అవసరాల కోసం FD క్యాన్సిల్ చేస్తున్నారా?.. అయితే, ఈ ఆప్షన్స్‌పై లుక్కేయండి..
స్వల్పకాల అవసరాల కోసం లేదా స్వల్ప మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఎఫ్‌డీ క్యాన్సిల్ చేయకుండా ఎఫ్‌డీపై రుణం లేదా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడినప్పుడు చాలా మంది అందులోంచి బయటపడేందుకు రుణాలను ఆశ్రయిస్తుంటారు. లేదా పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో మనకు చిన్న చిన్న మొత్తాల్లో డబ్బు అవసరమవుతుంది. అలాంటప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వల్ల అధిక రాబడి కోల్పోయే ప్రమాదం ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో ఇదే చేస్తుంటారు. డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. ఒకవేళ డబ్బు అవసరమైతే కాలపరిమితి ముగియకముందే డిపాజిట్ క్యాన్సిల్ చేసి డబ్బు వెనక్కి తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల.. మొత్తం డిపాజిట్‌పై 1శాతం వరకు వడ్డీ కోల్పోతారు.
మరేం చేయాలి?
స్వల్పకాలం కోసం లేదా స్వల్ప మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఎఫ్‌డీ క్యాన్సిల్ చేయకుండా ఎఫ్‌డీపై రుణం లేదా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. డబ్బు చేతికందగానే తిరిగి చెల్లించవచ్చు. ఇందుకుగానూ బ్యాంకు ఎఫ్‌డీపై మీకు ఇచ్చే వడ్డీ రేటు కంటే మీ వద్ద నుంచి 1-2% ఎక్కువగా వడ్డీ వసూలు చేస్తుంది. ఉదాహరణకు మీ ఎఫ్‌డీపై 6% వార్షిక వడ్డీ వస్తుంటే.. మీరు తీసుకున్న రుణంపై వార్షికంగా 7-8% వరకు వడ్డీ వసూలు చేయొచ్చు.
రుణం..
ఎఫ్‌డీపై రుణం సురక్షిత రుణం కిందకి వస్తుంది. అందువల్ల క్రెడిట్ స్కోరు వంటి వాటితో పనిలేకుండా సులభంగా రుణం పొందవచ్చు. రుణ మొత్తం ఎఫ్‌డీపై ఆధారపడి ఉంటుంది. మీ ఎఫ్‌డీ మొత్తంపై 90-95% వరకు కూడా రుణం పొందొచ్చు. వ్యక్తిగతంగా, జాయింట్‌గా ఎఫ్‌డీ ఉన్నా రుణం పొందొచ్చు. అయితే, మైనర్ పేరుపై ఉన్న ఎఫ్‌డీపై మాత్రం రుణం లభించదు. అలాగే, 5 సంవత్సరాల పన్ను ఆదా ఎఫ్‌డీపై కూడా రుణం లభించదు. రుణ మొత్తాన్ని ఈఎంఐలుగా గానీ, ఏకమొత్తంగా గానీ తిరిగి చెల్లించవచ్చు.
ఓవర్‌డ్రాఫ్ట్..
ఎఫ్‌డీపై రుణం మాదిరిగానే బ్యాంకులు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా అందిస్తాయి. అయితే రుణానికి, ఓవర్‌డ్రాప్ట్‌కి ఒక్కటే తేడా. ఓవర్‌డ్రాఫ్ట్ లిమిట్ ఎంతున్నా వాడుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1 లక్షకు ఎఫ్‌డీ చేశాడు. అతడికి ఓవర్‌డ్రాఫ్ట్ లిమిట్ 90% ఉంది అనుకుందాం. అతడు 20 రోజుల కోసం రూ. 30వేలు మాత్రమే వాడుకున్నాడు. ఈ రూ.30 వేలకే వడ్డీ వర్తిస్తుంది. అలాగే 20 రోజుల తర్వాత డబ్బు చేతికందితే వెంటనే జమ చేసేయవచ్చు.
ఎఫ్‌డీపై రుణం లేదా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు..
తక్కువ వడ్డీ: వ్యక్తిగత రుణం వంటి రుణాలతో పోలిస్తే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఎఫ్‌డీపై బ్యాంకు చెల్లించే వడ్డీ కంటే 1-2% వరకు అధిక వడ్డీ వసూలు చేస్తారు.
బ్రేక్ చేయనవసరం లేదు: స్వల్పకాల అవసరాల కోసం ఎఫ్‌డీ బ్రేక్‌చేయడం వల్ల పెనాల్టీ పడుతుంది. 1% వరకు వడ్డీ కల్పోయే అవకాశం ఉంటుంది. అదే రుణం లేదా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకోవడం వల్ల ఎఫ్‌డీ బ్రేక్ చేయనక్కరలేదు.
క్రెడిట్ స్కోరు: సాధారణంగా బ్యాంకులు క్రెడిట్ స్కోరును అనుసరించి రుణాలు ఇస్తాయి. తక్కువ క్రెడిట్‌స్కోరు ఉన్న వారు రుణం పొందడం కష్టం. అయితే, ఎఫ్‌డీపై రుణాల అర్హతను క్రెడిట్ స్కోరు ఆధారంగా నిర్ణయించవు. కాబట్టి, తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నా రుణం పొందవచ్చు.
ప్రీ-పేమెంట్ పెనాల్టీ ఉండదు: (ఎఫ్‌డీ) రుణ ముందస్తు చెల్లింపులపై బ్యాంకులు ప్రీపేమెంట్ పెనాల్టీని విధించవు.
కాలపరిమితి: ఎఫ్‌డీ మొత్తాన్ని అనుసరించి బ్యాంకులు రుణం లేదా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తాయి. అలాగే, కాలపరిమితి కూడా ఎఫ్‌డీ కాలపరిమితిని అనుసరించే ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ వరకు సమయం ఇస్తాయి. ఒకవేళ మెచ్యూరిటీ పీరియడ్ వరకు చెల్లించకపోతే.. తీసుకున్న రుణం, వడ్డీ మొత్తాన్ని సర్దుబాటు చేసి రుణ మొత్తాన్ని జమచేసుకున్నాక, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు.
క్రెడిట్ కార్డు..
ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా, యెస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీపై క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. కార్డుపరిమితి ఎఫ్‌డీపై ఆధారపడి ఉంటుంది. ఎఫ్‌డీ మొత్తంలో 70-75% వరకు లిమిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచూ స్వల్పకాలానికి (జీతం ఆలస్యంగా క్రెడిట్ అవ్వడం, వ్యాపారంలో చిన్న చిన్న అవసరాలు) డబ్బు అవసరం పడుతుంటే ఈ ఆప్షన్‌ను పరిశీలించవచ్చు.
చివరిగా..
సురక్షితమైన పెట్టుబడులు అంటే చాలా మందికి గుర్తుకు వచ్చేవి ఫిక్స్‌డ్ డిపాజిట్లు. దీంతో పాటు కచ్చితమైన రాబడి, ఇతర పెట్టుబడులతో పోలిస్తే సులభంగా అర్థం చేసుకోగలగడంతో చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మదుపు చేస్తుంటారు. అయితే, ఆర్థిక అత్యవసరాల కోసం కాలపరిమితి కంటే ముందే ఎఫ్‌డీ బ్రేక్ చేస్తారు. దీంతో రాబడి తగ్గిపోతుంది. కాబట్టి స్వల్పకాల అవసరాల కోసం ఎఫ్‌డీ బ్రేక్ చేసే కంటే పై మార్గాలను పరిశీలించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్