట్లకు!

ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటున్నందున, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాలను 11% పెంచి రూ.11.11 లక్షల కోట్ల (జీడీపీలో 3.4 శాతం)కు చేర్చారు.

Updated : 02 Feb 2024 05:51 IST

ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటున్నందున, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాలను 11% పెంచి రూ.11.11 లక్షల కోట్ల (జీడీపీలో 3.4 శాతం)కు చేర్చారు. 2022-23 కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను 37.5% పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేటు పెట్టుబడులు తక్కువగా ఉండటంతో, ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి 30 శాతానికి పైగా మూలధన వ్యయాలను పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రైవేటు పెట్టుబడులు తగినంత స్థాయికి పుంజుకోవడం, కేంద్ర ప్రభుత్వం తక్కువ అప్పులు తీసుకోవడం వల్ల ప్రైవేటు రంగానికి పెద్ద మొత్తంలో రుణాలు లభిస్తాయని అంచనా వేశారు.


పన్నుల ఆదాయాలు రూ.38.31 లక్షల కోట్లు

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రభుత్వ స్థూల పన్నుల ఆదాయాలు 11.46% పెరిగి రూ.38.31 లక్షల కోట్లుగా నమోదుకావచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. జీఎస్‌టీ వసూళ్లు 11.6% పెరుగుతాయనే అంచనాలు ఇందుకు నేపథ్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 2024-25లో జీఎస్‌టీ వసూళ్లు (రాష్ట్రాల వాటా మినహాయించి) రూ.1.1 లక్షల కోట్లు (11.6%) పెరిగి రూ.10.68 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తం పన్నుల వసూళ్లలో ప్రత్యక్ష పన్నుల రూపేణా రూ.21.99 లక్షల కోట్లు (వ్యక్తిగత ఆదాయపు పన్ను+కార్పొరేట్‌ పన్ను), పరోక్ష పన్నుల రూపేణా రూ.16.22 లక్షల కోట్లు (కస్టమ్స్‌, ఎక్సైజ్‌ సుంకం, జీఎస్‌టీ) రావొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) స్థూల పన్నుల ఆదాయాలు బడ్జెట్‌ లక్ష్యం కంటే సుమారు రూ.76,000 కోట్ల మేర పెరిగే అవకాశం ఉంది. 2023-24లో రూ.33.61 లక్షల కోట్ల మేర పన్నుల ఆదాయం రావొచ్చని బడ్జెట్లో అంచనా వేయగా.. తాజా మధ్యంతర బడ్జెట్లో దాన్ని  రూ.34.37 లక్షల కోట్లకు సవరించారు.


ప్రభుత్వానికి ఆర్‌బీఐ, పీఎస్‌బీల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండు

చ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-25) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) నుంచి డివిడెండు ఆదాయం రూపేణా ప్రభుత్వానికి రూ.1.02 లక్షల కోట్లు రావొచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) గత బడ్జెట్లో అంచనా వేసిన రూ.48,000 కోట్ల కంటే అధికంగా రూ.1.04 లక్షల కోట్ల డివిడెండును ఆర్‌బీఐ, పీఎస్‌బీల నుంచి ప్రభుత్వం పొందే అవకాశం ఉంది. గతేడాది మేలో ఆర్‌బీఐ రూ.87,416 కోట్ల డివిడెండును చెల్లించడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, పీఎస్‌బీల నుంచి ప్రభుత్వానికి రూ.39,961 కోట్ల డివిడెండు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈల) నుంచి రూ.43,000 కోట్ల డివిడెండు ఖజానాకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇతర పెట్టుబడులు కూడా రూ.50,000 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం మీద 2023-24లో పీఎస్‌బీలు, ఆర్‌బీఐ, సీపీఎస్‌ఈల నుంచి రూ.1,54,407 కోట్ల మేర ప్రభుత్వానికి డివిడెండు రూపేణా రావొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీని కంటే కాస్త తక్కువగా   రూ.1.50 లక్షల కోట్ల మేర ప్రభుత్వానికి డివిడెండు వచ్చే అవకాశం ఉంది.


పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.50,000 కోట్లు

2024-25 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.50,000 కోట్లుగా మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా అయిన రూ.30,000 కోట్ల కంటే ఇది ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉపసంహరణ లక్ష్యాన్ని తొలుత రూ.51,000 కోట్లుగా పెట్టుకున్నా, ఆ తర్వాత తగ్గించారు. గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా నిధులేమీ ఖజానాకు చేరడం లేదు. 2023-24 బడ్జెట్‌ అంచనాల ప్రకారం.. రూ.10,000 కోట్లు ఇలా రావాల్సి ఉంది.

ఇప్పటిదాకా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా జరిగిన పెట్టుబడుల ఉపసంహరణతో రూ.12,504 కోట్లే ఖజానాకు చేరాయి. కోల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఆర్‌వీఎన్‌ఎల్‌, ఐఆర్‌ఈడీఏ వంటి 7 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాలను ప్రభుత్వం విక్రయించి, ఈ మొత్తం సమీకరించింది.


అంతక్రితం లక్ష్యాలు నెరవేరాయా?

  • రెండు ఆర్థిక సంవత్సరాల్లో మాత్రమే బడ్జెట్‌లో ప్రకటించిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను ప్రభుత్వం చేరుకుంది. 2017-18లో రూ.లక్ష కోట్లు నిర్దేశించుకోగా.. రూ.1,00,056 కోట్లను పొందింది. ఇదే ఇప్పటి వరకు అత్యధికం.
  • 2018-19లో రూ.80,000 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.84,972 కోట్లను సమీకరించగలిగింది.

రూ.14.13 లక్షల కోట్లు సమీకరిస్తాం

2024-25లో సెక్యూరిటీల జారీ ద్వారా రూ.14.13 లక్షల కోట్లను ప్రభుత్వం సమీకరించనుందని ఆర్థికమంత్రి తెలిపారు. ఆదాయాలు, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇలా నిధులను సమీకరిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023 జులై 31 వరకు ప్రభుత్వం సుమారు రూ.5.77 లక్షల కోట్లను సమీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని