IndiGo: ఇండిగోకు లాభాలు.. పైలట్లకు వేతన పెంపులు షురూ!

IndiGo: దేశంలో విమానయాన సంస్థల కార్యకలాపాలు కరోనా సంక్షోభం నుంచి పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలను కంపెనీలు పునరుద్ధరిస్తున్నాయి. 

Published : 13 Feb 2023 15:26 IST

దిల్లీ: దేశంలో విమాన ప్రయాణాలు కొవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకున్నాయి. విమానయాన సంస్థల (airlines) ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు క్రమంగా కంపెనీలు పునరుద్ధరిస్తున్నాయి. తాజాగా ఇండిగో (IndiGo) తమ పైలట్ల వేతనాల్లో వార్షిక పెంపు (Increments) ప్రక్రియను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా తెలియజేసింది.

కరోనా సంక్షోభ సమయంలో విమానయాన (airlines) సంస్థలన్నీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు ఇచ్చే అన్ని రకాల ప్రోత్సాహకాలను ఉపసంహరించుకున్నాయి. వేతనాల్లోనూ కోత విధించాయి. తాజాగా కార్యకలాపాలు కరోనా పూర్వస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కంపెనీలు తిరిగి పాత వేతన పద్ధతులను పునరుద్ధరిస్తున్నాయి.

తాజాగా ఏటీఆర్‌ విమానాలను నడిపే పైలట్ల వేతనాలను సైతం పెంచే యోచనలో ఉన్నట్లు ఇండిగో (IndiGo) ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ విభాగ ఉపాధ్యక్షుడు ఆశీమ్‌ మిత్ర తెలిపారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో ఉంటుందని పేర్కొన్నారు. సాధారణంగా ఎయిర్‌బస్‌ పైలట్లతో పోలిస్తే ఏటీఆర్‌ విమానాల పైలట్లకు వేతనాలు తక్కువగా ఉంటాయి. మరోవైపు ఇండిగో (IndiGo) నవంబరులోనే తమ పైలట్ల వేతనాలను కరోనా పూర్వస్థాయికి పెంచింది.

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇండిగో (IndiGo) రూ.1,422 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఆదాయం 60.7 శాతం పెరిగి రూ.14,933 కోట్లకు చేరింది.  అంతముందు వరుసగా మూడు త్రైమాసికాల్లో కంపెనీ నష్టాలు చవిచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని