ఏఐ రేసులోకి మెటా.. వాట్సాప్‌, ఇన్‌స్టాలో చాట్‌జీపీటీ తరహా సేవలు!

Meta AI products: మెటా సైతం కృత్రిమ మేధ రేసులోకి వచ్చింది. ఇందుకోసం ఓ టీమ్‌ను ఏర్పాటు చేసింది. వాట్సాప్‌, ఇన్‌స్టాలో తొలుత చాట్‌జీపీటీ తరహా సేవలను తీసుకురానుంది.

Published : 28 Feb 2023 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిగ్‌ టెక్‌ కంపెనీల మధ్య ఏఐ (AI) వార్‌ మొదలైంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ చాట్‌జీపీటీతో (ChatGPT) ముందుకు వస్తుండగా.. గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ బార్డ్‌ పేరిట చాట్‌జీపీటీ తరహా ఏఐ టూల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ విషయంలో తామేమీ తక్కువ కాదంటోంది ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా (Meta). ఇందుకోసం కంపెనీలో ఓ ఉన్నత స్థాయి ప్రొడక్ట్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్గ్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత వాట్సాప్‌, ఇన్‌స్టాలో చాట్‌జీపీటీ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

కృత్రిమ మేధకు సంబంధించి ఓ టీమ్‌ను ఏర్పాటు చేశామని, దానికి మెటా చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ క్రిస్‌ కాక్స్‌ నేతృత్వం వహిస్తారని జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఈ టీమ్‌ భవిష్యత్‌లో వివిధ రూపాల్లో ప్రజలకు సంబంధించి అన్ని అవసరాలు తీర్చేవిధంగా ఏఐ పర్సనాస్‌ను రూపొందించనుందని తెలిపారు. ఇందుకోసం కొంత ఫౌండేషన్‌ వర్క్‌ అవసరమన్నారు. ప్రస్తుతానికి టెక్ట్స్‌ (వాట్సాప్‌, మెసెంజర్‌), ఇమేజెస్‌ (ఇన్‌స్టా ఫిల్టర్స్‌, యాడ్‌ ఫార్మాట్స్‌), వీడియో, బహుళ మోడల్‌ రూపంలో అందించగలిగే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఓ వైపు మాంద్యం భయాలు వెంటాడుతుండడం, వృద్ధి నెమ్మదించడం వంటి కారణాలతో వేలాది ఉద్యోగాలను బిగ్‌ టెక్‌ కంపెనీలు తొలగిస్తున్నాయి. మరోవైపు ఏఐపైనా దృష్టి పెడుతున్నాయి. ఈ విషయంలో ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ చాట్‌బాట్‌ను తీసుకురాగా.. గూగుల్‌ సైతం బార్డ్‌ను ప్రకటించింది. స్నాప్‌చాట్‌సైతం తమ యాప్‌లో చాట్‌జీపీటీ తరహా బాట్‌ను జోడిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. గత వారం LLaMA పేరిట కొత్త లాంగ్వేజ్‌ మోడల్‌ను ఆవిష్కరించిన మెటా.. తాజాగా దీనిపై పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని