Gold ETF: గోల్డ్‌ ఈటీఎఫ్‌ల వైపు మదుపరుల చూపు.. ఆగస్టులో 16 నెలల గరిష్ఠానికి

Gold ETF: గోల్డ్‌ ఈటీఎఫ్‌లపై మదుపరుల్లో ఆసక్తి నెలకొంటోంది. ఆగస్టులో ఈ పోర్ట్‌ఫోలియోలోకి వచ్చిన నిధులే ఇందుకు నిదర్శనం. 

Updated : 19 Sep 2023 06:10 IST

దిల్లీ: గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (Gold ETFs) పట్ల మదుపరుల ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా రూ.1028 కోట్లు నిధులు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి తరలివచ్చాయి. 16 నెలల తర్వాత గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం గమనార్హం. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం, వృద్ధి నెమ్మదించడం వంటి కారణాలతో  వీటికి ఆదరణ పెరుగుతోందని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా వెల్లడించింది. పెట్టుబుడలతో పాటు ఈటీఎఫ్‌ల్లో మదుపు చేసే వారి సంఖ్యా పెరగడం గమనార్హం.

గోల్డ్‌ ఆధారిత ఈటీఎఫ్‌ల్లోకి (Gold ETF) ఈ ఏడాది జులైలో రూ.456 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో రూ.298 కోట్లు మాత్రమే పెట్టుబడుల రూపంలో వచ్చాయి. అంతకు ముందు మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా రూ.1243 కోట్లు ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కి మళ్లాయి. గతేడాది రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో 2022 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1100 కోట్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి నిధులు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆగస్టులోనే నమోదు కావడం గమనార్హం. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో జులైలో రూ.47.75 లక్షలుగా ఉన్న ఇన్వెస్టర్ల సంఖ్య ఆగస్టులో మరో 20,500 మేర పెరిగింది.

వెండిలో మదుపు చేద్దామా

‘‘ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఇన్నాళ్లూ ఫెడ్‌ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇకపై వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉండకపోవచ్చు. అమెరికా బాండ్ల రాబడి, డాలరు విలువ పెరిగినప్పటికీ.. ఇప్పటికీ బంగారం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మాంద్యం ముప్పు భయాలు, కేంద్ర బ్యాంకు బంగారం కొనుగోలు చేస్తుండడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అమెరికాలో పెరుగుతున్న రుణ భారం వంటివి మదుపరులు బంగారంవైపు మొగ్గుచూసేలా చేస్తున్నాయి’’ అని  క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో అల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న గజల్‌ జైన్‌ తెలిపారు. దీనికితోడు బంగారం ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠాల నుంచి ఇటీవల కాస్త దిగిరావడమూ మరో కారణం. అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారం వైపు మరలుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్రాము స్వచ్ఛమైన బంగారాన్ని గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. బంగారంలో మదుపు చేయాలనుకునేవారికి గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ప్రత్యామ్నయం అనే చెప్పాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని