ఈఎల్‌ఎస్‌ఎస్‌ పెట్టుబడులతో పన్ను ఆదా

ఆదాయపు పన్ను మినహాయింపు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉన్న మార్గాల్లో ఈక్విటీ ఆధారిత పెట్టుబడి పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఒకటి.

Published : 19 Jan 2024 00:06 IST

ఆదాయపు పన్ను మినహాయింపు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉన్న మార్గాల్లో ఈక్విటీ ఆధారిత పెట్టుబడి పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఒకటి. మూడేళ్ల లాకిన్‌ వ్యవధితో ఉండే వీటిని కొత్తగా మదుపు ప్రారంభించే వారూ ఎంచుకోవచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

పెట్టుబడి.. పన్ను ఆదా ఈ రెండు ప్రత్యేక మిశ్రమ ప్రయోజనాలను నెరవేర్చేవి ఈఎల్‌ఎస్‌ఎస్‌లు. ఈ ఫండ్లు ప్రధానంగా ఈక్విటీ ఆధారమైనవి. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో 65 శాతం వరకూ పెట్టుబడి పెడతాయి. ఈక్విటీలపై అధిక దృష్టి ఉండటం వల్ల దీర్ఘకాలిక వృద్ధికి అధికంగా అవకాశాలుంటాయి. కాలక్రమేణా మంచి రాబడిని ఈ ఫండ్లు ఆర్జిస్తుంటాయి.

ఈఎల్‌ఎస్‌ఎస్‌లను సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లుగా పేర్కొంటారు. ఈక్విటీ పెట్టుబడుల ద్వారా మదుపరులకు మూలధన వృద్ధిని అందించడమే వీటి ప్రాథమిక లక్ష్యం. ఇతర ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల మాదిరిగా కాకుండా, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని అందిస్తాయి.  ఈ ప్రత్యేకత వల్లే పన్ను భారం తగ్గించుకుంటూ, మదుపు చేయాలనుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికీ ఇవి వీలు కల్పిస్తాయి.
గత ఏడాది డిసెంబరు నాటికి చూస్తే.. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల పథకాల నుంచి వచ్చిన ఏడాది రాబడి దాదాపు 18.8 శాతం వరకూ ఉంది. మూడేళ్ల సగటు రాబడిని పరిశీలిస్తే దాదాపు 20 శాతం కనిపించింది. క్రమానుగత పెట్టుబడి విధానంలో ఈ పథకాల్లో మదుపు చేసిన వారికి మూడేళ్లలో 17.5 శాతం, అయిదేళ్ల వ్యవధిలో 19.2 శాతం వరకూ రాబడిని అందించాయి.
ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో మదుపు చేసిన మొత్తం సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 లోబడి ఉంటుంది. 30 శాతం పన్ను శ్లాబులో ఉన్న వారికి దాదాపు రూ.46,800 వరకూ భారం తగ్గుతుంది.
ఈఎల్‌ఎస్‌ఎస్‌లను తప్పనిసరిగా మూడేళ్ల వరకూ కొనసాగించాలి. అంటే మూడేళ్ల వ్యవధి పూర్తయ్యేదాకా పెట్టుబడులను ఉపసంహరించుకోలేరు. మదుపరులను దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం.
ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు కాబట్టి, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు మార్కెట్‌ హెచ్చుతగ్గులకు ప్రభావితం అవుతుంటాయి. దీర్ఘకాలంలో నష్టభయం పరిమితం అవుతాయి. లాభాలను ఆర్జించేందుకు అవకాశాలు ఉంటాయి. ఇతర పన్ను ఆదా పథకాలతో పోలిస్తే ఈఎల్‌ఎస్‌ఎస్‌లు అధిక రాబడులను అందించినట్లు గమనించవచ్చు.


ప్రయోజనాలేమిటి?

వైవిధ్యం: ఈక్విటీ పెట్టుబడుల్లో వైవిధ్యానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌లు భిన్న షేర్లలో మదుపు చేస్తాయి. ఫండ్‌ మేనేజర్లు లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లలో పెట్టుబడి పెట్టేందుకు వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల నష్టభయం తగ్గుతుంది. రాబడి పెరిగేందుకూ వీలవుతుంది. ఈక్విటీ మార్కెట్లలో అనుభవం ఉన్న వారే ఈ ఫండ్లను నిర్వహిస్తుంటారు. కాబట్టి, ఎంతో పరిశోధనతో పెట్టుబడులను ఎంచుకుంటారు.
దీర్ఘకాలంలో: పదవీ విరమణ ప్రణాళిక, పిల్లల ఉన్నత చదువులు, ఇతర అవసరాలకు సంపదను సృష్టించేందుకు ఈ పథకాలు అనువుగా ఉంటాయని చెప్పొచ్చు. ఈక్విటీ మార్కెట్‌ల దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం, పన్ను ప్రయోజనాలు రెండూ మదుపరులకు కలిసొచ్చే అంశాలు.
క్రమానుగతంగా: ఒకేసారి పెద్ద మొత్తంతోనే కాకుండా, చిన్న మొత్తాలతో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)ద్వారా వీటిలో మదుపు చేసేందుకు వీలుంది. కాబట్టి, పాత పన్ను విధానంలో కొనసాగుతున్న వారు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను భారం తగ్గించుకునేందుకు ప్రణాళిక వేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని