ITR e-verification: ఇ-వెరిఫికేష‌న్ పూర్తిచేశారా? ఆల‌స్యం అయితే..!

ITR e-verification: ఐటీఆర్ దాఖ‌లు చేసికూడా ఇ-వెరిఫికేష‌న్ పూర్తిచేయ‌ని వారు వెంట‌నే వెరిఫికేష‌న్ పూర్తిచేయండి..

Published : 27 Aug 2022 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు జులై 31తో గ‌డువు ముగిసింది. ఏ కారణంతోనైనా గ‌డువు తేదీలోపు రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌ని వారికి మ‌రో అవ‌కాశం కూడా ఉంది. ఆల‌స్య‌పు రుస‌ముతో క‌లిపి డిసెంబ‌రు 31లోపు దాఖ‌లు చేయ‌వ‌చ్చు. అయితే, ప‌న్ను చెల్లింపుదారులు రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వెంట‌నే, చేయాల్సిన ముఖ్య‌మైన ప‌ని వెరిఫికేషన్‌ పూర్తిచేయ‌డం. వెరిఫికేష‌న్ కోసం ఇంత‌కు ముందు 120 రోజుల స‌మ‌యం ఉండేది. కానీ, ఆగ‌స్టు 1 నుంచి ఈ గ‌డువును 30 రోజుల‌కు త‌గ్గించారు. అందువ‌ల్ల ఐటీఆర్ దాఖ‌లు చేసి కూడా ఇ-వెరిఫికేష‌న్ పూర్తిచేయ‌ని వారు వెంట‌నే ఈ ప‌ని పూర్తిచేయండి.

ఎందుకు పూర్తిచేయాలి?

ఐటీఆర్‌ను ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసినా, ఆఫ్‌లైన్‌లో దాఖ‌లు చేసినా ధ్రువీక‌రించ‌డం ముఖ్యం. ధ్రువీకరించ‌ని ఐటీఆర్‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ చట్టబద్ధమైనదిగా పరిగణించదు. ప్రాసెస్‌ కూడా చేయ‌దు. దీంతో రీఫండ్ రాదు. ఇ-వెరిఫికేష‌న్‌ను కూడా ఆన్‌లైన్‌లోనే నెట్ బ్యాంకింగ్‌, బ్యాంక్ ఏటీఎం, ఆధార్, బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతాల ద్వారా పూర్తి చేయ‌వ‌చ్చు.

వెరిఫికేష‌న్ పూర్తి అయిన‌ట్లు ఎలా తెలుస్తుంది?

ధ్రువీక‌ర‌ణ పూర్తి చేసిన త‌ర్వాత విజ‌య‌వంత‌మైన‌ట్లు స్క్రీన్‌పై ట్రాన్సాక్ష‌న్ ఐడీతో పాటు స‌మాచారం క‌నిపిస్తుంది. ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసిన‌ ఈ-మెయిల్ ఐడీకి కూడా ఇందుకు సంబంధించిన సమాచారం పంపిస్తారు.

ఇ-వెరిఫికేష‌న్ చేయ‌క‌పోతే?

ఒక‌వేళ అనుమతించిన 30 రోజుల గ‌డువులోపు ఇ-వెరిఫికేష‌న్ పూర్తిచేయ‌ని పక్షంలో ఐటీఆర్ దాఖ‌లు చేయ‌న‌ట్లుగా ప‌రిగ‌ణిస్తారు. అటువంటి వారు తిరిగి ఐటీఆర్ ఫైల్ చేయాల్సి రావ‌చ్చు. అంతేకాకుండా ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961 ప్ర‌కారం ఆల‌స్య‌పు రిట‌ర్నులు ఫైల్ చేసిన వారు ఎదుర్కొనే అన్ని ప‌రిణామాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధ్రువీక‌రణ ఆల‌స్యం కావ‌డానికి త‌గిన కార‌ణాల‌ను తెలిపి జాప్యాన్ని క్షమించమని అభ్యర్థించవచ్చు. ఒక‌వేళ ఆదాయ‌పు ప‌న్ను అధికారి మీ అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రించి అంగీక‌రిస్తే ఇ-వెరికేష‌న్ పూర్తి చేయ‌వ‌చ్చు.

నోటిఫికేష‌న్ ప్ర‌కారం..

  • ఎల‌క్ట్రానిక్ మాధ్య‌మం ద్వారా ఐటీఆర్ దాఖ‌లు చేసిన వారు 30 రోజుల్లోపు ఇ-వెరిఫై/ఐటీఆర్-Vని స‌మ‌ర్పించాలి. ఈ విధంగా చేసిన‌ప్పుడు మాత్ర‌మే ఎల‌క్ట్రానిక్‌గా ఇ-వెరిఫై చేసిన తేదీని ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసిన‌ తేదీగా ప‌రిగ‌ణిస్తారు.
  • ఇ-వెరిఫికేష‌న్‌కు సంబంధించి ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు ముందే ఎల‌క్ట్రానిక్ మాధ్య‌మం ద్వారా రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారికి ఇంత‌కు ముందున్న 120 రోజుల గ‌డువే వ‌ర్తిస్తుంది.
  • గ‌డువు లోప‌ల ఐటీఆర్ దాఖ‌లు చేసిన‌ప్ప‌టికీ, అనుమతించిన గ‌డువులోపు ఇ-వెరిఫికేష‌న్ పూర్తిచేయ‌డంలో విఫ‌లం అయితే అటువంటి రిట‌ర్నుల‌ను ఆల‌స్య‌పు రిటర్నుల కింద ప‌రిగ‌ణిస్తారు. చ‌ట్ట ప్ర‌కారం ఆల‌స్య‌పు రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారు ఎదుర్కొనే అన్ని ప‌రిణామాలూ వీరికి వ‌ర్తిస్తాయి. 
  • ధ్రువీక‌రించిన ఐటీఆర్-V, నిర్ణీత‌ ఫార్మాట్‌లో నిర్ణీత‌ ప‌ద్ధ‌తిలో మాత్రమే స్పీడ్ పోస్ట్ ద్వారా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్, ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు - 560 500, కర్ణాటక వారికి పంప‌వ‌చ్చు. స్పీడ్ పోస్ట్ పంపిన తేదీని ఐటీఆర్-V పంపిన తేదీగా పరిగ‌ణిస్తారు. 

ఈ-వెరిఫికేష‌న్ ప్రొసెస్‌ను తెలుసుకునేందుకు ఈ క‌థ‌నాన్ని చ‌ద‌వండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని