నెలనెలా వడ్డీ వచ్చేలా..

నా వయసు 37. ప్రైవేటు ఉద్యోగిని. ఎనిమిదేళ్ల మా అమ్మాయి భవిష్యత్‌ అవసరాల కోసం నెలకు రూ.12 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

Updated : 06 Oct 2023 00:09 IST

నా వయసు 37. ప్రైవేటు ఉద్యోగిని. ఎనిమిదేళ్ల మా అమ్మాయి భవిష్యత్‌ అవసరాల కోసం నెలకు రూ.12 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

సుధీర్‌

మీ అమ్మాయి ఉన్నత చదువులకు ఇంకా చాలా వ్యవధి ఉంది. కాబట్టి, సురక్షిత పథకాలతో పాటు, కాస్త నష్టభయం ఉన్నప్పటికీ రాబడిని అధికంగా ఇచ్చే ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. రూ.12,000లలో నెలకు రూ.4,000 సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి. మిగతా రూ.8,000 డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మదుపు చేయండి. మీరు 10 ఏళ్లపాటు మీ పెట్టుబడిని క్రమం తప్పకుండా కొనసాగిస్తే.. 11 శాతం రాబడితో రూ.24,07,969 అయ్యేందుకు అవకాశం ఉంది. ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించేందుకు మీ పేరుపై తగినంత మొత్తానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. వీలైనప్పుడల్లా మీ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లండి.

మా తల్లిదండ్రుల పేరు మీద రూ.10 లక్షలు ఒకేసారి జమ చేసి, నెలనెలా వడ్డీ వారి ఖాతాలో జమయ్యేలా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనికోసం ఏం చేయాలి?

దేవి

మీకు నెలనెలా వడ్డీ కావాలనుకుంటున్నారు కాబట్టి, మీ పెట్టుబడి సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు కాస్త అధికంగానే ఉన్నాయి. పోస్టాఫీసులో నెలనెలా వడ్డీ చెల్లించే నాన్‌క్యుములేటివ్‌ డిపాజిట్‌ చేయొచ్చు. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీంనూ పరిశీలించవచ్చు.

ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మరో అయిదేళ్ల వరకూ నెలకు రూ.15 వేలు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను.. దీనికోసం షేర్లను పరిశీలించవచ్చా?

నవీన్‌

నేరుగా షేర్లలో పెట్టుబడి పెడితే కొన్ని సందర్భాల్లో అధిక రాబడి రావచ్చు. అది మీరు ఎంపిక చేసుకున్న షేర్లు, వాటి పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మీకు మంచి షేర్లను ఎంచుకునే నైపుణ్యం, వాటిని ఎప్పటికప్పుడు గమనించే సమయం ఉంటే షేర్లలో మదుపు చేయొచ్చు. కానీ, ఇది చాలా కష్టంతో కూడుకున్నది. దీనికి బదులుగా రూ.15వేలను ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత విధానంలో మదుపు చేయొచ్చు. మంచి ఫండ్లను ఎంచుకొని, పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఏడాదికోసారి వాటి పనితీరును బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోండి.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని