రక్షణకు ఓ మోస్తరు పెంపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు.

Updated : 02 Feb 2024 05:33 IST

డీప్‌-టెక్‌ సాంకేతికతల బలోపేతానికి కొత్త పథకం!
‘ఆత్మ నిర్భరత’కు పెద్దపీట

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ పద్దు కింద రూ.6.21 లక్షల కోట్లు ప్రతిపాదించారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఇది 13.04 శాతం. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.5.94 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 4.72 శాతం అధికం. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగడం, వ్యూహాత్మక జలాల్లో మారుతున్న భద్రత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • తాజా రక్షణ పద్దులో రూ.1.72 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా నిర్ధరించారు. కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర సాధన సంపత్తికి దీన్ని వెచ్చిస్తారు. 2023-24 బడ్జెట్‌లో ఈ పద్దు కింద రూ.1.62 లక్షల కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం అది రూ.1.57 లక్షల కోట్లుగా ఉంది. వాస్తవ వ్యయంతో పోలిస్తే గత బడ్జెట్‌ కన్నా ఈసారి 9.40 శాతం మేర పెట్టుబడి వ్యయాన్ని పెంచారు.
  • పెట్టుబడి వ్యయంలో విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ.40,777 కోట్లు, ఇతర సాధన సంపత్తి కోసం రూ.62,343 కోట్ల కేటాయింపు.
  • రెవెన్యూ వ్యయం కింద రూ.4,39,300 కోట్లు. అందులో రక్షణశాఖ పెన్షన్లకు రూ.1,41,205 కోట్లు. రెవెన్యూ వ్యయంలో సైన్యానికి రూ.1,92,680 కోట్లు, నౌకాదళానికి రూ.32,778 కోట్లు, వాయుసేనకు రూ.46,223 కోట్లు.
  • సరిహద్దుల్లో మౌలిక వసతుల బలోపేతానికి రూ.6,500 కోట్లు, తీర రక్షణ దళానికి రూ.7,651 కోట్లు.
  • రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు    రూ.23,855 కోట్లు.
  • రక్షణ రంగంలో అధునాతనమైన డీప్‌-టెక్‌ సాంకేతిక పరిజ్ఞానాల బలోపేతానికి ఒక కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆయుధ ఉత్పత్తిలో ఆత్మనిర్భరత (స్వయం సమృద్ధి)కు పెద్దపీట వేశారు.

అంతర్గత భద్రతకు ప్రాధాన్యం

‘హోం’కు రూ.2 లక్షల కోట్లు దాటిన కేటాయింపులు

దిల్లీ: బడ్జెట్‌లో కేంద్ర హోంశాఖకు రూ.2,02,868.70 కోట్లను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇందులో సింహభాగాన్ని.. సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ వంటి పారామిలటరీ బలగాలకు ప్రత్యేకించారు. తద్వారా అంతర్గత భద్రత, సరిహద్దు రక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం మీద కేంద్ర పోలీసు బలగాలకు రూ.1,32,345.47 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్‌లో హోంశాఖకు రూ.1,96,034.94 కోట్లను కేటాయించారు.

  • తాజా మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర కేబినెట్‌కు రూ.1,248.91 కోట్లు ప్రతిపాదించారు. మంత్రిమండలి, కేబినెట్‌ సెక్రటేరియట్‌, ప్రధాన మంత్రి కార్యాలయ వ్యయాలతోపాటు ప్రభుత్వ అతిథులకు ఆతిథ్యం, వినోద ఖర్చులకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. గత బడ్జెట్‌లో ఈ పద్దు కింద రూ.1,803.01 కోట్లు కేటాయించారు.
  • వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా వ్యయం, ప్రత్యేక మౌలిక వసతుల పథకం కింద రూ.3,199.62 కోట్లు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.335 కోట్లు, సురక్షిత నగర ప్రాజెక్టులకు రూ.214.44 కోట్లు, ల్యాండ్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌   ఇండియాకు రూ.330 కోట్లు కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని