Salary Hikes: భారత్‌లో ఉద్యోగులకు ఈ ఏడాది 10.2% వేతన పెంపు..

Salary Hike: ఇ-కామర్స్‌, ప్రొఫెషనల్‌ సర్వీసులు, ఐటీ రంగాల్లో వేతనాల పెంపు (Salary Hike) అత్యధికంగా ఉంటుందని ఈవై నివేదిక తెలిపింది.

Updated : 21 Mar 2023 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ఉద్యోగుల వేతనాలు ఈ ఏడాది సగటున 10.2 శాతం పెరిగే (Salary Hike) అవకాశం ఉందని ప్రొఫెషనల్‌ సర్వీసులు అందించే సంస్థ ఈవై (Ernst & Young)  తెలిపింది. క్రితం ఏడాది ఇది 10.4 శాతం ఉన్నట్లు పేర్కొంది. కార్మిక స్థాయి ఉద్యోగులకు తప్ప మిగిలిన అన్ని స్థాయిల్లో వేతనాల పెంపు 2022తో పోలిస్తే తక్కువగానే ఉంటుందని తెలిపింది.

ఇ-కామర్స్‌, ప్రొఫెషనల్‌ సర్వీసులు, ఐటీ రంగాల్లో వేతనాల పెంపు (Salary Hike) అత్యధికంగా ఉంటుందని ఈవై నివేదిక తెలిపింది. ఈ రంగాల్లో వరుసగా 12.5%, 11.9%, 10.8% పెంపు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. 2022లో ఈ రంగాల్లో ఉద్యోగుల వేతనాల పెంపు వరుసగా 14.2%, 13%, 11.6% ఉన్నట్లు తెలిపింది.

మరోవైపు భారత్‌లో ఉద్యోగుల వలసరేటు తగ్గినట్లు తెలిపింది. 21.2 శాతంతో ప్రస్తుతం అది 2021 నాటి స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. స్వచ్ఛంద వలసల రేటు 16.8 శాతంగా ఉన్నట్లు తెలిపింది. భవిష్యత్‌ వృద్ధి అవకాశాలు సన్నగిల్లడం, పరిహారాల్లో హెచ్చుతగ్గులు, పదోన్నతులు లేకపోవడం, గుర్తింపు లేకపోవడమే వలసలకు ప్రధాన కారణమని ఈవై వెల్లడించింది. ఆర్థిక సంస్థలు, ఇ-కామర్స్‌, టెక్నాలజీ రంగాల్లో అత్యధికంగా ఉద్యోగుల వలసలు ఉన్నట్లు తెలిపింది. లోహ, మైనింగ్‌, ఆతిథ్య సేవలు, ఏరోస్పేస్‌ రంగాల్లో వలసలు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం కృత్రిమ మేధ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి టెక్నాలజీ ఆధారిత నైపుణ్యాలకు అధిక గిరాకీ ఉన్నట్లు ఈవై తెలిపింది. వీటిలో సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పోలిస్తే 10-15 శాతం అధిక వేతనాలు ఉన్నట్లు పేర్కొంది. రిస్క్‌ మోడలింగ్‌, డేటా ఆర్కిటెక్చర్‌, బిజినెస్‌ అనలిటిక్స్ వంటి రంగాల్లోనైతే 20-25 శాతం అధిక వేతనాలు ఇవ్వడానికి సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలోని దాదాపు సగానికి పైగా కంపెనీలు గిరాకీ ఎక్కువగా ఉన్న ఈ రంగాల్లోని ఉద్యోగులకు అధికంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది.

దేశం ఆర్థికంగా పురోగమిస్తున్న కొద్దీ ప్రత్యేక ప్రతిభ గల ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు ఈవై నివేదిక తెలిపింది. సాధారణ ప్రతిభ ఉన్నవారితో పోలిస్తే అధిక నైపుణ్యాలు ఉండి.. మంచి అనుభవం ఉన్న వ్యక్తుల వేతనాలు రెట్టింపు ఉన్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని