OTT: ఇంట్లో సినిమా సూపర్‌హిట్‌

కరోనా తెచ్చిన మార్పుల్లో ఒకటి.. ఓటీటీ. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌వీడియో, హాట్‌స్టార్‌, జీ5, సోనీలివ్‌, ఆహా వంటివి ఇప్పుడు చిత్ర ప్రేమికులకు చిరపరిచయం ఉన్న పేర్లు. ఇదివరకు ఏ సినిమాహాల్లో ఏ సినిమా ఆడుతుందో, రానుందో చూసుకునేవారు. ఇప్పుడు ఓటీటీల్లో అలానే అన్వేషిస్తున్నారు. కొన్నేళ్లుగా ఓటీటీలున్నాయి. 

Updated : 26 Jul 2022 06:57 IST

2027 కల్లా 7 బి. డాలర్లకు ఓటీటీ మార్కెట్‌

అంతర్జాతీయ దిగ్గజాలకు స్థానిక కంపెనీల పోటీ

ఆసియా పసిఫిక్‌ ప్రాంతమే కీలకం

మీడియా పార్టనర్స్‌ ఏషియా నివేదిక

కరోనా తెచ్చిన మార్పుల్లో ఒకటి.. ఓటీటీ. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌వీడియో, హాట్‌స్టార్‌, జీ5, సోనీలివ్‌, ఆహా వంటివి ఇప్పుడు చిత్ర ప్రేమికులకు చిరపరిచయం ఉన్న పేర్లు. ఇదివరకు ఏ సినిమాహాల్లో ఏ సినిమా ఆడుతుందో, రానుందో చూసుకునేవారు. ఇప్పుడు ఓటీటీల్లో అలానే అన్వేషిస్తున్నారు. కొన్నేళ్లుగా ఓటీటీలున్నాయి. అయితే కొవిడ్‌ పరిణామాల్లో దాదాపు రెండేళ్ల పాటు థియేటర్‌కు వెళ్లే వీలులేకపోవడంతో ఎక్కువ మంది ఓటీటీలకు అలవాటు పడ్డారన్నది వాస్తవం. ఆ అలవాటు కొనసాగుతున్నందున, ఓటీటీల ఆదాయం అయిదేళ్లలో రెట్టింపునకు మించుతుందని ఒక నివేదిక పేర్కొంది.

భారత ఓటీటీ(ఓవర్‌ ద టాప్‌) స్ట్రీమింగ్‌ వీడియో మార్కెట్‌ రాణిస్తోంది. ఈ ఏడాది ఓటీటీల ఆదాయం 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.24,000 కోట్ల) స్థాయిలో ఉంటుందని, 2027 కల్లా ఇది రెట్టింపునకు మించి 7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.56,000 కోట్ల)కు చేరొచ్చని మీడియా పార్టనర్స్‌ ఏషియా(ఎమ్‌పీఏ) తన తాజా నివేదికలో పేర్కొనంది. ప్రాంతీయంగా ఏర్పాటవుతున్న కంపెనీలు సైతం, మంచి కంటెంట్‌తో అంతర్జాతీయ దిగ్గజాలకు సవాలు విసురుతున్నాయి. ఈ రంగంలోకి టెలికాం కంపెనీల రాక కీలకంగా మారనుంది. నివేదిక ఇంకా ఏమంటోందంటే..

ఆసియా పసిఫిక్‌లో..

* మొత్తం ఆసియా పసిఫిక్‌ ఆన్‌లైన్‌ వీడియో పరిశ్రమ ఆదాయం 16 శాతం వృద్ధితో 2022లో 49.2 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని అంచనా. ఇందులో ఎస్‌వీఓడీ(సబ్‌స్క్రిప్షన్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌) వాటా 50 శాతం; యూజీసీ(యూజర్‌ జనరేటెడ్‌) ఏవీఓడీ(అడ్వర్టయిజింగ్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌) వాటా 37%; ప్రీమియం ఏవీఓడీ వాటా 13 శాతం చొప్పున ఉండొచ్చు

* 8 శాతం సమ్మిళిత వృద్ధి రేటు(సీఏజీఆర్‌)తో 2027 కల్లా ఈ పరిశ్రమ 72.7 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చు. అపుడు కూడా ఎస్‌వీఓడీ:ఏవీఓడీ నిష్పత్తి స్థిరంగా ఉంటుందని అంచనా

* చైనాను మినహాయించి ఆసియా పసిఫిక్‌ ఆన్‌లైన్‌ వీడియో పరిశ్రమ 2022లో 24 శాతం మేర వృద్ధి చెంది 25.6 బి.డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయొచ్చని అంచనా. 2027 కల్లా ఇది 11 శాతం సీఏజీఆర్‌తో 42.8 బి.డాలర్లకు చేరొచ్చు.

భారత్‌లో..

దేశీయ ఓటీటీలు మార్కెట్‌ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. జీ, సోనీ విలీనమై సరికొత్త టీవీ, ఆన్‌లైన్‌ వీడియో వ్యాపారాన్ని మొదలుపెట్టనున్నాయి. రిలయన్స్‌ వ్యూహాల మద్దతు ఉన్న వయకామ్‌18కు చెందిన కొత్త స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం తన ఐపీఎల్‌ క్రికెట్‌, స్థానిక వినోదంతో ఓవీఓడీ రంగంలో ప్రముఖ సంస్థగా మారొచ్చు. జియో మొబైల్‌, కనెక్టెడ్‌ టీవీల ద్వారా ఎక్కువ వాటాను పొందొచ్చు.

అయిదింటిదే హవా..

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎమ్‌ఎన్‌సీ డిజిటల్‌, వీఐయూలు ఈ ఏడాది ప్రీమియం వీడియో ఆదాయంలో 75% వాటా పొందాయని నివేదిక తెలిపింది. మొత్తం ఆసియా పసిఫిక్‌ ఆన్‌లైన్‌ వీడియో ఆదాయంలో 20 ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫారాలదే 67% వాటా ఉండొచ్చని అంచనా. చైనాను మినహాయించిన ఆసియా పసిఫిక్‌లో యూట్యూబ్‌కు ఏవీఓడీలో 42% వాటా ఉంది. చైనాను మినహాయించిన ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌కు 33%, అమెజాన్‌ ప్రైమ్‌కు 12%, డిస్నీ+ హాట్‌స్టార్‌కు 11% చొప్పున ఎస్‌వీఓడీ వాటా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆన్‌లైన్‌ వీడియో పరిశ్రమలో భవిష్యత్‌లో ఆసియా పసిఫక్‌ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని