Investments: దీర్ఘకాలిక పెట్టుబడులతో ప్రయోజనాలివే.. ఉన్న ఆప్షన్లేంటి?

మీ డబ్బును దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్డడం వల్ల జీవితంలో ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ అవకాశముంటుంది. కొన్ని పెట్టుబడి పథకాలు ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలతో కూడా వస్తాయి.

Published : 05 Jan 2024 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా పెట్టుబడిదారులు తగిన మొత్తాన్ని తమ వీలును బట్టి మదుపు చేస్తుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుబడిదారులను క్రమపద్ధతిలో సంపదను కూడబెట్టుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తాయి. అంతేకాకుండా అనేక దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలు ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలతో వస్తాయి. మీ డబ్బును దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడం అనేది మీ ఉన్నత జీవిత లక్ష్యాలను సాధించడానికి సమర్థమైన పద్ధతి. పదవీ విరమణ ప్రణాళిక, ఇల్లు కొనడం, పిల్లల విదేశీ విద్య, వివాహం లాంటి అనేక పెద్ద ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి దీర్ఘకాలిక పెట్టుబడుల విధానం అద్భుతంగా పనిచేస్తుంది.

ద్రవ్యోల్బణ ప్రభావం

రాబడిపై ద్రవ్యోల్బణ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. సగటు ద్రవ్యోల్బణ రేటు 6-7% మధ్య ఉంది. భవిష్యత్‌లో ఇది కొద్దిగా పెరిగినా కొన్ని పెట్టుబడులపై  ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు పీపీఎఫ్‌పై 7.10%, ఈపీఎఫ్‌పై 8.15% వడ్డీ రేట్లు ఉన్నాయి. ఈ రెండు పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని కొద్ది మేరకు తట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే ఇవి ప్రభుత్వపరంగా భద్రత ఎక్కువ ఉండే పెట్టుబడులు. అదే ఈక్విటీల్లో అస్థిరత ఉన్నా దీర్ఘకాల పెట్టుబడుల మీద 10-15% రాబడి ఉంటుంది. ఇలాంటి పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే విధంగా ఉంటాయి. 

దీర్ఘకాల పెట్టుబడులకు ఉన్న ఆప్షన్లు

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు: ఈ ఫండ్లలో పెట్టుబడులు దీర్ఘకాలంలో అధిక రాబడికి అవకాశం కల్పిస్తూ, విభిన్నమైన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తాయి. వార్షిక రాబడి 10-15% ఉండే అవకాశం ఉంది. రిస్క్‌ చేయగల పెట్టుబడిదారులకు ఇవి లాభించొచ్చు. ఇందులో నష్టాలూ రావచ్చని గమనించాలి.

REITs: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (REIT) విలువైన రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంది. ఈ స్కీమ్‌లోని కంపెనీలు ఆస్తిని లీజుకు తీసుకుని, దానిపై వడ్డీ ఆదాయాన్ని పొందుతాయి. దాన్ని పెట్టుబడిదారులకు పంపిణీ చేస్తాయి. REITs రియల్‌ ఎస్టేట్‌ మాదిరిగానే పనిచేస్తాయి. ఇవి సెబీ నియంత్రణలో ఉన్నందున పారదర్శకతతోనే ఉంటాయి.

ఐపీఓలు: ఒక కంపెనీ పబ్లిక్‌ లేదా స్టాక్‌ మార్కెట్‌లో జాబితా నుంచి నిధులను సేకరించాలనుకున్నప్పుడు అది ‘ఐపీఓ’ ఆప్షన్ ఎంచుకుంటుంది. ఐపీఓలు తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. లిస్టింగ్ లాభాల కోసం మాత్రమే ఇందులో మదుపు చేయడం మంచి ఆలోచన కాదు. దీర్ఘకాలం పాటు మదుపు చేయాలనుకునే వారు మాత్రమే మంచి కంపెనీల ఐపీఓలను ఎంచుకోవచ్చు.

పీపీఎఫ్‌: ఇది పన్ను ప్రయోజనాలు, స్థిర వడ్డీ రేటును అందించే ప్రభుత్వ మద్దతుగల పొదుపు పథకం. ఏడాదికి కేవలం రూ.500తో పెట్టుబడి పెట్టొచ్చు. 15 ఏళ్ల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉన్న దీర్ఘకాలిక పొదుపు పథకం. అత్యవసర పరిస్థితిలో పాక్షిక ఉపసంహరణకు 6 ఏళ్ల తర్వాత మాత్రమే పరిమితి ఉంటుంది. రాబడి పూర్తిగా పన్ను రహితం. ఇది పదవీ విరమణ ప్రణాళికకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత వడ్డీ 7.10%.

ఈపీఎఫ్‌: ఇది ఉద్యోగులకు పదవీ విరమణ కోసం ఉద్దేశించింది. స్థిర వడ్డీ రేటు, పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు ఇది తప్పనిసరి. ప్రస్తుత వడ్డీ 8.15%.

ఎన్‌పీఎస్‌: ఇది స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. మదుపుపై పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. దీర్ఘకాలిక సంపద కోసం ఈక్విటీ, డెట్‌, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులుంటాయి. 60 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడికి లాక్ ఇన్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నిధుల పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. రాబడి 8-10% ఉండొచ్చు.

రియల్‌ ఎస్టేట్‌: రియల్‌ ఎస్టేట్‌లో అధిక పెట్టుబడులు అవసరమవుతాయి. ఖాళీ ప్లాట్లు, ఫ్లాట్లు, వాణిజ్య స్థలాలు, నివాస ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టవచ్చు. రాబడికి దీర్ఘకాలం పాటు వేచి ఉండాలి. ఎక్కువ పెట్టుబడి పెట్టగల స్థోమత ఉన్నవారికి ఇవి అనుకూలం. దీనిలో లాభాలు ప్రాంతాలను బట్టి ఉంటాయి.

పబ్లిక్‌ సెక్టార్‌ బాండ్లు: ఈ బాండ్లను ప్రభుత్వ రంగ సంస్థ(PSU)లు జారీ చేస్తాయి. వడ్డీ రేటు 7-9% వరకు ఉంటాయి. AAA రేటెడ్ బాండ్లు సురక్షితంగా ఉంటాయి.

సుకన్య సమృద్ధి యోజన (SSY): ప్రత్యేకంగా ఈ పథకం ఆడ పిల్లల కోసం ఉద్దేశించింది. విద్య/వివాహ ఖర్చుల కోసం, దీర్ఘకాలిక పొదుపులకు అనువైనది. ప్రస్తుత వడ్డీ రేటు 8.20%.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ): స్థిర కాలవ్యవధి కోసం ఉద్దేశించినది. అసలు, రాబడిపై హామీ ఉంటుంది. వడ్డీ గరిష్ఠంగా 8% దాకా ఉంటుంది. సంప్రదాయ పెట్టుబడిదారులకు ఈ డిపాజిట్లు అత్యంత అనుకూలం.

చివరిగా: మీ ఆర్థిక లక్ష్యాలు, విజయవంతమవ్వాలంటే తప్పనిసరిగా దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికపై దృష్టి పెట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని