Womens day: బంగారం అంటే నగలే కాదు.. ఇవీ ఉన్నాయ్‌..!

Gold investment: బంగారంలో పెట్టుబడి అనగానే గుర్తొచ్చేద్ది భౌతిక బంగారమే. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి..

Updated : 08 Mar 2023 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారంతో (Gold) మహిళలకు (Womens) విడదీయరాని బంధం ఉంది. పండగైనా, శుభకార్యమైనా బంగారం కొనుగోలుకు (Gold Investment) మహిళలు ఆసక్తి చూపిస్తుంటారు. మన పెద్దలు కూడా ఇదే చెప్పేవారు. చేతిలో కొంత నగదు ఉన్నప్పుడు ఎంతో కొంత బంగారం కొనుక్కోమనేవారు. భవిష్యత్‌లో ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ బంగారం ఉయోగపడుతుందని చాలా దూర దృష్టితో చెప్పిన మాట ఇదీ. ఓ విధంగా ఇలా కొనుగోలు చేసిన బంగారం ఆ రోజుల్లో అత్యవసర నిధిలా ఉపయోగపడేది. బ్యాంకింగ్‌ సేవలు, ఇతర పెట్టుబడి పథకాలు అందుబాటులో లేని కాలంలో వారి ముందు చూపు మెచ్చుకోదగింది. అందుకే పండగలు, శుభకార్యాలప్పుడు ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఇప్పటి పరిస్థితుల్లో ధరించడానికైతే బంగారం కొనుగోలుకు ఓకే గానీ.. పెట్టుబడి కోసమైతే మాత్రం ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది తెలివైన పని కాదనే చెప్పాలి. ఇంతకీ ఆభరణాలు కొనుగోలు వల్ల నష్టమేమిటి? ప్రత్యామ్నాయ మార్గాలేంటో చర్చిద్దాం..

పెట్టుబడికైతే.. ఆలోచించండి

బంగారం ధర ఏటికేడూ పెరుగుతుంటుంది. దీంతో చాలా మంది బంగారంలో మదుపు చేస్తుంటారు. ఇందుకోసం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. నెలవారీ పథకాలనూ కొన్ని బంగారు దుకాణాలు అందిస్తున్నాయి. నెలకు కొంత మొత్తం చొప్పున కట్టించుకుని చివర్లో బంగారాన్ని విక్రయిస్తుంటాయి. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అలంకరణ కోసం ఇలా కొనుగోలు చేస్తే పర్వాలేదు. అదే పెట్టుబడి కోసం అయితే మాత్రం భౌతిక బంగారం.. అందునా ఆభరణాల కొనుగోలు ఏమాత్రం మంచిది కాదనే చెప్పాలి. బంగారం కొనుగోలు చేసేటప్పుడు తరుగు, మజూరీ, జీఎస్టీ వంటి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆభరణాన్ని అమ్మాలనుకుంటే పాత బంగారానికి అంత  విలువ రాదు. దీంతో పెరిగిన బంగారం విలువ వినియోగదారుడికి దక్కదు. ఒకవేళ బంగారంలో పెట్టుబడే మీ లక్ష్యమైతే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి వాటిని పరిశీలించండి..

  • గోల్డ్‌ బాండ్లు: భౌతిక బంగారం కొనుగోలును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (SGB). భారత ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఒక గ్రాము మొదలుకొని గరిష్ఠంగా 4 కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు. సబ్‌స్క్రిప్షన్‌కు ముందు వారం చివరి మూడు దినాల్లో సగటు ధరను లెక్కించి గ్రాము ధరను నిర్ణయిస్తారు. ఈ బాండ్లు 8 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అవుతాయి. వార్షికంగా 2.50 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. విత్‌డ్రా చేసుకునే సమయానికి ఉన్న గ్రాము బంగారం ధర ప్రకారం తిరిగి చెల్లిస్తారు. ప్రభుత్వ హామీ ఉండడం వల్ల పెట్టుబడికి అనువైన పథకమనే చెప్పాలి. పైగా భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఈ బాండ్లను ఫిజికల్‌ గోల్డ్‌ మాదిరిగానే బ్యాంకులో తనఖా ఉంచి రుణం కూడా పొందొచ్చు.
  • డిజిటల్‌ గోల్డ్: పేరుకు తగ్గట్లే వర్చువల్‌గా ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కొనుగోలు చేసిన ప్రతిసారీ అంత విలువైన బంగారాన్ని విక్రేతలే కొని వారి వద్ద ఉంచుతారు. ఒక గ్రాము కూడా కొనుగోలు చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌తో వీటి ధరలు అనుసంధానమై ఉంటాయి. మీరు కావాలనుకున్నప్పుడు లోహ రూపంలో మీకు అందజేస్తారు. పేటీఎం, ఫోన్‌పే వంటి ఆర్థిక సేవల సంస్థలూ డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలుకు అనుమతిస్తున్నాయి. దీనివల్ల వీలుచిక్కినప్పుడల్లా సులువుగా బంగారం కొనుగోలు చేయడం వీలుపడుతుంది. అయితే, డిజిటల్‌ గోల్డ్‌ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణా వ్యవస్థా లేకపోవడం లోటనే చెప్పాలి.
  • గోల్డ్‌ ఈటీఎఫ్‌: ఎలక్ట్రానిక్‌ రూపంలో బంగారం కొనుగోలు చేయడానికి ఉన్న ఇంకో మార్గం గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు. ఎలక్ట్రానిక్‌ రూపంలో కొనుగోలు, అమ్మకాలు సులభంగా నిర్వహించే సౌలభ్యం ఉంటుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ప్రతి యూనిట్‌ 99% లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛతతో ఉన్న బంగారం ధరకు మద్దతునిస్తుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లను సులభంగా కొనుగోలు చేయొచ్చు. స్టాక్‌ ఎక్స్ఛేంజీల పనివేళల్లో ఎప్పుడైనా యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. విక్రయించవచ్చు. బంగారం డీమ్యాట్‌ రూపంలో ఉంటుంది కాబట్టి, భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
  • గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌: దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎక్కువ మంది సూచించే పెట్టుబడి మార్గం మ్యూచువల్‌ ఫండ్స్‌. అయితే, బంగారంలో మదుపు చేసేందుకూ మ్యూచువల్‌ ఫండ్స్‌ అవకాశం కల్పిస్తున్నాయి. గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ పేరుతో ఇవి ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడి పెడతాయి. డీమ్యాట్‌ ఖాతా లేని వారు మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఈటీఎఫ్‌ల్లో మదుపు చేయడానికి వీలు పడుతుంది. బంగారంలో మదుపు చేయాలనుకునే వారు వైవిధ్యతలో భాగంగా గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.

జీవిత బీమా మరిచిపోతే ఎలా?

భవిష్యత్‌ అవసరాల కోసం ఎందులో పెట్టుబడి పెట్టాలనేది పక్కన పెడితే.. మహిళల్లో చాలా మంది ఇప్పటికీ జీవిత బీమా తీసుకోవడం లేదనేది నిష్ఠుర సత్యం. జీవిత బీమా అనేది కేవలం పురుషులకు మాత్రమే అనే అపోహ ఇప్పటికీ చాలామందిలో నెలకొంది. నేటి రోజుల్లో మహిళలూ పురుషులతో సమానంగా అన్ని బాధ్యతల్లోనూ భాగమవుతున్నారు. కాబట్టి మహిళలూ జీవిత బీమా తీసుకోవాలి. పొదుపు+బీమా ఆధారిత పథకాలు కాకుండా కేవలం బీమా మాత్రమే అందించే పాలసీలను తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా పొందేందుకు వీలు పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు