ఆదాయపు పన్ను ఏం మారలే!

ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్‌లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

Updated : 02 Feb 2024 05:32 IST

ఉద్యోగులకు దక్కని ఊరట

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్‌లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. దిగుమతి సుంకాలు సహా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పులూ ఉండవని ప్రకటించారు. ‘గత పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 2.4 రెట్లు అధికమయ్యింది. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయినీ దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికీ ఉపయోగిస్తున్నామని నేను హామీ ఇస్తున్నా. పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతుకు నేను అభినందనలను తెలియజేస్తున్నా’ అని ఆమె అన్నారు. పదేళ్లలో ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించినట్లు, హేతుబద్ధీకరించినట్లు తెలిపారు. ‘2013-14 ఆర్థిక సంవత్సరంలో మినహాయింపు పరిమితి రూ.2.2 లక్షలు ఉండేది. ఇప్పుడు కొత్త పన్నుల విధానంలో రూ.7 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారికీ ఎలాంటి పన్ను బాధ్యత లేదు. చిన్న వ్యాపారుల పన్ను పరిధినీ రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచాం. వృత్తి నిపుణుల ఆదాయ పరిమితినీ రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ పెంచాం. కార్పొరేట్‌ పన్నునూ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించాం. కొన్ని దేశీయ కంపెనీలకూ, కొన్ని కొత్త తయారీ కంపెనీలకూ ఇది 15 శాతమే’ అని సీతారామన్‌ తెలిపారు.


10 రోజుల్లోనే పరిశీలన..

గత అయిదేళ్లలో పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపర్చడంపై దృష్టి సారించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ అప్పీల్‌ను ప్రవేశ పెట్టడంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు. నవీకరించిన ఆదాయపు పన్ను రిటర్నులు, కొత్త ఫారం 26ఏఎస్‌, పన్ను రిటర్నులను ముందుగానే నింపడంలాంటి వాటి ద్వారా రిటర్నుల దాఖలు మరింత సులభమయ్యిందని పేర్కొన్నారు. రిటర్నుల పరిశీలనకు 2013-14లో సగటున 93 రోజులు పట్టేదని, ఇప్పుడు కేవలం 10 రోజుల్లోనే ఇది పూర్తవుతోందని తెలిపారు. దీనివల్ల రిఫండుల చెల్లింపు వేగంగా పూర్తవుతోందన్నారు.


నోటీసుల ఉపసంహరణ..

వివాదాస్పదమైన ప్రత్యక్ష పన్ను డిమాండ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ‘1962 నుంచి ఇవి ఇంకా పుస్తకాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. నిజాయతీతో పన్ను చెల్లిస్తున్న వారికి ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి. తదుపరి సంవత్సరాల్లో రిఫండుకూ ఇబ్బంది అవుతోంది. ఈ నేపథ్యంలో 2009-10 ఆర్థిక సంవత్సరం వరకూ ఉన్న రూ.25వేల లోపు డిమాండు నోటీసులనూ, 2010-11 నుంచి 2014-15 వరకూ ఉన్న రూ.10వేల లోపు ప్రత్యక్ష పన్ను బకాయి డిమాండు నోటీసులను ఉపసంహరించుకోవాలని ప్రతిపాదిస్తున్నా’ అని సీతారామన్‌ తెలిపారు. దీనివల్ల కోటి మంది ప్రయోజనం పొందుతారని వెల్లడించారు. వీరందరూ రూ.3,500 కోట్ల మేర లబ్ధిపొందుతారని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్ర వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని