Gold ETFs: గోల్డ్‌ ఈటీఎఫ్‌లపై మదుపర్ల మక్కువ.. అక్టోబర్‌లో రూ.841 కోట్లు

Gold ETFs: అస్థిర సమయాల్లో సురక్షితమైన పెట్టుబడి అనే భావనతో పాటు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశం ఉందనే అంచనాలతోనే గోల్డ్‌పై మదుపర్లు మక్కువ చూపుతున్నారని నిపుణులు తెలిపారు.

Published : 10 Nov 2023 18:33 IST

దిల్లీ: గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లలోకి (Gold ETFs) అక్టోబర్‌లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అస్థిర సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా వీటికి గుర్తింపు ఉండడమే దీనికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత నెలలో మదుపర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో రూ.841 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (Amfi) శుక్రవారం వెల్లడించింది. క్రితం నెలతో పోలిస్తే రూ.175 కోట్లు అధికమని తెలిపింది. మరోవైపు ఇటీవల ధరలు దిగిరావడంతో శుక్రవారం ధనత్రయోదశి సందర్భంగా బంగారం, వెండి అమ్మకాలు హుషారుగా ప్రారంభమయ్యాయి.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీరేట్ల పెంపు భయాలు, అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి రేటులో మందగమనం వంటి కారణాల వల్ల రాబోయే రోజుల్లోనూ పసిడికి డిమాండ్‌ కొనసాగుతుందని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా అనలిస్ట్‌ మెల్విన్‌ వివరించారు. అస్థిర సమయాల్లో సురక్షితమైన పెట్టుబడి అనే భావనతో పాటు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశం ఉందనే అంచనాలతోనే గోల్డ్‌పై మదుపర్లు మక్కువ చూపుతున్నారని వివరించారు. మరోవైపు ఇటీవల పసిడి ధరలు ఆల్‌టైం గరిష్ఠాల నుంచి దిగొచ్చిన విషయం తెలిసిందే. మార్చి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ధరల్లో ఒక్కసారిగా తగ్గుదల రావడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.

యాంఫీ గణాంకాల ప్రకారం.. గోల్డ్‌ అనుసంధాన ఈటీఎఫ్‌లలోకి అక్టోబర్‌ నెలలో రూ.841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబరుతో పోలిస్తే ఇది రూ.175 కోట్లు అధికం. అంతకుముందు ఆగస్టులో అత్యధికంగా రూ.1,028 కోట్లు నమోదయ్యాయి. జులైలో రూ.416 కోట్లుగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మెరుగైన రాబడిని ఇస్తున్న పసిడి పెట్టుబడులు.. ఈటీఎఫ్‌లలోకి మదుపర్లను ఆకర్షిస్తున్నాయి. అక్టోబర్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో 27,700 కొత్త ఫోలియోలు జత కావడంతో మొత్తం సంఖ్య 48.34 లక్షలకు చేరాయి. మరోవైపు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ గత నెలలో 10 శాతం పెరిగి రూ.26,163 కోట్లకు చేరింది.

గోల్డ్‌ ఈటీఎఫ్‌లు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నిర్వహించే పథకాలు. బంగారం ధరలను ట్రాక్‌ చేసే పాసివ్‌ స్కీమ్‌లు. ఇక్కడ గోల్డ్‌ ఈటీఎఫ్‌ యూనిట్‌ ధర.. భౌతిక బంగారం ఒక గ్రాము ధరకు సరిపోయే విధంగా సర్దుబాటు ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ రూపంలో కొనుగోలు, అమ్మకాలు సులభంగా నిర్వహించే సౌలభ్యం ఉంటుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల యూనిట్లను సులభంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల పనివేళలో ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు. విక్రయించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని