Google Passkeys: పాస్‌వర్డ్‌ లేకుండా ఖాతా లాగిన్.. గూగుల్‌ పాస్‌కీస్‌ గురించి తెలుసా?

గూగుల్‌ (Google) యూజర్లు తమ ఖాతాలను పాస్‌వర్డ్‌, టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌తో లాగిన్‌ అవసరం లేకుండా కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ పనిచేయాలంటే డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు విండోస్‌ 11, మ్యాక్‌ఓఎస్‌ వెంచురా ఓఎస్‌లతో.. మొబైల్‌లో ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్‌ 16 ఆపై వెర్షన్‌ ఓఎస్‌లతో పనిచేస్తుండాలి. 

Published : 05 May 2023 13:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ పాస్‌వర్డ్‌ దినోత్సవం (World Password Day) సందర్భంగా యూజర్లకు గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటా మే నెల మొదటి గురువారం రోజున వరల్డ్‌ పాస్‌వర్డ్‌ డేగా జరుపుతారు. ఈ క్రమంలోనే గూగుల్ పాస్‌కీస్‌ (Google Passkeys) ఫీచర్‌ను పరిచయం చేసింది. తరచూ తమ ఆన్‌లైన్‌ ఖాతాలకు పాస్‌వర్డ్‌ మర్చిపోయే యూజర్లకు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో యూజర్లు తమ ఆన్‌లైన్‌ ఖాతాలను పాస్‌వర్డ్‌, టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ అవసరం లేకుండా ఫింగర్‌ప్రింట్, ఫేస్‌ స్కాన్‌ లేదా స్క్రీన్‌ లాక్‌ పిన్‌ సాయంతో లాగిన్‌ చేయొచ్చు. అలాగే యూజర్ల ఖాతాలకు అదనపు భద్రత ఉంటుందని గూగుల్ తెలిపింది. 

గూగుల్ యూజర్లు ఈ ఫీచర్‌ను ముందుగా ఎనేబుల్ చేయాలి. ఇందుకోసం గూగుల్‌ ఖాతా ప్రొఫైల్‌ ఫొటోపై క్లిక్ చేయాలి. అందులో మేనేజ్‌ యువర్‌ గూగుల్ అకౌంట్‌ (Manage Your Google Account)పై క్లిక్‌ చేసి సెక్యూరిటీ  (Security)సెక్షన్‌లోకి వెళితే పాస్‌కీస్‌ (Passkeys) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేస్తే మీ ఖాతాకు పాస్‌కీస్‌ ఫీచర్‌ యాక్టివేట్ అయినట్లు మెసేజ్‌ చూపిస్తుంది. మొబైల్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ స్కాన్‌ ఆప్షన్లతో పాస్‌కీ ఆటోమేటిగ్గా క్రియేట్ అవుతుంది. లేదా క్రియేట్‌ పాస్‌కీ ఆప్షన్‌తో యూజర్‌ కొత్త కీని క్రియేట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్‌ లాగిన్‌ కోసం పిన్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కాన్‌, ఫేస్‌ స్కాన్‌లలో ఏ ఒక్కటి ఎనేబుల్‌ చేయకపోతే వాటిని ఎనేబుల్ చేయమని సూచిస్తుంది. 

డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో కీబోర్డ్‌లో ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఆప్షన్‌ ఉంటే పాస్‌కీ క్రియేట్ చేసుకోవచ్చు. పెన్‌డ్రైవ్‌ల తరహాలో ఉండే కొన్ని పాస్‌కీస్‌ యూఎస్‌బీ డ్రైవ్‌లను కూడా ఇందుకోసం ఉపయోగించవచ్చు. ప్రస్తుతం కొన్ని మొబైల్‌ యాప్‌లకు ఫింగర్‌ ప్రింట్ అథెంటికేషన్‌ తరహాలో గూగుల్ ఖాతాలకు పాస్‌కీస్‌ పనిచేస్తాయి. పాస్‌వర్డ్‌ల తరహాలో గుర్తుంచుకోవడం కోసం వీటిని ఎక్కడా రాయాల్సిన అవసరంలేదు. ఒకవేళ కొత్తగా ఏదైనా డివైజ్‌లో గూగుల్ ఖాతా లాగిన్‌ చేసేప్పుడు పాస్‌వర్డ్‌ ఆప్షన్‌కు బదులు పాస్‌కీస్‌ ఆప్షన్‌ను ఎంచుకుని ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ స్కాన్‌, పిన్‌ సాయంతో లాగిన్‌ చేయొచ్చు. దానివల్ల ఇతరులు గూగుల్‌ ఖాతాలను యాక్సెస్‌ చేయలేరు. అయితే, ఈ ఫీచర్‌ కోసం డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 11, యాపిల్‌ మ్యాక్‌ఓఎస్‌ వెంచురా ఓఎస్‌లతో.. మొబైల్‌లో ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్‌ 16 ఆపై వెర్షన్‌ ఓఎస్‌లతో పనిచేస్తుండాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని