banking and loan: అప్పు ఇస్తామంటారు మోసం చేస్తారు

నేటి డిజిటల్‌ యుగంలో అనేక ఆర్థిక లావాదేవీలు క్షణాల్లో చక్కబెట్టుకుంటున్నాం.  రుణం తీసుకోవాలన్నా, బీమా పాలసీ చేయించాలన్నా.. ఒక్క క్లిక్‌తోనే సాధ్యం అవుతోంది. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఆకర్షణీయమైన నకిలీ ఆఫర్లతో మోసం చేస్తున్నారు.

Updated : 27 Oct 2023 00:44 IST

నేటి డిజిటల్‌ యుగంలో అనేక ఆర్థిక లావాదేవీలు క్షణాల్లో చక్కబెట్టుకుంటున్నాం.  రుణం తీసుకోవాలన్నా, బీమా పాలసీ చేయించాలన్నా.. ఒక్క క్లిక్‌తోనే సాధ్యం అవుతోంది. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఆకర్షణీయమైన నకిలీ ఆఫర్లతో మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా  ఉండాల్సిందే. లేకపోతే.. కష్టార్జితాన్ని నేరగాళ్ల చేతికి అప్పగించాల్సి వస్తుంది.

క్కువ వడ్డీ రేటుకు రుణం ఇస్తాం.. ఎలాంటి పేపర్లూ అవసరం లేదు అంటూ ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఒక్కసారి మనం సరే అన్నామా.. ఇక అంతే సంగతులు.. ఆ రుసుము, ఈ ఛార్జీలు అంటూ.. రూ.వేలకు వేలు వసూలు చేసి, మళ్లీ కనిపించకుండా పోతారు. గత ఆర్థిక సంవత్సరంలో 9,000 పైగా బ్యాంకింగ్‌, రుణ మోసాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ మోసాల విలువ దాదాపు రూ.60వేల కోట్ల పైనే ఉండటం గమనించాల్సిన విషయం.

సాధారణంగా మోసగాళ్లు ఎలాంటి మాటలు చెబుతారంటే..

  • పరిశీలనా రుసుము: బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి మాట్లాడుతున్నట్లుగా మోసగాళ్లు ఫోన్లు చేస్తుంటారు. తక్కువ వడ్డీకి రుణం ఇస్తున్నామని చెబుతారు. పరిమిత కాలంపాటే ఇది అందుబాటులో ఉంటుందంటారు. రుణ దరఖాస్తును పరిశీలించడం, డాక్యుమెంటేషన్‌, ఇతర రకరకాల పేర్లు చెప్పి, కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని చెబుతారు. ఆన్‌లైన్‌లో నగదు బదిలీ కాకుండా.. గిఫ్ట్‌ కార్డులు, లేదా ఇతర రూపాల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని అంటారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర రుసుములు రుణం మంజూరైన తర్వాత ఆ మొత్తం నుంచే మినహాయించుకొని, మిగతాది మన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. గిఫ్ట్‌ కార్డుల్లాంటివి అడుగుతున్నారంటే.. అది కచ్చితంగా మోసమే.  
  • ఆకర్షించే రుణ ఆఫర్లు: మీ పేరుపై ముందుస్తు రుణం మంజూరయ్యిందని పేర్కొంటూ మోసగాళ్లు సంప్రదిస్తుంటారు. బ్యాంకు నుంచే వచ్చినట్లు భ్రమించేలా నకిలీ సందేశాలు పంపిస్తారు. ఆకర్షించేలా రుణ ఆఫర్లు ఇస్తారు. నిజానికి మీ ఖాతా ఉన్న బ్యాంకులో తప్ప, ఇతర చోట్ల ముందస్తు రుణాలు మంజూరవ్వడం సాధారణంగా ఉండదు. కాబట్టి, ఇలాంటి విషయాలపై అప్రమత్తంగా ఉండాలి. రుణం ఇస్తామన్న సంస్థ ఆర్‌బీఐ గుర్తింపు పొందిందా లేదా అనేది చూసుకోవాలి.  
  • గుర్తింపు తస్కరణ: మీ రుణ చరిత్ర నివేదికలు, క్రెడిట్‌ నివేదికలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ఎవరైనా మీ గుర్తింపులను వాడి, రుణం తీసుకున్నారా అనేది దీని ఆధారంగానే తెలుసుకోవచ్చు. మీ రుణ చరిత్ర నివేదికలో అనధికారిక రుణాలు ఉంటే బ్యాంకులకు ఆ విషయాన్ని తెలియజేయండి. క్రెడిట్‌ బ్యూరోలకూ ఫిర్యాదు చేయాలి.
  • అదనంగా రుణం: ఇప్పటికే తీసుకున్న రుణంపై అదనంగా రుణం ఇచ్చేందుకు వీలుంది. బ్యాంకులు ఇచ్చే ఈ ఆఫర్లు సాధారణంగా నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లలో కనిపిస్తుంటాయి. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఈ వివరాలు బ్యాంకులు తమ రుణ ఏజెంట్లకూ అందిస్తుంటాయి. వాళ్లు ఫోన్లు చేసి, అదనంగా రుణం ఇప్పిస్తామంటూ చెబుతుంటారు. ఇలాంటివి వచ్చినప్పుడు ముందుగా మీ బ్యాంకును సంప్రదించి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే అదనంగా రుణాన్ని తీసుకోవాలి. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతారు.
  • స్కోరుతో అవసరం లేదంటూ: ఎలాంటి ధ్రువీకరణలూ, క్రెడిట్‌ స్కోరు అవసరం లేకుండానే రుణం ఇస్తామంటూ కొందరు చెబుతుంటారు. అప్పు ఇచ్చే ముందు ఆర్థిక సంస్థలు కేవైసీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అలాంటిదేమీ అవసరం లేదంటూ చెప్పారంటే మోసం అని గుర్తించాలి. రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరును సమగ్రంగా పరిశీలించాకే బ్యాంకులు రుణం ఇస్తాయి.
  • పత్రాలతో జాగ్రత్త: మన ఆధార్‌, పాన్‌, వేతన, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికో ఒకరికి ఇస్తూనే ఉంటాం. ఇందులో ఎవరైనా సరే మన పేరుమీద మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి, మన సమాచారం ఇతరుల చేతిలోకి చేరకుండా చూసుకోవాలి. బ్యాంకులు, ఇతర చోట్ల ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తున్నామన్నది రాసి ఇవ్వడం ఉత్తమం.
  • అప్రమత్తంగా..: ఆర్థిక మోసాల నుంచి ఎవరికి వారే సొంతంగా రక్షించుకోవాలి. రుణం తీసుకునేందుకు ముందస్తు చెల్లింపులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయొద్దు. అవసరమైతే బ్యాంకు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి. అన్ని వివరాలూ తెలుసుకున్నాకే రుణం తీసుకునేందుకు అడుగు ముందుకేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని