కుటుంబానికి ధీమానిచ్చేలా.. బీమా పాలసీ

సంపాదించిన మొత్తంలో నుంచి పొదుపు, పెట్టుబడులకు కొంత కేటాయిస్తుంటాం. కుటుంబానికి ఆర్థికంగా అవసరమైన లక్ష్యాల సాధనకు ఇవి ఉపయోగడేలా చూసుకుంటాం.

Updated : 28 Mar 2024 13:27 IST

సంపాదించిన మొత్తంలో నుంచి పొదుపు, పెట్టుబడులకు కొంత కేటాయిస్తుంటాం. కుటుంబానికి ఆర్థికంగా అవసరమైన లక్ష్యాల సాధనకు ఇవి ఉపయోగడేలా చూసుకుంటాం. జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. అనుకోని సంఘటనతో ఆర్జించే వ్యక్తి దూరమైతే.. ఆ కుటుంబానికి ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటప్పుడే ధీమానిచ్చేలా ఒక బీమా పాలసీ ఉండాలి.

 ఖర్చులకు ఏ ఇబ్బందీ లేకుండా మీరు సంపాదించే ఆదాయం చూసుకుంటుంది. మీ బడ్జెట్‌ ఖర్చులను పక్కన పెడితే.. ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అత్యవసర ఖర్చులు, పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల ఉన్నత విద్యలాంటి వాటి కోసం పొదుపు, మదుపు చేయాల్సిన అవసరమూ ఉంటుంది. అదే సమయంలో అనుకోకుండా కుటుంబానికి దూరం అయినప్పుడు వారికి అండగా ఉండేందుకు కావాల్సినంత మొత్తాన్ని అందించేలా ఒక ఆర్థిక రక్షణను ఏర్పాటు చేయాలి.

 అర్థం చేసుకోండి..

కుటుంబానికి ఆర్థిక భద్రత అందించడంలో బీమా కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, వైకల్యాలు, అకాల మరణంతో సహా వివిధ సందర్భాల్లో ఆర్థిక రక్షణ కవచంగా పనిచేస్తుంది. పాలసీదారుడికి ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు నామినీకి పాలసీ విలువను పరిహారంగా చెల్లిస్తుంది. ఈ మొత్తం కుటుంబానికి కావాల్సిన ఖర్చులను వెళ్లదీయడానికి, అప్పులు తీర్చడానికి, పిల్లల ఉన్నత చదువులకు ఉపయోగపడేలా ఉండాలి. అప్పుడే ఆ పాలసీ పూర్తి భరోసానిస్తుంది.

విశ్లేషించుకోవాలి..

మీకు అవసరమైన బీమా మొత్తం ఎంత అనేది నిర్ణయించుకునేందుకు కొన్ని అంశాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మీ ఆర్థిక లక్ష్యాలు, బాధ్యతలు, ఆధారపడిన వారు, ప్రస్తుతం మీ ఆదాయం, భవిష్యత్‌లో వృద్ధి ఇలా పలు అంశాలను పరిగణలోకి తీసుకొని, బీమా పాలసీ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. బీమా సంస్థను ఎంచుకునేటప్పుడు కేవలం ప్రీమియాన్ని మాత్రమే చూడొద్దు. ఎంత మొత్తానికి బీమా ఇస్తున్నారు? క్లెయిం చెల్లింపుల చరిత్ర ఎలా ఉంది వంటి వాటిని పరిశీలనలోకి తీసుకోవాలి.

అనుబంధ పాలసీలతో..

బీమా పాలసీ విలువను పెంచేందుకు అనుబంధ పాలసీలు(రైడర్లు) తోడ్పడతాయి. బీమా పాలసీలకు అనుబంధంగా యాక్సిండెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌, ప్రీమియం వేవర్‌లాంటివి ఉంటాయి. వీటిని జోడించుకునేందుకు కొంత ప్రీమియం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వీలునుబట్టి, ఈ రైడర్లను తీసుకోవడం మంచిది.

పరిమితం చేయొద్దు..

చాలామంది జీవిత బీమా పాలసీ అంటే.. కేవలం ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే పథకంగానే చూస్తుంటారు. ఇది ఏమాత్రం సరికాదు. బీమా పాలసీ అందించే ప్రయోజనాలలో ఇది ఒకటిగానే చూడాలి. పన్ను మినహాయింపు లక్ష్యంతో పాలసీ తీసుకుంటే.. కుటుంబానికి సరైన ఆర్థిక రక్షణ లభించకపోవచ్చు. కాబట్టి, తగినంత బీమా పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించాలి. వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ బీమా కచ్చితంగా ఉండాలి.

దీర్ఘకాలంపాటు..

బీమా పాలసీలు సాధారణంగా దీర్ఘకాలిక వ్యవధితో వస్తాయి. ముందుగానే పాలసీని స్వాధీనం చేసినా, ప్రీమియం చెల్లింపు ఆపేసినా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, పాలసీని తీసుకునేటప్పుడే.. నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలనూ చూసుకోవాలి.

లక్ష్యాలను తీర్చేలా...

బీమా పాలసీలు కొన్ని పూర్తి రక్షణకే పరిమితం అవుతాయి. ఇందులో తక్కువ ప్రీమియానికే అధిక మొత్తంలో బీమా రక్షణ లభిస్తుంది. కొన్ని పాలసీలు బీమా రక్షణ, పెట్టుబడి పెట్టేందుకూ వీలు కల్పిస్తాయి. మరికొన్ని పిల్లలకు ప్రత్యేకంగా ఉంటాయి. పదవీ విరమణ తర్వాత ఆదాయం కోసం వీలు కల్పించే పింఛను పాలసీలూ
ఎంచుకోవచ్చు. జీవితంలో అనేక దశల్లో ఉండే అవసరాలకు తగ్గట్టుగా పాలసీ ఎంపికలు ఉండాలి. అనుమానాలున్నప్పుడు ఆర్థిక నిపుణులను సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని