బంగారం, వెండిలో మదుపు...

ఇటీవలి కాలంలో బంగారం, వెండిపై ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో పెట్టుబడులు పెట్టే అలవాటు మదుపరుల్లో పెరుగుతోంది. కేవలం ఈక్విటీలకే పరిమితం కాకుండా.. పెట్టుబడుల్లో కొంత వైవిధ్యం ఉండాలని, అందులో భాగంగా పసిడి, వెండికి కొంత మొత్తం కేటాయించాలని భావిస్తున్నారు.

Published : 30 Sep 2022 00:35 IST

ఇటీవలి కాలంలో బంగారం, వెండిపై ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో పెట్టుబడులు పెట్టే అలవాటు మదుపరుల్లో పెరుగుతోంది. కేవలం ఈక్విటీలకే పరిమితం కాకుండా.. పెట్టుబడుల్లో కొంత వైవిధ్యం ఉండాలని, అందులో భాగంగా పసిడి, వెండికి కొంత మొత్తం కేటాయించాలని భావిస్తున్నారు. అటువంటి వారికి అనువైన రీతిలో మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా మోతీలాల్‌ ఓస్వాల్‌ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ ఈటీఎఫ్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 7న ముగియనుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500. దీనికి అభిరూప్‌ ముఖర్జీ ఫండ్‌ మేనేజర్‌. ఈ పథకం కింద ఇతర మ్యూచువల్‌ ఫండ్లకు చెందిన గోల్డ్‌, సిల్వర్‌ ఈటీఎఫ్‌ పథకాలను కొనుగోలు చేస్తారు. బంగారంపై పెట్టుబడికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌, నిప్పాన్‌ ఇండియా ఈటీఎఫ్‌ గోల్డ్‌ బీస్‌, ఎస్‌బీఐ- ఈటీఎఫ్‌ గోల్డ్‌, కోటక్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్‌ ఈటీఎఫ్‌లను పరిశీలించే అవకాశం ఉంది. వెండి పథకాల కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌, నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌, ఆదిత్య బిర్లా సిల్వర్‌ ఈటీఎఫ్‌లను పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రధానంగా బంగారం ఈటీఎఫ్‌లకు 70 శాతం నిధులు, మిగిలిన సొమ్ము వెండి ఈటీఎఫ్‌ యూనిట్లకు కేటాయించే అవకాశం ఉంది. మదుపరులు తమ పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.


భిన్నమైన పథకాల్లో...

ఒకే మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ద్వారా పలు భిన్నమైన పెట్టుబడులు పెట్టే వ్యూహంతో ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వినూత్న ఫండ్‌ను ఆవిష్కరించింది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మల్టీ ఇండెక్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) న్యూ ఫండ్‌ ఆఫర్‌ వచ్చే నెల 10న ముగియనుంది. కనీస పెట్టుబడి రూ.100. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. దీనికి వినోద్‌ భట్‌ ఫండ్‌ మేనేజర్‌. సాధారణంగా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పథకాలు ఇతర మ్యూచువల్‌ ఫండ్లకు చెందిన ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ పథకాల్లో మదుపు చేస్తాయి. కేవలం ఈక్విటీకే పరిమితం కాకుండా కొంత మేరకు డెట్‌ పథకాలకూ పెట్టుబడులు కేటాయిస్తాయి. ఆకర్షణీయమైన అవకాశాలు ఉంటే బంగారం, వెండి ఈటీఎఫ్‌ల్లో సైతం పెట్టుబడి పెడతాయి. దేనిపై ఎంత మేరకు మదుపు చేయాలన్నది పరిస్థితులను బట్టి, ఫండ్‌ మేనేజర్‌ నిర్ణయం తీసుకుంటారు. మదుపరులు వేర్వేరు పథకాలను ఎంచుకునే అవసరం లేకుండా, మల్టీ ఇండెక్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ద్వారా భిన్నమైన పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఈ ఫండ్‌ కల్పిస్తోందని చెప్పొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts