అధిక వడ్డీ... కాస్త జాగ్రత్త...

ఒకప్పడు స్థిరంగా ఆదాయం రావాలంటే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ఆధునిక కాలంలో ఎన్నో ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాలు వచ్చాయి. ముఖ్యంగా ఫిన్‌టెక్‌ సంస్థల రాకతో.. పెట్టుబడుల తీరు మారిపోయింది.

Updated : 23 Sep 2022 05:51 IST

ఒకప్పడు స్థిరంగా ఆదాయం రావాలంటే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ఆధునిక కాలంలో ఎన్నో ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాలు వచ్చాయి. ముఖ్యంగా ఫిన్‌టెక్‌ సంస్థల రాకతో.. పెట్టుబడుల తీరు మారిపోయింది. ఆకర్షణీయంగా కొత్త పథకాలను ఆవిష్కరిస్తూ, అధిక వడ్డీనిస్తూ ఇవి అందరినీ ఆకర్షించడం ప్రారంభించాయి. మరి వీటిలో మదుపు ఎంత మేరకు సురక్షితం? డిపాజిట్‌ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి చూద్దామా.. 

పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ చాలామంది మదుపరులు ఆశించేది ఇదే. అందుకే, ఎలాంటి నష్టభయం లేని సురక్షిత పెట్టుబడులైన బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్లవైపే చాలామంది చూస్తుంటారు. ఆర్థిక అంశాల్లో పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో చాలామంది కొత్త పథకాల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లాంటి రాబడులూ రావాలని కోరుకుంటున్నారు. వీటినే కొత్తగా వస్తున్న పలు ఫిన్‌టెక్‌ సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ప్రత్యామ్నాయ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ తరహా పథకాలను అందిస్తున్నాయి.

ఆర్‌బీఐ గుర్తింపు పొందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ప్రధానంగా ఈ డిపాజిట్లను ఆకర్షిస్తున్నాయి. ఇవన్నీ కొత్త తరం రుణ సంస్థలు కావడం గమనార్హం. ఉదాహరణకు వాహన రుణాలు లేదా గృహోపకరణాలు తదితరాల కోసం అప్పులిచ్చే సంస్థలు.. తాము 14-15 శాతానికి వడ్డీ ఇస్తామని చెబుతుంటాయి. అదే సమయంలో డిపాజిటర్లకూ 12-13 శాతం వరకూ వడ్డీ లభిస్తుందని చెబుతాయి. కానీ, ఇదంతా అనుకున్నంత సులువేమీ కాదు. మీ పెట్టుబడికి అధిక నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు. ఈ ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చిన అప్పులు తిరిగి వసూలు కాకపోతే.. అసలుకు ఎసరు వచ్చినట్లే. 

* మీకు, రుణం తీసుకునే వ్యక్తికి మధ్యవర్తి పాత్ర మాత్రమే ఈ సంస్థలు పోషిస్తుంటాయి. ఒకవేళ ఈ సంస్థ మూసేశారనుకోండి. అంతే సంగతులు. ఎవరికి అప్పు ఇచ్చారు. వారి నుంచి ఎంత వసూలైంది. వడ్డీ మాటేమిటి ఇవన్నీ పెట్టుబడిదారుడికి తెలియకుండా పోతాయి. 

* బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయడానికి పెద్దగా నిబంధనలు తెలియాల్సిన అవసరం లేదు. ఖాతా ఉన్న శాఖకు వెళ్లి, ఎఫ్‌డీ చేస్తామంటే.. బ్యాంకు సిబ్బందే మీకు సహాయం చేస్తారు. ఇక్కడ అలా కాదు. పూర్తిగా సాంకేతికతపై ఆధారపడి డిపాజిట్లు చేయాలి. మీకూ, రుణగ్రహీతకూ, మధ్యలో ఉన్న ఫిన్‌టెక్‌ సంస్థకూ మధ్య ఒప్పందాలు కుదురుతాయి. వీటిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. 

* రుణదాతను, రుణగ్రహీతను కలిపడమే ఈ సంస్థలు చేసే పని. కొన్ని పరిమితులు, నిబంధనల మేరకు అప్పు తీసుకునే వారిని పరిశీలిస్తాయి. బ్యాంకులు తీసుకున్నంత శ్రద్ధ మాత్రం తీసుకోవు. రుణగ్రహీత అప్పు చెల్లించకపోతే.. వసూలు చేసేందుకు ఇబ్బందులు తప్పవు. షరతుల్లో అప్పు వసూలు కాకపోతే చెల్లించాల్సిన బాధ్యత తమపై ఉండదని ముందే ఉంటుంది. కాబట్టి, అంతిమంగా నష్టపోయేది పెట్టుబడి పెట్టిన వ్యక్తే. 

తక్కువ సందర్భాల్లో మాత్రమే పెట్టిన పెట్టుబడికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అందుతాయి. కొన్ని సంస్థలు కేవలం ఒప్పందం మాత్రమే ఆధారం అని చెబుతుంటాయి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు న్యాయపరంగా పోరాడటమూ కష్టం అవుతుంది.

అధిక వడ్డీ ఆశతో ఇటీవలి కాలంలో చాలామంది ఈ తరహా ప్రత్యామ్నాయ పెట్టుబడులు పెడుతున్నారు. రాబడి అధికంగా వస్తుందంటే.. నష్టభయం కూడా ఎక్కువగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. దీనికి సిద్ధంగా ఉన్నప్పుడే వీటిని పరిశీలించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని