Online Scams: ఆన్‌లైన్‌లో ఎన్ని స్కాములో..! మరి వీటిని గుర్తించేదెలా?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీతో పాటు ఆన్‌లైన్‌ మోసాలు బాగా పెరిగాయి. ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కినట్లే.

Published : 26 Oct 2023 17:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఇంటర్నెట్‌ అనేది మన జీవితంలో అంతర్భాగమైపోయింది. దీంతోపాటే ఆన్‌లైన్‌ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. హ్యాకర్లు, సైబర్‌ నేరగాళ్లు సామాన్యుల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వీళ్లు ప్రజలను మోసగించడానికి వినూత్నమైన మార్గాలను అనుసరిస్తుంటారు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. కాబట్టి ఆన్‌లైన్‌ మోసాల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్ అవ్వాల్సిందే. అలాంటి కొన్ని ఆన్‌లైన్‌ మోసాల గురించి ఇప్పుడు చూద్దాం..

యూపీఐ రిఫండ్‌ స్కామ్‌

యూపీఐ గురించి అందరికీ తెలిసిందే. కూరగాయల దగ్గర నుంచి కిరాణా స్టోర్‌ వరకు.. ఫోన్‌ రీఛార్జ్‌ నుంచి విమాన టికెట్ల వరకు వివిధ నగదు చెల్లింపులకు యూపీఐను ఉపయోగిస్తున్నాం. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రజలను మోసగించడానికి స్కామర్లు కొత్త పద్ధతులను అవలంబించడం ప్రారంభించారు. ఇదే యూపీఐ రిఫండ్‌ స్కామ్‌. ఇక్కడ మోసగాళ్లు మీకు కాల్‌ చేసి మీరు చేసిన ఏదైనా చెల్లింపులలో మీకు కొంత రిఫండ్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలియజేస్తారు. బ్యాంకులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు లేదా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ల సిబ్బందిలా మీతో మాట్లాడతారు. మీకు మెసేజ్‌ను పంపడం ద్వారా లింక్‌ను పంచుకుంటారు. మీ డబ్బు వాపసు కావడానికి మీరు లింక్‌ ద్వారా నమోదు చేసుకోవాలని మిమ్మల్ని కోరతారు. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మీ బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ ఐడీ పిన్‌ను నమోదు చేయాలని చెబుతారు. డబ్బు వెంటనే మీ ఖాతాలో జమ అవ్వాలంటే ఇవన్నీ అవసరమని మీపై ఒత్తిడి చేస్తారు. ఒకవేళ మీరు వారు చెప్పినట్టుగా చేస్తే వెంటనే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయిపోతుంది. ఇటువంటి ఆఫర్‌తో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే.. అసలు మీరు రిఫండ్‌కు అర్హులా కాదా? అని తెలుసుకోవాలి. తెలియని వారు పంపిన ఐడీల నుంచి వచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయొద్దు. బ్యాంకు ఖాతా నంబర్లు, యూపీఐ పిన్‌ వంటి సమాచారాన్ని ఎవరికీ షేర్‌ చేయొద్దు. ముఖ్యంగా గోప్యమైన సమాచారాన్ని బ్యాంకు, ఇతర అధికారులు మిమ్మల్ని ఎప్పుడు అడగరని గుర్తించాలి. 

పవర్‌ కట్‌ స్కాం

ఈ రకమైన మోసం ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తోంది. కొంత మంది విద్యుత్‌ వినియోగదారులు వాట్సాప్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా మేసేజ్‌లు అందుకుంటున్నారు. మేసేజ్‌లో ఈ విధంగా ఉంటుంది. ‘ప్రియమైన కస్టమర్‌.. మీ విద్యుత్‌కు సంబంధించిన మునుపటి నెల బిల్లు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ కానందున మీ ఇంటికి కరెంట్ సప్లయ్‌ ఈ రాత్రి 9.00 గంటలకు విద్యుత్‌ కార్యాలయం నుంచి డిస్‌కనెక్ట్‌ చేస్తారు’ అంటూ ఓ నకిలీ సైట్‌/ఫోన్‌ నంబర్‌ పేర్కొంటారు. బిల్లు చెల్లించాలని అడుగుతారు. రాత్రి సమయంలో ఈ తరహా మెసేజ్‌ వస్తే.. సాధారణంగానే ఎవరైనా గాబరా పడతారు. ఇక్కడే మనమో విషయం గమనించాలి. ఏ కారణం చేతనైనా విద్యుత్‌ బిల్లు అప్‌డేట్‌ కాకపోయినా, ఎలక్ట్రిక్‌ ఆఫీస్‌ నుంచే కనెక్షన్‌ను కట్‌ చేయలేరని మీరు గుర్తించాలి. కరెంట్‌ను కట్‌ చేయాలంటే వినియోగదారు ఇంటికి విద్యుత్‌ సిబ్బంది రావల్సిందే. అది కూడా పగటి పూట మాత్రమే విద్యుత్‌ శాఖ ఆ పని చేస్తుంది. విద్యుత్‌ బోర్డు లేదా పంపిణీదారు సాధారణంగా అధికారిక నంబర్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ పంపుతారు. ఆయా నంబర్లు ఎలక్ట్రికల్‌ బిల్లులో కూడా ఉంటాయి. ఇవన్నీ విద్యుత్‌ వినియోగదారులు గుర్తించాలి. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే మేసేజ్‌లకు వినియోగదారులు స్పందించకూడదు.

ఫేక్‌ జాబ్‌ ఆఫర్‌

అత్యంత సాధారణ జాబ్‌ స్కామ్‌ల్లో ఇదీ ఒకటి. ఇక్కడ మోసగాళ్లు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని అందిస్తామని, విశ్రాంతి సమయాల్లోనే సులువుగా డబ్బు సంపాదించవచ్చని చెబుతారు. అవసరమైతే నకిలీ ఉద్యోగ పోస్టింగ్‌లను సృష్టిస్తారు. చట్టబద్ధంగా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లను కూడా వీరు డిజైన్‌ చేసుకుంటారు. అనేక సందర్భాల్లో మోసగాళ్లు వీలైనంత ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని బయటకు తీయడానికి అనేక రౌండ్ల నకిలీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. శిక్షణకు, పరికరాలకు, ఇతర ప్రయోజనాల కోసం ముందుగానే కొత్త మొత్తాన్ని చెల్లించమని ఉద్యోగార్ధులను అడుగుతారు. నిరుద్యోగులు చాలా తేలికగా వీరి ఉచ్చులో పడే అవకాశం ఉంది. ఇటువంటి ఫేక్‌ జాబ్‌ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాన్ని ఆశించేవారు ముందుగా గూగుల్‌లో వారు తెలిపిన కంపెనీ గురించి లోతుగా పరిశీలించాలి. అలాంటి కంపెనీ ఉనికిలో ఉందో లేదో మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

ఓటీపీ స్కామ్‌

ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీ పేరు మీద రుణం అందిస్తామని లేదా క్రెడిట్‌ లిమిట్‌ పెంచుతామని మీకు నకిలీ మెసేజ్‌ను పంపుతారు. ఈ మెసేజ్‌ ద్వారా మీ ఆర్థిక వివరాలు షేర్‌ చేయమని అడుగుతారు. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరులో మీరు స్వీకరించే వన్‌-టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) లేదా పిన్‌ వివరాలను షేర్‌ చేయమని మిమ్మల్ని కోరతారు. మీరు వారికి స్పందించి ఓటీపీ లేదా పిన్‌ను షేర్‌ చేసిన మరుక్షణంలో మోసగాళ్లు మీ బ్యాంకు ఖాతాల నుంచి అనధికారిక లావాదేవీలను నిర్వహించడానికి దాన్ని ఉపయోగిస్తారు. ఇటువంటి సందర్భంలో మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయిపోతుంది. దీన్ని నివారించడానికి మీకు సంబంధం లేని క్రెడిట్‌ ఆఫర్లకు మీరు స్పందించకపోవడమే మంచిది. ఓటీపీ, పిన్‌ వివరాలు ఇతరులతో పంచుకోవలసినవి కావని మీరు గుర్తించాలి.

జ్యూస్‌ జాకింగ్‌ స్కామ్‌

ప్రస్తుతం చాలా మంది స్మార్ట్‌ఫోన్లనే వాడుతున్నారు. వాడకాన్ని బట్టి వీటికి ఛార్జింగ్‌ కూడా త్వరగానే అయిపోతుంది. అధిక సమయం బయట గడిపేవారు కనిపించిన ప్రతి చోటా ఫోన్‌ ఛార్జింగ్‌ చేస్తుంటారు. ఈ జ్యూస్‌ జాకింగ్‌ స్కామ్‌లో మోసగాళ్లు ఫోన్‌ నుంచి డేటాను చోరీ చేయడానికి ఈ ఛార్జింగ్‌ ప్లేస్‌లను ఎంచుకుంటున్నారు. ఇక్కడ నేరగాళ్లు మీ ఫోన్‌ హ్యాక్‌ చేయడానికి, బ్యాంకు వివరాలు లేదా యూపీఐ పాస్‌వర్డ్‌లు మొదలైన రహస్య సమాచారాన్ని చోరీ చేయడానికి ఈ ఛార్జింగ్‌ పోర్ట్‌ల వద్ద హార్డ్‌వేర్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తారు. దీంతో మీ ఫోన్‌లో ఉన్న డేటా అక్కడ ఉన్న పరికారాల్లో సేవ్‌ అయిపోతుంది. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎక్కువ సమయం ఇంటి బయట గడిపేవారు పోర్టబుల్‌ పవర్‌ బ్యాంక్‌ను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని