ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...

వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి.

Updated : 28 Mar 2024 13:28 IST

వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి.మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు బీమా సంస్థలు విస్తృత రక్షణను అందించే ఉత్పత్తులు, సేవలను నిరంతరం రూపొందిస్తున్నాయి. బీమా సంస్థలు అనుబంధ పాలసీలతో వీటిని అందిస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి ‘హాస్పిటల్‌ డైలీ క్యాష్‌’. వైద్య పరమైన అత్యవసర పరిస్థితుల్లో ఒక అదనపు రక్షణను ఇది కల్పిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం...

ఆసుపత్రిలో చేరినప్పుడు ఒక్క చికిత్స ఖర్చే కాదు.. దీనికి అనుబంధంగా ఎన్నో ఉంటాయి. సాధారణంగా ఈ వ్యయాలకు బీమా కంపెనీ ఎలాంటి చెల్లింపులూ చేయవు. ఇలాంటప్పుడే హాస్పిటల్‌ డైలీ క్యాష్‌ కవర్‌లాంటి అనుబంధ పాలసీలు తోడుంటాయి. పేరులో సూచించినట్లే.. ఆసుపత్రిలో చేరినప్పుడు రోజుకు నిర్ణీత మొత్తాన్ని అందించేందుకు బీమా సంస్థలు రూపొందించిన అనుబంధ ఆరోగ్య బీమా పాలసీ ఇది. చికిత్స కోసం వాస్తవంగా అయిన మొత్తాన్ని ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ చెల్లిస్తుంది. దీనికి అనుబంధంగా తీసుకునే ఈ పాలసీ.. ముందుగానే నిర్ణయించిన మొత్తాన్ని ఆసుపత్రిలో ఉన్నన్నినాళ్లు రోజువారీ భత్యాన్ని అందిస్తుంది. ఇది ఆసుపత్రి బిల్లులకు అదనం. ఉదాహరణకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు రోజుకు రూ.500 చెల్లించేలా ఈ అనుబంధ పాలసీని ఎంచుకున్నారనుకుందాం. అప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నన్ని రోజులూ రూ.500 చొప్పున చెల్లిస్తుంది. ఖర్చులు రూ.800 అయినా.. రూ.400 అయినా పాలసీకి అవసరం లేదు. మీరు నిర్ణయించుకున్న మొత్తాన్ని చెల్లించడం దీని ప్రత్యేకత. దీన్ని విడిగానూ తీసుకునే అవకాశాన్ని కొన్ని బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. ప్రాథమిక పాలసీకి అనుబంధంగా జోడించుకుంటే.. రోజువారీ నగదు పరిమితి పాలసీ విలువలో 1 శాతం వరకూ ఉండవచ్చు. లేదా స్థిరంగా ఇంత మొత్తం అందిస్తామనే నిబంధనతోనూ రావచ్చు. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలాగానే దీన్నీ జీవిత కాలం పాటు పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈ అనుబంధ పాలసీని తీసుకునేందుకు చాలా స్వల్ప ప్రీమియం చెల్లిస్తే చాలు.

అర్థం చేసుకోవాలి...

రోజువారీ ఎంత మొత్తం చెల్లించాలి అనేది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. బీమా పాలసీని తీసుకునేటప్పుడు ఇచ్చిన ఎంపికల నుంచీ ఎంచుకోవచ్చు. ఈ మొత్తం సాధారణంగా రోజుకు రూ.500 నుంచి కొన్ని వేల రూపాయల వరకూ ఉండొచ్చు. ఏదైనా క్లిష్ట సమస్యతో ఐసీయూలో చేరాల్సి వస్తే.. రోజువారీ నగదు భత్యం కొన్ని రోజులకు రెట్టింపు లభిస్తుంది. ఉదాహరణకు రోజువారీ చెల్లించే నగదు రూ.1,000 ఉందనుకుందాం. ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పుడు ఇది రూ.2,000 అవుతుంది. పాలసీ నిబంధనలకు లోబడి ఇది ఆధారపడి ఉంటుంది.

షరతులు తెలుసుకోవాలి

సంప్రదాయ ఆరోగ్య బీమా పాలసీల మాదిరిగానే, ఆసుపత్రి రోజువారీ నగదు ఖర్చులు చెల్లించేందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ముఖ్యంగా వేచి ఉండే వ్యవధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రిలో చేరినప్పుడు తప్పనిసరిగా 24 గంటలను మించి ఉండాలి. కొన్ని రోజువారీ చికిత్సల కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు ఆ చికిత్సలు ఈ పాలసీ పరిధిలోకి రాకపోవచ్చు. ఏడాది కాలంలో గరిష్ఠంగా 30 నుంచి 90 రోజులపాటే ఈ రోజువారీ నగదు చెల్లింపు ఉంటుంది. కాబట్టి, పాలసీ నిబంధనలు ముందుగానే తెలుసుకోవడం తప్పనిసరి.

అవసరమేమిటి?

  •  ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. కుటుంబ సభ్యులకు ఆహారం, ప్రయాణ ఖర్చుల్లాంటివి సొంతంగా భరించాల్సిందే. హాస్పిటల్‌ డైలీ క్యాష్‌ కవర్‌ తీసుకున్నప్పుడు ఈ అదనపు ఖర్చుల భారాన్ని తగ్గిస్తుంది. ఈ పాలసీ చెల్లించిన మొత్తాన్ని మీ ఇష్టానుసారం వినియోగించుకునే వీలుంది.
  •  మీ ఆరోగ్య బీమా మొత్తానికి మించి క్లెయిమ్‌ ఉంటే, హాస్పిటల్‌ డైలీ క్యాష్‌ కవర్‌ కొంత అదనపు రక్షణ కల్పిస్తుంది. దీనివల్ల మీ చేతి నుంచి భరించే మొత్తం తగ్గుతుంది.
  • అనుకోకుండా ఆసుపత్రిలో చేరినప్పుడు ఎన్నో ఊహించని ఖర్చులు ఉంటాయి. వీటిని కొంతలో కొంత తట్టుకునేందుకు డైలీ క్యాష్‌ కవర్‌ పాలసీ తోడ్పడుతుందని చెప్పొచ్చు. ఈ అనుబంధ పాలసీని మీ ప్రాథమిక పాలసీకి తోడుగా తీసుకోవడం వల్ల ఆర్థికంగా కాస్త వెసులుబాటు దొరుకుతుంది.

- ఆశిష్‌ సేథి, హెడ్‌, హెల్త్‌, ట్రావెల్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని