Stock Market: స్టాక్‌ మార్కెట్‌.. పాటిద్దాం.. ఈ మదుపు సూత్రాలు..

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవన కాల గరిష్ఠాలను చేరుకున్నాయి. వడ్డీ రేట్లలో తగ్గుదల, స్థిరమైన దేశీయ ఆర్థిక పరిస్థితులవంటి అనుకూల పరిస్థితుల కారణంగా ఈ వృద్ధి ధోరణి కొనసాగుతుందనే మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated : 19 Jan 2024 10:34 IST

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవన కాల గరిష్ఠాలను చేరుకున్నాయి. వడ్డీ రేట్లలో తగ్గుదల, స్థిరమైన దేశీయ ఆర్థిక పరిస్థితులవంటి అనుకూల పరిస్థితుల కారణంగా ఈ వృద్ధి ధోరణి కొనసాగుతుందనే మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా పెరుగుతున్న షేర్ల విలువల మధ్య పెట్టుబడులు కొనసాగించాలా? వద్దా అనే సందేహం చాలామందికి వస్తోంది. అప్పుడప్పుడూ సూచీలకు వస్తున్న నష్టాలు వారిని ఆందోళనలోనూ పడేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మదుపరులు పాటించాల్సిన సూత్రాలేమిటో చూద్దాం..

కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలుంటాయి. మరికొన్ని పదేళ్ల తర్వాత సాధించేవి ఉంటాయి. వివిధ అవసరాలు, పెట్టుబడి కాలాలు, లక్ష్యాలు తదితరాల ఆధారంగా మన ప్రణాళిక రూపొందించుకోవాలి. స్టాక్‌ మార్కెట్‌ పనితీరును కచ్చితంగా అంచనా వేయలేమనే సంగతినీ మర్చిపోవద్దు. నిన్నటి పనితీరు నేడు, నేటి పనితీరు రేపు ఉంటుందన్న హామీ ఇక్కడేమీ ఉండదు. మార్కెట్‌ గమనం ఎటువైపు సాగుతుందన్న ఆలోచన ఎప్పుడూ సరికాదు. మంచి పెట్టుబడులను ఎంచుకొని, దీర్ఘకాలం కొనసాగిన వారికి మార్కెట్‌ ఎప్పుడూ మంచి ఫలితాలనే అందిస్తుందని చరిత్ర చెబుతోంది.

ఎంపిక జాగ్రత్తగా..

ఇటీవలి కాలంలో మార్కెట్‌ ఇస్తున్న లాభాలను చూసిన చాలామంది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లతోపాటు, నేరుగా షేర్లలోనూ మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు, ఫండ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తమ మొత్తం పెట్టుబడులను వీటికే కేటాయిస్తున్నారు. మార్కెట్‌ పనితీరు బాగున్నప్పుడు వీటితో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, ఒక్కసారి దిద్దుబాటు వస్తే నష్టాలు అధికంగా చూడాల్సి వస్తుంది. కాబట్టి, పోర్ట్‌ఫోలియోను ఎంపిక చేసుకునేటప్పుడు, లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు, ఫండ్లు ఉండేలా చూసుకోవడం మంచిది.

భిన్నమైన పథకాల్లో...

స్టాక్‌ మార్కెట్‌ పెరుగుతోంది కదా అని ఉన్న పెట్టుబడి మొత్తం అంతా షేర్లలోనే మదుపు చేయడమూ సరికాదు. లక్ష్యం, పెట్టుబడి వ్యవధి ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. అప్పుడే నష్టభయమూ పరిమితంగా ఉంటుంది. మంచి రాబడిని ఆర్జించేందుకూ వీలవుతుంది. పెట్టుబడి పథకాలను వృద్ధి, నాణ్యత, విలువ ఆధారంగా చూడాలి. మార్కెట్లో  అందుబాటులో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మనకు ఏది సరిపోతుంది అనేది తెలుసుకుంటే చాలు. పెట్టుబడుల్లో 15-20 శాతం వరకూ అంతర్జాతీయ ఫండ్లకూ కేటాయించాలి.

డెట్‌ ఫండ్లలోనూ...

కేవలం ఈక్విటీల్లోనే పెట్టుబడులు కొనసాగించడం అన్ని వేళలా సరికాదు. కనీసం 10-15 శాతం వరకూ డెట్‌ పథకాలకూ మళ్లించాలి. 10 శాతం వరకూ బంగారంలోనూ మదుపు చేయాలి. ఈక్విటీ మార్కెట్‌లో దిద్దుబాటు వచ్చినప్పుడు ఈ పెట్టుబడులు కొంత ఊరటనిస్తాయి. గత ఏడాది కాలంలో బంగారం 14 శాతం వరకూ రాబడినిచ్చిన విషయం ఇక్కడ గమనార్హం. ఈటీఎఫ్‌లు, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌, ఇండెక్స్‌ ఫండ్ల ద్వారా ఈ పాసివ్‌ పెట్టుబడులు పెట్టేందుకూ ప్రయత్నించాలి.

సమీక్షించండి..

మీ ప్రస్తుత పెట్టుబడులను ఒకసారి సమీక్షించుకోండి. సూచీల్లో వృద్ధి కారణంగా మీ ఈక్విటీ పెట్టుబడుల మొత్తం పెరిగిపోవచ్చు. ఇందులో కొంత భాగాన్ని వెనక్కి తీసుకొని, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించవచ్చు. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ పథకాల్లో ఉన్న పెట్టుబడులనూ ఒకసారి పరిశీలించండి. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌లలో అధికంగా ఉంటే.. వాటిని కొంత మేరకు విక్రయించి, లార్జ్‌ క్యాప్‌లోకి మార్చండి.
మార్కెట్‌ను నిరంతరం ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి సానుకూలంగానూ, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మార్కెట్‌ స్పందిస్తుంది. పెట్టుబడిదారులు ఎప్పుడూ మార్కెట్‌ పరిస్థితులను అర్థం చేసుకుంటూ అడుగులు వేయాలి. పెట్టుబడి మార్గాలను అర్థం చేసుకోవడం, వాటిని ఎంపిక చేసుకోవడంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. అప్పుడే మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము, మీ కోసం కష్టపడటం ప్రారంభిస్తుంది.


వెనక్కి తీసుకోవద్దు..

ఈక్విటీ మార్కెట్‌ మంచి లాభాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన లాభాలను వెనక్కి తీసుకొని, మార్కెట్‌ నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచనతోనూ కొందరు ఉంటున్నారు. దీర్ఘకాలిక లక్ష్యం కోసం మదుపు చేస్తున్నప్పుడు ఇలాంటి స్వల్పకాలిక లాభాలపై దృష్టి పెట్టకూడదు. ఇప్పుడు మార్కెట్‌ వృద్ధి దశ కొనసాగుతోంది. గత పదేళ్లుగా క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేసిన వారికి మంచి రాబడులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొత్తం పెట్టుబడి, లాభాలను వెనక్కి తీసుకొని, మార్కెట్‌ తగ్గినప్పుడు మదుపు చేయాలనేదీ సరైన వ్యూహం కాదు. మార్కెట్‌ నుంచి ఒకసారి బయటకు వస్తే.. తిరిగి ప్రవేశించడం అంత తేలిక కాదు. విలువలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అప్పుడు మళ్లీ పోర్ట్‌ఫోలియోను నిర్మించడం కష్టం అవుతుంది. కాబట్టి, క్రమానుగత పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉండాలి. మీకు సంతృప్తి అనిపించినప్పుడు ఆ మేరకు లాభాలను స్వీకరించే ప్రయత్నం చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని