వన్‌ప్లస్‌కు రిటైల్‌ చైన్స్‌ షాక్‌.. మే 1 నుంచి అమ్మకాలు నిలిపివేత!

ఆఫ్‌లైన్‌ స్టోర్లలో వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు నిలిపివేస్తున్నట్లు రిటైలర్స్‌ అసోసియేషన్ ప్రకటించింది. మే 1 నుంచి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థకు లేఖ రాసింది.

Published : 11 Apr 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వన్‌ప్లస్‌కు (Oneplus) రిటైల్‌ చైన్స్‌ షాకిచ్చాయి. వన్‌ప్లస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఇకపై విక్రయించబోమని ప్రకటించాయి. వన్‌ప్లస్‌ విక్రయాల వల్ల తమకు పెద్దగా మార్జిన్లు ఉండడం లేదని, కొన్ని ఇతర సమస్యలనూ వన్‌ప్లస్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లో మే 1 నుంచి విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించాయి.

ఆఫ్‌లైన్‌ విక్రయాల నిలిపివేతపై వన్‌ప్లస్‌ సేల్స్‌ డైరెక్టర్‌ రంజిత్‌ సింగ్‌కు సౌత్‌ఇండియన్‌ ఆర్గనైజ్డ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ (ORA) తాజాగా ఓ లేఖ రాసిందని మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ అసోసియేషన్‌లో పూర్విక, సంగీత, బిగ్‌సీ వంటి రిటైల్‌ ఛైన్స్‌ సభ్యులుగా ఉన్నాయి. వన్‌ప్లస్ ఉత్పత్తుల విక్రయంలో తాము అనేక అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్‌ వన్‌ప్లస్‌కు రాసిన లేఖలో పేర్కొంది. మార్జిన్లు తక్కువగా ఉంటున్నాయని, వారెంటీ, సర్వీస్‌ ప్రాసెసింగ్‌ ప్రక్రియను వన్‌ప్లస్‌ ఆలస్యం చేస్తోందని ప్రస్తావించింది. దీనివల్ల కస్టమర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారని, కొన్నిసార్లు తిరిగి తమపైనే భారం పడుతోందని లేఖలో పేర్కొంది.

ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించినప్పటికీ వనప్లస్ పట్టించుకోలేదని లేఖలో తెలిపింది. ఈ కారణంతోనే మే 1 నుంచి వన్‌ప్లస్‌ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్‌ పేర్కొంది. అసోసియేషన్‌ నిర్ణయంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో ఉన్న 4,500 రిటైల్‌ స్టోర్లలో అమ్మకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. దీనిపై వన్‌ప్లస్‌ ఇంకా స్పందించలేదు. ఓవైపు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో విక్రయాలు పెంచుకోవడం ద్వారా తమ మార్కెట్‌ వాటాను పెంచుకోవాలని భావిస్తున్న తరుణంలో విక్రయాల నిలిపివేత వన్‌ప్లస్‌కు దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని