Personal loan: పర్సనల్‌ లోన్‌తో మీ క్రెడిట్‌స్కోరు దెబ్బతింటుందా?

Credit score: పర్సనల్‌ లోన్‌ విషయంలో చాలా మందికి ఓ అపోహ ఉంటుంది. వ్యక్తిగత రుణం తీసుకుంటే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందని. ఇంతకీ నిజంగానే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందా? 

Updated : 16 Nov 2023 14:42 IST

Personal loan | ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక అవసరాల కోసం ఒకప్పుడంటే ప్రైవేటు రుణాలే దిక్కు. ఇప్పుడు మాత్రం బ్యాంకులు విరివిగా వ్యక్తిగత రుణాలను (Personal Loans) అందిస్తున్నాయి. దీనికి తోడు ఈ రుణాలకు ఎలాంటి పూచీకత్తూ లేకపోవడంతో తీసుకునే వారి సంఖ్యా పెరుగుతోంది. అయితే, ఈ తరహా లోన్ల విషయంలో చాలా మందికి ఒక అపోహ వెంటాడుతూ ఉంటుంది. పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score) దెబ్బతింటుందేమోనని! వ్యక్తిగత రుణం తీసుకుంటే నిజంగానే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందా?

సాధారణంగా బ్యాంకులు మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. అదే తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి ఇచ్చేందుకు వెనకడుగు వేస్తాయి. అవతలి వ్యక్తి రుణం తిరిగి చెల్లించగలరా? లేదా? అనేదాని కోసం వారి క్రెడిట్‌ స్కోరును చెక్‌ చేస్తాయి. వారి క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే.. రుణాలు మంజూరు చేస్తాయి. తక్కువ ఉంటే ముఖం చాటేస్తాయి. మరి పర్సనల్‌ లోన్‌ తీసుకున్నాక క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుందా? అనే ప్రశ్న కొందరిని వెంటాడుతూ ఉంటుంది. అయితే, అది కేవలం అపోహ మాత్రమే.

టాటా టెక్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.రూ.475-500.. కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలంటే?

వ్యక్తిగత రుణం తీసుకున్నంత మాత్రన క్రెడిట్ స్కోరు దెబ్బతినదు. ఇంకా చెప్పాలంటే మీ క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకు ఓ విధంగా ఈ రుణం ఉపయోగపడుతుంది. మీ అవసరాలకు తగిన పర్సనల్‌ లోన్‌ తీసుకుని సకాలంలో తిరిగి చెల్లింపులు చేయగలిగితే క్రెడిట్‌ స్కోరు మెరుగవుతుంది. ఇలా పర్సనల్‌ లోన్‌ తీసుకుని చెల్లింపులు చేయడం వల్ల మంచి క్రెడిట్‌ స్కోరును నిర్మించుకోవడానికి దోహద పడుతుంది. పైగా ఇది భవిష్యత్‌లో హోమ్‌లోన్‌ రూపంలో పెద్ద మొత్తంలో రుణం తీసుకునే సమయంలో తక్కువ వడ్డీకే రుణం పొందడంలో సాయపడుతుంది.

అయితే, ఒక పర్సనల్‌ లోన్‌ ఉండగా.. మరో రుణం తీసుకుంటే మాత్రం మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఉంటుంది. సాధారణంగా రుణం మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు హార్డ్‌ ఎంక్వైరీ చేస్తాయి. కాబట్టి మీ క్రెడిట్‌ స్వల్పంగా తగ్గుతుంది. అయితే, ఆ రుణం కూడా సకాలంలో చెల్లింపులు చేయగలిగితే మీ క్రెడిట్ స్కోరు మళ్లీ మెరుగవుతుంది. కాబట్టి ఒకవేళ ఒక రుణం ఉంటుండగానే రుణం అవసరం అయితే ఇంకో పర్సనల్‌ లోన్‌ తీసుకోవచ్చు. అవసరానికి మించి పర్సనల్‌ లోన్‌ తీసుకుని సకాలంలో తిరిగి చెల్లింపులు చేయలేకపోతే మాత్రం క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. తిరిగి చెల్లింపుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోతే మొదటికే మోసం వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని