అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..

అధిక పింఛను అమలు, పెన్షన్‌ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది.

Updated : 09 Feb 2024 12:23 IST

వేతనజీవులు, పింఛనుదారుల్లో గందరగోళం
దామాషా పద్ధతి తెరపైకి తెచ్చిన ఈపీఎఫ్‌వో
10న సీబీటీ కీలక సమావేశంలో చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: అధిక పింఛను అమలు, పెన్షన్‌ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకే పార్ట్‌గా పింఛను ఫార్ములా ఉంటుందని పేర్కొంటూనే ప్రాంతీయ కార్యాలయాల సందేహాల నివృత్తికి ఇస్తున్న వివరణల్లో మాత్రం దామాషా విధానాన్ని తెరపైకి తేవడం దరఖాస్తుదారులను గందరగోళంలోకి నెడుతోంది. దేశంలోని కొన్ని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాలు దామాషా విధానంలో పార్ట్‌-1, పార్ట్‌-2 విభాగాలుగా పింఛను లెక్కిస్తుంటే, మరికొన్ని ఒకేపార్ట్‌ కింద లెక్కిన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 10న (శనివారం) జరిగే ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో ఈ విషయమై ప్రధానంగా చర్చ జరగనుంది. అధిక పింఛను లెక్కింపుపై కేటగిరీల వారీగా స్పష్టమైన ఉదాహరణలు ఉండాలని సీబీటీ సభ్యులు ఈ సమావేశంలో డిమాండ్‌ చేయనున్నారు. తద్వారా అధిక పింఛను అమల్లో ఎదురవుతున్న అడ్డంకుల్ని అధిగమించాలని భావిస్తున్నారు. లెక్కింపుపై స్పష్టత కొరవడటంతో పలు కార్యాలయాల్లో పరిష్కారం నిలిచిపోయింది. డిమాండ్‌ నోటీసుల ప్రకారం ఇప్పటికే బకాయిలు చెల్లించిన దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

తొలుత ఇచ్చిన లెక్కింపు విధానమిదీ....

అధిక పింఛను లెక్కింపు ఫార్ములాపై ఈపీఎఫ్‌వో 2023 జూన్‌ 1న డిసెంబరు 13న స్పష్టత ఇచ్చింది. వాటి ప్రకారం... 2014 సెప్టెంబరు 1కి ముందు రిటైరైన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా పింఛను లెక్కించాలి. 2014 సెప్టెంబరు 1 తరువాత పదవీ విరమణ చేసే వారికి చివరి 60 నెలల సగటు వేతనం, పూర్తిసర్వీసు ఆధారంగా గణించాలి.

నెలరోజుల వ్యవధిలోనే మార్పు...

కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు పార్ట్‌-1, పార్ట్‌-2 కింద పింఛను లెక్కించాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని విజయవాడ, బెంగళూరు, తెలంగాణ తదితర ప్రాంతీయ కార్యాలయాలు కేంద్ర ఈపీఎఫ్‌ కార్యాలయాన్ని అభ్యర్థించాయి. 2024 జనవరి 11, 12న జరిగిన సమీక్ష సమావేశంలో ‘‘అధిక పింఛనుపై సుప్రీంకోర్టు ఎలాంటి ఫార్ములా ఇవ్వలేదు. దామాషా పద్ధతి కింద పింఛను లెక్కించాలి. ఇకమీదట ఎలాంటి వివరణలు ఈ విషయంలో అనుమతించబోం’’ అని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఈనెల 10న జరగనున్న సీబీటీ సమావేశ ఎజెండాలోనూ దామాషా పద్ధతిలో పింఛను లెక్కించాలన్న నిబంధన చేర్చినట్లు తెలిసింది.

దామాషా పద్ధతి కింద ఇలా..

2014 సెప్టెంబరు 1కి ముందు వేతన సగటు పరిమితి రూ.6,500కు లోబడి, ఆ తరువాత రూ.15వేలకు లోబడి ఈపీఎస్‌ చందా చెల్లిస్తున్నవారికి దామాషా పద్ధతిలో పింఛను లెక్కిస్తున్నారు. అంటే 2014 సెప్టెంబరు 1నాటికి గరిష్ఠంగా రూ.6,500 వేతన సగటు లెక్కన అప్పటివరకు ఉన్న సర్వీసు ఆధారంగా చివరి 12 నెలల వేతన సగటు తీసుకుని పార్ట్‌-1 కింద పింఛను గణిస్తున్నారు. 2014 సెప్టెంబరు 1 తరువాత గరిష్ఠంగా రూ.15వేల వేతన సగటును తీసుకుంటున్నారు. పదవీ విరమణ చేసే నాటికి సర్వీసు ఆధారంగా చివరి 60 నెలల వేతన సగటు తీసుకుని పార్ట్‌-2 కింద పింఛను లెక్కిస్తున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం పదవీ విరమణ పింఛనుగా ఖరారు చేస్తున్నారు. గరిష్ఠ వేతన పరిమితికి లోబడిన కార్మికులకు అమలు చేస్తున్న విధానాన్నే... అధిక పింఛను అర్హత కలిగిన వారికి అమలు చేసేలా వ్యవహరిస్తోంది. అంటే.. అధిక పింఛను దరఖాస్తుదారులకు 2014 సెప్టెంబరు 1 నాటికి ఉన్న సర్వీసుకు చివరి 12 నెలల వేతన సగటు ఆధారంగా పార్ట్‌-1గా, ఆ తరువాత పదవీ విరమణ నాటికి సర్వీసును గణించి చివరి 60 నెలల వేతన సగటు ఆధారంగా పార్ట్‌-2 కింద పింఛను దామాషా పద్ధతి కింద లెక్కించాలన్నట్లు వివరణ ఇచ్చింది. ఈ దామాషా పద్ధతిలో పార్ట్‌-1, పార్ట్‌-2 కింద లెక్కిస్తే చేతికి అందే పింఛను కనీసం 30-40 శాతం వరకు తగ్గే అవకాశముందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దామాషా లెక్కింపు పద్ధతిపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేతన పరిమితి లేకుండా ప్రతినెలా ఈపీఎస్‌ చందా చెల్లిస్తున్నవారికి దామాషా పద్దతి ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయకూడదని డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని