బంగారంలో మదుపు...

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ బంగారంలో మదుపు చేయాలనుకునే వారికోసం యూటీఐ గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ పేరుతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 21 ముగుస్తుంది.

Updated : 14 Oct 2022 05:51 IST

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ బంగారంలో మదుపు చేయాలనుకునే వారికోసం యూటీఐ గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ పేరుతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 21 ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి వచ్చిన తొలి ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఇదే కావడం గమనార్హం. ఈ పథకం కింద సమీకరించిన సొమ్మును యూటీఐ గోల్డ్‌ ఈటీఎఫ్‌ యూనిట్లలో పెట్టుబడి పెడుతుంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించటంతో పాటు, ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మదుపరులు నష్టభయాన్ని తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగా బంగారంపై కొంత పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం అనే అభిప్రాయం ఉంది. యూటీఐ గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఇందుకు వీలు కల్పిస్తుంది. దీర్ఘకాలిక మదుపరులకు ఇది అనుకూలం.


తక్కువ నష్టభయంతో..

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రెండు కొత్త ఇండెక్స్‌ పథకాలను ఆవిష్కరించింది. మిరే అసెట్‌ నిఫ్టీ ఏఏఏ పీఎస్‌యూ బాండ్‌ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ ఏప్రిల్‌ 2026 50:50 ఇండెక్స్‌ ఫండ్‌. ఇది ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్‌.. ఏప్రిల్‌ 30, 2026 నాడు లేదా అంతకంటే ముందు మెచ్యూరిటీ ఉన్న ట్రిపుల్‌-ఏ రేటింగ్‌ ఉన్న పీఎస్‌యూ బాండ్లు, రాష్ట్రాల అభివృద్ధి రుణాల్లో (ఎస్‌డీఎల్‌) మదుపు చేస్తుంది. ఈ పథకంలో క్రెడిట్‌ రిస్కు చాలా తక్కువ. మిరే అసెట్‌ క్రిసిల్‌ ఐబీఎస్‌ గిల్డ్‌ ఇండెక్స్‌- ఏప్రిల్‌ 2033 ఇండెక్స్‌ ఫండ్‌, ఏప్రిల్‌ 29, 2033 నాడు లేదా అంతకంటే ముందు గడువు తీరే ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేస్తుంది. పదేళ్ల దీర్ఘకాలం పాటు పెట్టుబడిని కొనసాగించే వీలుండటం వల్ల అధిక ప్రతిఫలాన్ని ఆశించవచ్చు. ఈ రెండు పథకాల ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 18. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీరేట్లను పెంచుతూ వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్లకు ఆదరణ లభిస్తుందని మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది.


అమెరికా కంపెనీల్లో..

యూఎస్‌లోని నాస్‌డాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలోని మొదటి 100 కంపెనీల్లో పరోక్షంగా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించే కొత్త పథకాన్ని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. యాక్సిస్‌ నాస్‌డాక్‌ 100 ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 21. కనీస పెట్టుబడి రూ.500. ఈ పథకానికి హితేశ్‌ దాస్‌ ఫండ్‌ మేనేజర్‌. ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ కాబట్టి, నాస్‌డాక్‌ 100 ఈటీఎఫ్‌ ఫండ్ల యూనిట్లలో మదుపు చేస్తుంది. దీనికోసం ఎక్స్‌ట్రాకర్‌ నాస్‌డాక్‌ 100, ఐషేర్‌ నాస్‌డాక్‌ 100, ఇన్వెస్కో నాస్‌డాక్‌ 100 అనే ఈటీఎఫ్‌ పథకాలను ఎంచుకుంటుంది. ఫండ్‌ ఆఫ్‌ ఫండ్ల నిర్వహణ వ్యయాల నిష్పత్తి కొంత ఎక్కువగా ఉంటుంది. ఇదొక ప్రతికూలాంశం. ప్రపంచ మార్కెట్లలో, ముఖ్యంగా అమెరికాలోని టెక్‌ దిగ్గజ కంపెనీల్లో మదుపు చేసే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుంది. పెట్టుబడుల్లో కొంత వైవిధ్యం ఉండాలని అనుకునే వారు దీన్ని పరిశీలించవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని