విదేశాల్లో చదువు విద్యారుణానికి సిద్ధం ఇలా..

విదేశాల్లో చదువుకోవాలి.. చాలామంది విద్యార్థుల కల ఇది. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యాభ్యాసం ఖర్చుతో కూడుకున్నదే. ఈ వ్యయాన్ని భరించేందుకు పెట్టుబడులతో జమ చేసిన మొత్తంతో పాటు, విద్యారుణం తీసుకొని, తమ పిల్లల కలను నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు.

Updated : 04 Nov 2022 03:32 IST

విదేశాల్లో చదువుకోవాలి.. చాలామంది విద్యార్థుల కల ఇది. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యాభ్యాసం ఖర్చుతో కూడుకున్నదే. ఈ వ్యయాన్ని భరించేందుకు పెట్టుబడులతో జమ చేసిన మొత్తంతో పాటు, విద్యారుణం తీసుకొని, తమ పిల్లల కలను నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో విద్యారుణం తీసుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలి, అప్పు భారం తొందరగా తీర్చేందుకు  ఏం చేయాలో తెలుసుకుందాం.

మన దేశం నుంచి వెళ్లి విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో విదేశీ ఉన్నత విద్య ఖర్చు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రామాణిక సంస్థలు ప్రకటించిన గణాంకాల ప్రకారం..  భారత విద్యార్థులు విదేశాల్లో చదువు కోసం ఖర్చు చేస్తున్న మొత్తం 28 బిలియన్‌ డాలర్ల మేరకు ఉంది. 2024 నాటికి ఇది 80 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. విదేశాల్లో చదువుకునే వారికి ఉపకార వేతనాల వంటివి ఉన్నప్పటికీ అనేకమంది విద్యార్థులు వీటికి అర్హులు కాలేరు. కాబట్టి, రుణం తీసుకోవడం కొన్నిసార్లు తప్పనిసరి అవుతోంది.

బ్యాంకులు అండగా..

దేశంలో, విదేశాల్లో వృత్తిపరమైన లేదా సాంకేతిక ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం.. భారతీయ రిజర్వు బ్యాంకు, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌లతో కలిసి సమగ్ర రుణ పథకాన్ని రూపొందించింది. దీనిద్వారా కళాశాల, హాస్టల్‌, పరీక్ష, లేబొరేటరీ ఫీజులు, పుస్తకాల ఖర్చు, పరికరాలు, కాషన్‌ డిపాజిట్‌లతో పాటు అనుమతించిన మేరకు బిల్డింగ్‌ ఫండ్‌, రిఫండబుల్‌ డిపాజిట్‌ అవసరాలకు రుణం పొందవచ్చు. ఈ పథకం ద్వారా దేశీయంగానే కాకుండా, విదేశాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు విద్యారుణాన్ని అందిస్తారు. మేనేజ్‌మెంట్‌ కోటా ద్వారా ప్రవేశం పొందిన వారికీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో సహా మరికొన్ని బ్యాంకులూ విద్యారుణాలను అందిస్తున్నాయి. క్యాపిటేషన్‌ ఫీజు, డొనేషన్‌ ఖర్చుల కోసం అప్పు రాదు.

రూ.50 లక్షల వరకూ...

ప్రస్తుతం విద్యారుణాల కోసం క్రెడిట్‌ గ్యారంటీ నిధుల ద్వారా రూ. 7.50 లక్షల రుణం ఎటువంటి పూచీకత్తు లేకుండా పొందవచ్చు. త్వరలోనే ఈ పరిమితిని రూ.10లక్షల వరకూ పెంచే ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహా కొన్ని ఇతర బ్యాంకులు ఎంపిక చేసిన కళాశాలల్లో చేరే విద్యార్థులకు రూ.40 లక్షల నుంచి రూ.50లక్షల వరకూ ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలను ఇస్తున్నాయి.

ఏయే పత్రాలు..

రుణం తీసుకునేందుకు అవసరమైన పత్రాల విషయానికి వస్తే..
* మీ విద్యాభ్యాసానికి సంబంధించిన సర్టిఫికెట్లు, ప్రవేశ పరీక్ష ఫలితాలు
* అడ్మిషన్‌ లెటర్‌
* విదేశాల్లో చదువుకోవాలనుకున్నప్పుడు ‘ఐ 20’
* కాలేజీ నుంచి వచ్చిన ఫీజుల వివరాలు
* మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణలు (సహ దరఖాస్తుదారు/హామీదారులవీ)
* విద్యార్థులకు పాన్‌ కార్డు తప్పనిసరి (మైనర్లకూ ఇది వర్తిస్తుంది)
* ఆదాయపు పన్ను రిటర్నులు
* తనఖా అవసరమైనప్పుడు.. ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలు
* ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం వర్తించే వారికి ఆధార్‌ తప్పనిసరి

సరిపోకపోతే..
కొన్నిసార్లు.. అవసరమైన మేరకు విద్యారుణం రాకపోయే ఆస్కారం ఉంది. ఇలాంటప్పుడు తనఖా రుణాల కోసం ప్రయత్నం చేయాలి. మీరు హామీగా చూపించే ఆస్తి మార్కెట్‌ విలువ, తిరిగి చెల్లించే వ్యవధిని బట్టి రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది. విద్యారుణంతో పోలిస్తే బ్యాంకులకు ఇది సురక్షిత రుణం. కాబట్టి, తక్కువ వడ్డీతో, అధిక రుణాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.

భారం తగ్గించుకునేలా..

విద్యారుణం తీసుకున్నప్పుడు దాన్ని తిరిగి చెల్లించే విషయంలోనూ క్రమశిక్షణతో ఉండాలి. బ్యాంకు ‘లోన్‌ ఆఫర్‌ లెటర్‌’లో మీకు ఎంత మేరకు రుణం వస్తుందన్నది చెబుతుంది. కానీ, పంపిణీ చేసిన మొత్తంపై మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది. కాబట్టి, మీరు ఫీజు చెల్లించాలి అనుకున్నప్పుడే, ఆ మేరకు రుణం తీసుకోండి. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది.
* చదువు పూర్తయి, సంపాదించడం ప్రారంభించగానే రుణాన్ని తిరిగి చెల్లించడంతోపాటు, త్వరగా తీర్చడంపై దృష్టి పెట్టండి. పాక్షిక చెల్లింపులు చేసేందుకు అదనపు నగదు, బోనస్‌లవంటి వాటిని ఉపయోగించాలి.
* విద్యారుణాన్ని సరిగా చెల్లించకపోతే మీకూ, హామీదారులకూ బ్యాంకులు నోటీసులు పంపిస్తాయి. క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది. భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది. రుణాన్ని వసూలు చేసుకునేందుకు బ్యాంకులు న్యాయపరమైన చర్యలను ప్రారంభించవచ్చు. అవసరమైన రుణం తీసుకున్నప్పుడు అందులో ఉండే చిక్కులనూ తెలుసుకోండి.

పన్ను మినహాయింపు..

విద్యారుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్‌ 80ఈ ప్రకారం పూర్తి మినహాయింపు వర్తిస్తుంది. గరిష్ఠంగా ఎనిమిదేళ్లపాటు ఈ మినహాయింపును అనుమతిస్తారు. దీర్ఘకాలిక రుణాన్ని ఎంచుకునేటప్పుడు ఈ నిబంధన గురించి మర్చిపోవద్దు.

గుర్తుంచుకోండి..

* రుణం తీసుకునే ముందు తగిన పరిశోధన అవసరం. ఎంపిక చేసుకున్న కోర్సు, దానికయ్యే ఖర్చు, ఇతర వ్యయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి.
* ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనుకునే వారికి రుణాలు తేలిగ్గానే లభిస్తాయి. విస్తృతమైన పరిశోధనలు చేసి కళాశాలలను ఎంచుకోవాలి. రుణం కోసం బ్యాంకును సొంతంగా, ముందుగానే సంప్రదించండి. ఎంత రుణం వరకూ అర్హులో తెలుసుకోండి. దాన్ని బట్టి, మీ ప్రణాళికలు ఉండాలి. బ్లాక్‌లిస్టులో ఉన్న కాలేజీల్లో చేరేవారికి రుణాలు అందవు.
* రుణానికి వర్తించే వడ్డీ రేటు, పాక్షిక చెల్లింపులు, ముందస్తుగా తీర్చేయడం తదితర నిబంధనలు తెలుసుకోండి.
* వీసా ఇంటర్వ్యూ సమయంలో మీ చదువు, కాలేజీ వివరాల గురించే కాకుండా.. మీ కోర్సు, ప్రొఫెసర్లు, కోర్సు ఖర్చుపై మీకున్న అవగాహన, పొందిన రుణం తదితర వాటిపైనా ప్రశ్నలు ఉండే అవకాశం ఉంటుంది. వీటికి సమాధానాలు స్పష్టంగా ఇవ్వాలి.          

-ఫణి శ్రీనివాసు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని