పిల్లల చదువులకు భరోసాగా

పిల్లలకు పరీక్షలు మొదలయ్యాయి. ఇవి పూర్తికాగానే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. బడిలో చేరింది మొదలు.. ఉన్నత విద్య వరకూ అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది.

Published : 01 Mar 2024 00:13 IST

పిల్లలకు పరీక్షలు మొదలయ్యాయి. ఇవి పూర్తికాగానే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. బడిలో చేరింది మొదలు.. ఉన్నత విద్య వరకూ అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఆర్థికంగా తల్లిదండ్రులకు ఇదొక సవాలు లాంటిదేనని చెప్పొచ్చు. చిన్నారుల భవితకు భరోసానిచ్చేందుకు అనేక పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎలా ఎంపిక చేసుకోవాలి? చదువుల ఖర్చులను తట్టుకునేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి? తెలుసుకుందాం.

విద్యా ద్రవ్యోల్బణం ఏటా 11-12 శాతం మేరకు పెరుగుతోంది. అదే సమయంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం వరకూ ఉంటోంది. రాబోయే ఆరు నుంచి ఏడేళ్లలో ఇప్పుడున్న విద్యా ఖర్చులు రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉంది. వీటిని తట్టుకోవాలంటే.. ఆ ఖర్చులకు మించి రాబడినిచ్చే పథకాలను ఎంపిక చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే దీర్ఘకాలిక దృష్టితో అధిక రాబడిని అందించే పథకాల్లో మదుపు చేయడం ప్రారôభించాలి. అప్పుడే ఎలాంటి చిక్కులూ లేకుండా పిల్లల ఆశలు తీర్చడంలో తల్లిదండ్రులు విజయం సాధిస్తారని చెప్పొచ్చు.

ధీమానే ముందు..

తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పెట్టుబడులు ప్రారంభించే ముందు కుటుంబానికి తగిన ఆర్థిక రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లల చదువులు, వారి ఇతర బాధ్యతలను తీర్చేలా బీమా పాలసీలు తీసుకోవాలి. సంపాదించే వ్యక్తి తన పేరుమీద.. వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. కుటుంబానికి అంతటికీ వర్తించేలా కనీసం రూ.10లక్షల ఆరోగ్య బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే పిల్లల చదువులకు కేటాయిస్తున్న డబ్బును ఇతర అవసరాలకు మళ్లించాల్సిన అవసరం రాదు.

ఎంత కావాలి?

పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం ప్రణాళిక వేసుకునేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఎంత మొత్తం కావాలి? ఇప్పుడున్న ఫీజులకు ఏటా 12 శాతం అధికంగా కలిపి ఈ అంచనాలు ఉండాలి. దీనికోసం నెలనెలా ఎంత మదుపు చేయాలన్నది. దీనిని లెక్కించేందుకు ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఎన్నో కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి, ఒక అంచనాకు రావచ్చు. ఎంత పెట్టుబడి పెట్టాలన్నదీ తెలిసిపోతుంది. ప్రతి అవసరానికీ ఒక ప్రత్యేక పథకం ఉంటుంది. అలాగే పిల్లల కోసం మదుపు  చేసేటప్పుడూ దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చే వాటిని ఎంచుకోవాలి. ఒక్కో దశలో ఎంత మొత్తం కావాలి? దానికి తగ్గట్టుగా పెట్టుబడులు కేటాయించాలి.

హామీ పథకాల్లో...

విద్యా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని అందుకోవాలంటే.. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ అధిక రాబడినచ్చే పథకాలనే ఎంచుకోవాలి. ఉదాహరణకు 6.1 శాతం రాబడి అంచనాతో నెలకు రూ.62,000 మదుపు చేస్తే 15 ఏళ్ల తర్వాత రూ.1.82 కోట్లు చేతికి అందుతాయి. అదే 15 శాతం రాబడి అంచనాతో నెలకు రూ.27,000 మదుపు చేస్తే చాలు. అంతే మొత్తం సమకూరుతుంది. కాబట్టి, మంచి పనితీరున్న ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకొని, పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. అదే సమయంలో ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి యోజన పథకాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి.

అధిక రాబడికి..

పిల్లల ఆర్థిక అవసరాల కోసం మదుపు చేసేటప్పుడు ఏదో ఒక పథకం మీదనే ఆధారపడటం ఎప్పుడూ మంచిది కాదు. వైవిధ్యమైన పెట్టుబడులు నష్టభయాన్ని తగ్గిస్తాయని మర్చిపోవద్దు. మ్యూచువల్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు ఉండేలా చూసుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్లలోనూ ఈక్విటీ, ఈక్విటీ డైవర్సిఫైడ్‌, మల్టీక్యాప్‌ ఫండ్లు ఉండాలి. డెట్‌ ఫండ్లనూ పరిశీలించాలి. కొంత బంగారంలోనూ మదుపు చేయడం మంచిది. నష్టభయం ఉన్న ఈక్విటీ పథకాలకు ఎంత కేటాయించాలి, సురక్షిత పథకాలకు ఎంత మళ్లించాలి అనేదీ కీలకమే. 10-12 ఏళ్ల వ్యవధి ఉన్నప్పుడు ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను పరిశీలించాలి. 4-5 ఏళ్లు మాత్రమే ఉంటే డెట్‌ ఫథకాలవైపు మొగ్గు చూపడమే శ్రేయస్కరం.

ప్రత్యేక పాలసీలతో...

ప్రత్యేకంగా పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని బీమా సంస్థలు కొన్ని ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చాయి. పాలసీ చేసిన తల్లిదండ్రులు అనుకోకుండా దూరమైనప్పుడు వెంటనే పాలసీ విలువను పరిహారంగా చెల్లిస్తుంది. పాలసీ గడువు తీరే వరకూ కొనసాగుతుంది. దీనికోసం ప్రీమియం వైవర్‌ రైడర్‌ తోడ్పడుతుంది. వ్యవధి ముగిసిన తర్వాత బీమా పాలసీ నుంచి అందాల్సిన డబ్బు చేతికి వస్తుంది. ఇలాంటి పాలసీలనూ పిల్లల చదువుల ప్రణాళికలో భాగం చేయాలి. వీటితోపాటు యూనిట్‌ ఆధారిత పాలసీలనూ ఎంచుకునే ప్రయత్నం చేయొచ్చు. కనీసం 15 ఏళ్ల వ్యవధికి పాలసీలు తీసుకునేందుకు ప్రయత్నించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని