సాగు సాయం అంతంతే!

వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు.

Published : 02 Feb 2024 05:47 IST

కేటాయింపులు స్వల్పంగా పెంపు
వంటనూనెల రంగంలో ఆత్మనిర్భరతకు ప్రణాళిక
పాడిరైతుల కోసం సమగ్ర కార్యక్రమం
అయిదు సమీకృత ఆక్వాపార్కుల ఏర్పాటు

దిల్లీ: వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. మత్స్య, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖకు రూ.7,105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్‌, ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రైతుల ఆదాయం పెంచేందుకు, వ్యవసాయ రంగంలో విలువ  జోడింపునకు మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆమె పలు కీలక ప్రకటనలు చేశారు.


నూనెగింజల సాగుకు ప్రోత్సాహం

దేశీయంగా నూనెగింజల సాగును ప్రోత్సహించడం ద్వారా వంటనూనెల రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఓ వ్యూహం రూపొందిస్తారు. భారత్‌ ప్రస్తుతం విదేశాల నుంచి పెద్దమొత్తంలో వంటనూనెలు దిగుమతి చేసుకుంటోంది. 2022 నవంబరు నుంచి 2023 అక్టోబరు వరకు (మార్కెటింగ్‌ సంవత్సరంలో) రూ.1.38 లక్షల కోట్ల విలువ చేసే సుమారు 165 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. ఈ నేపథ్యంలో వేరుసెనగ, నువ్వులు, ఆవాలు, సోయా, పొద్దుతిరుగుడు సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తారు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలపై పరిశోధన, ఆధునిక సాగు పద్ధతుల వినియోగం, మార్కెట్‌ అనుసంధానం, పంటల బీమా అందులో ఉంటాయి.


పాల ఉత్పాదకత పెంచేందుకు..

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. కానీ, పశువుల పాల ఉత్పాదకత తక్కువగా ఉంది. ఇప్పటికే ఉన్న రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌, నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌, డెయిరీ ప్రాసెసింగ్‌- పశు పోషణ కోసం ‘మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులు’ వంటి పథకాల ఆధారంగా పాడి రైతులను ఆదుకునేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తారు.


11.8 కోట్ల మందికి ‘పీఎం కిసాన్‌’

‘‘పీఎం కిసాన్‌ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు. 4 కోట్ల మందికి పీఎం ఫసల్‌ బీమా అందించారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సంపద యోజన కింద 38 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. 10 లక్షల మందికి ఉపాధి లభించింది. మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పథకం ద్వారా 2.4 లక్షల స్వయం సహాయక సంఘాలకు, వ్యక్తిగతంగా 60 వేల మందికి రుణసాయం అందించారు.


మత్స్య సంపద పెంపు..

ఆక్వా రంగంలో ప్రస్తుతం హెక్టారుకు 3 టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతోంది. దీన్ని 5 టన్నులకు పెంచేందుకు, ఎగుమతులను రెట్టింపు అంటే రూ.లక్ష కోట్లకు పెంచేందుకు, సమీప భవిష్యత్తులో 55 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకం అమలును ముమ్మరం చేస్తారు. అయిదు సమీకృత ఆక్వాపార్కులు ఏర్పాటు చేస్తారు. నానో యూరియా విధానం విజయవంతమైన నేపథ్యంలో నానో లిక్విడ్‌ డీఏపీ వినియోగాన్ని అన్ని అగ్రో-క్లైమేటిక్‌ జోన్లకు విస్తరిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని