అబ్బాయి అమెరికా చదువు కోసం...

నేను గృహిణిని. నెలకు రూ.4వేల వరకూ షేర్లలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. దీనివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా? కనీసం 12 శాతం వరకూ రాబడి వచ్చేలా ఏ పథకాలను ఎంచుకోవాలి? 6-7 ఏళ్లపాటు పెట్టుబడినికొనసాగించగలను.

Updated : 26 Aug 2022 06:52 IST

నేను గృహిణిని. నెలకు రూ.4వేల వరకూ షేర్లలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. దీనివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా? కనీసం 12 శాతం వరకూ రాబడి వచ్చేలా ఏ పథకాలను ఎంచుకోవాలి? 6-7 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించగలను. 

- దేవిక

మీరు షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టేందుకూ వీలుంది. దీనికోసం సిస్టమేటిక్‌ ఈక్విటీ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. మంచి పనితీరున్న షేర్లను ఎంచుకునే అవగాహన ఉండాలి. మార్కెట్‌ను ఎప్పటికప్పుడు గమనించాలి. దీనికి బదులుగా పరోక్షంగా మార్కెట్‌లో మదుపు చేసేందుకు ప్రయత్నించండి. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకొని, క్రమానుగత పెట్టుబడి విధానంలో (సిప్‌) చేయొచ్చు. ఏడేళ్ల వ్యవధి ఉంది కాబట్టి, 12-17 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. నెలకు రూ.4వేల చొప్పున ఏడేళ్లపాటు మదుపు చేస్తే సగటున 13 శాతం రాబడితో దాదాపు రూ.5 లక్షల వరకూ జమయ్యే అవకాశం ఉంది.


* జీవిత బీమా పాలసీని తీసుకోవాలనుకుంటున్నా. నా వయసు 39. ఏక మొత్తంలో ప్రీమియం చెల్లించి, టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చా? లేక ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే పాలసీనే మేలా?

- ప్రణీత్‌

జీవిత బీమా పాలసీని తీసుకునేటప్పుడు వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ బీమా విలువ ఉండేలా చూసుకోవాలి. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు బీమా కంపెనీలను ఎంచుకొని, పాలసీలను తీసుకోండి. సింగిల్‌ ప్రీమియం (ఏక మొత్తం) పాలసీలకు బదులు ఏడాదికోసారి ప్రీమియం చెల్లించేలా పాలసీని తీసుకోండి. దీనివల్ల మధ్యలో ఎప్పుడైనా పాలసీని రద్దు చేసుకోవాలనుకున్నా ఇబ్బంది ఉండదు.


మూడేళ్ల తర్వాత మా అబ్బాయిని అమెరికా పంపాలనే ఆలోచనతో ఉన్నాం. ఇందుకోసం ఇప్పటి నుంచే నెలకు రూ.40వేల వరకూ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాం. ఈ మొత్తాన్ని ఎక్కడ మదుపు చేయాలి?

 - విజయ్‌

మీకు మూడేళ్ల సమయమే ఉంది కాబట్టి, మీరు పెట్టే పెట్టుబడి కాస్త సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ రాబడి కన్నా పెట్టుబడి భద్రత చాలా ముఖ్యం. కాబట్టి, బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ ద్వారా మదుపు చేయడం మంచిది. భవిష్యత్తులో డాలర్‌ బలపడితే.. మీకు అధిక మొత్తం అవసరం అవుతుంది. దీన్ని తట్టుకునేందుకు అమెరికా సంస్థల్లో మదుపు చేసే భారతీయ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. వీటిలో నష్టభయం కాస్త అధికంగా ఉంటుందనేది మర్చిపోవద్దు.
 


* మా అమ్మ పేరుమీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూ.3లక్షలు ఉంది. వార్షిక వడ్డీ 5.6 శాతం వస్తోంది. దీనికి బదులుగా అధిక వడ్డీ వచ్చేలా డెట్‌ పథకాలు లేదా ఇతర చోట మదుపు చేయొచ్చా?

-శ్రీనివాస్

ఆరు నెలలుగా డెట్‌ ఫండ్లపైన వస్తున్న రాబడి కాస్త పెరిగింది. అంతకుముందు ఇది మరీ తక్కువగా ఉండేది. ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేటుకు దగ్గరగా ఉంది. డెట్‌ ఫండ్లలో కాస్త నష్టభయం ఉంటుందనేది గమనించాలి. ఎఫ్‌డీలకన్నా అధిక రాబడి రావాలనుకున్నప్పుడు పోస్టాఫీసు కిసాన్‌ వికాస పత్రాలను పరిశీలించవచ్చు. ఇందులో ప్రస్తుతం 6.9శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. రెండున్నర ఏళ్ల తర్వాత నిబంధనల మేరకు పెట్టుబడిని వెనక్కి తీసుకునే వీలుంటుంది.


- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని