Gold Demand: 2023లో పసిడికి గిరాకీ 5 శాతం పడిపోయింది

Gold Demand: బంగారం ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణల వల్ల ప్రపంచవ్యాప్తంగా పసిడికి గిరాకీ తగ్గిందని డబ్ల్యూజీసీ తెలిపింది.

Published : 31 Jan 2024 15:46 IST

Gold Demand | ముంబయి: ప్రపంచవ్యాప్తంగా బంగారం (Gold) గిరాకీ 2023లో ఐదు శాతం తగ్గి 4,448.4 టన్నులకు చేరిందని ‘ప్రపంచ స్వర్ణ మండలి (WGC)’ నివేదిక తెలిపింది. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ETF) పెట్టుబడుల నుంచి ఉపసంహరణల వల్లే గిరాకీ తగ్గిందని వివరించింది. 2022లో 4,699 టన్నుల బంగారానికి గిరాకీ నమోదైనట్లు గుర్తు చేసింది.

అత్యధికంగా ఐరోపాలో పసిడి గిరాకీ (Gold Demand) 180 టన్నుల మేర తగ్గింది. 2013 తర్వాత ఈ ప్రాంతంలో ఈస్థాయి క్షీణత ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్లు రాణించడం, వడ్డీరేట్ల కోత అంచనాల్లో అనిశ్చితి వల్లే పసిడి ఈటీఎఫ్‌ల (Gold ETFs) నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పెద్దఎత్తున నమోదైందని డబ్ల్యూజీసీ నివేదిక వివరించింది. కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు వార్షిక ప్రాతిపదికన 45 టన్నులు తగ్గి 1,037 టన్నులకు చేరింది. అత్యధికంగా పీపుల్స్‌ బ్యాంక్ ఆఫ్ చైనా 225 టన్నులు, బ్యాంక్‌ ఆఫ్ పోలెండ్‌ 130 టన్నుల బంగారాన్ని తమ నిల్వల్లో చేర్చుకున్నాయని వెల్లడించింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఉజ్బెకిస్థాన్‌, నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కజకిస్థాన్‌ అత్యధికంగా విక్రయించాయి.

2010 నుంచి కేంద్ర బ్యాంకులు నికర పసిడి కొనుగోలుదారులుగా నిలుస్తున్నాయి. అప్పటినుంచి దాదాపు 7,800 టన్నుల బంగారాన్ని కొన్నాయి. దీంట్లో మూడోవంతు నిల్వలను గత రెండేళ్లలోనే సమకూర్చుకొన్నాయి. మన భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) గత ఏడాది 16.2 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. నాణేలు, బిస్కెట్లకు గిరాకీ మూడు శాతం తగ్గింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల మార్కెట్‌లో గిరాకీ 17 శాతం పుంజుకోవటం విశేషం. భారత్‌లో మాత్రం ఈ విభాగంలో తొమ్మిది శాతం క్షీణత నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని