ITR filing: ట్యాక్స్ ఫైలింగ్‌కి సిద్ధమయ్యారా? ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి..

పన్ను రిటర్నులు దాఖలు (ITR filing) అనేది ప్రతి ఏడాదీ చేసేదే. అయినా మారుతున్న చట్టాలు, ఫార్మాట్లు, విధానాలతో దాఖలు

Published : 30 Jun 2022 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పన్ను రిటర్నులు దాఖలు (ITR filing) అనేది ప్రతి ఏడాదీ చేసేదే. అయినా మారుతున్న చట్టాలు, ఫార్మాట్లు, విధానాలతో దాఖలు చేసే సమయంలో పన్ను చెల్లింపుదారులు ఒకింత గందరగోళానికి గురవుతుంటారు. దీంతో దాఖలు చేసే సమయంలో తప్పులు చేస్తుంటారు. అందువల్ల రిటర్నుల దాఖలకు ముందే కావాల్సిన అన్ని పత్రాలనూ సిద్ధం చేసుకుంటే.. చాలా వరకు తప్పులు చేయకుండా జాగ్రత్త పడొచ్చు.

పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయండి: ఐటీ రిటర్నుల దాఖలుకు ముందు మీ పాన్ నంబరును ఆధార్‌తో (PAN-Aadhaar) అనుసంధానించ‌డం త‌ప్ప‌నిస‌రి. అందువ‌ల్ల‌ ముందుగా మీ పాన్‌, ఆధార్ నంబరుతో అనుసంధానించారో లేదో స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ ఆప్షన్ ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. ఆధార్‌తో పాన్‌ను అనుసంధానించకపోయినప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. కానీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ అనుసంధాన గడువు 2023 మార్చి 31తో ముగియనుంది. ఈలోపు ఆలస్య రుసుము చెల్లించి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. 2022 జూన్ 30లోపు రూ.500, ఆ తర్వాత అయితే రూ.1000 ఆలస్య రుసుము వర్తిస్తుంది. ఒకవేళ గడువు తేదీలోపు అనుసంధానంచికపోతే పాన్ కార్డు పనిచేయదు.

ఫారం-16, ఇత‌ర ప‌న్ను ఆదా ప‌త్రాలు: జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులు తమ సంస్థ నుంచి ఫారం-16ని (Form 16) అందుకున్న తర్వాత మాత్రమే రిటర్నుల గురించి ఆలోచిస్తారు. అయితే మరికొన్ని పత్రాలను కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. నెలవారీ జీతానికి సంబంధించిన రశీదులు, అన్ని అలవెన్సులు, పన్ను మినహాయింపునకు సంబంధించిన అన్ని పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మీరు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ పొందుతున్నట్లయితే.. పొదుపు ఖాతా వడ్డీకి సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయ ప్రకటన, టీడీఎస్ సర్టిఫికెట్లను బ్యాంక్ నుంచి తీసుకోవాలి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80టీటీఏ కింద బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పొందొచ్చు.

Also Read: ఫారం 16 చూసుకున్నారా?

ఇంటి రుణానికి సంబంధించిన పత్రాలు: పన్ను చెల్లింపుదారులు గృహ రుణంతో (Home loan) ఇల్లు కొనుగోలు చేసినట్లయితే అసలు మొత్తం చెల్లింపులపై సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు, వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24బి కింద రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. అందువల్ల ఆ సంవత్సరానికి గృహ రుణంపై చెల్లించిన అసలు, వడ్డీకి సంబంధించిన బ్రేకప్ వడ్డీ సర్టిఫికెట్‌ను బ్యాంకు నుంచి తీసుకోవాలి.

ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను లెక్కింపు వేరు వేరు ఆస్తులకు వేర్వేరుగా ఉండొచ్చు. ఒక‌వేళ మీరు మీ ఇంటిని అద్దెకు ఇచ్చిన‌ట్ల‌యితే.. ప‌న్ను అనేది అసలు అద్దె ఆదాయంపై వర్తించదు. వార్షిక అద్దె నుంచి ఇంటి ఆస్తికి సంబంధించిన మున్సిపల్ పన్ను, 30 శాతం స్టాండర్ట్ డిడక్షన్, గృహ రుణ వడ్డీ (పరిమితి మేరకు) తీసివేసిన తర్వాత పన్ను లెక్కిస్తారు. దానికి సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

ఈక్విటీ షేర్లు విక్రయించినట్లయితే: షేర్ల విక్రయంపై మూలధన లాభం కింత పన్ను వర్తిస్తుంది. ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసిన ఏడాది తర్వాత విక్రయిస్తే, రూ.1 లక్ష కంటే ఎక్కువ ఉన్న రాబడిపై పన్ను విధిస్తారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఇది 10 శాతం ఉంటుంది. స్వల్పకాలిక మూలధన లాభాలపై (సంవత్సరం కంటే తక్కువ కాలం నిర్వహిస్తే) 15 శాతం పన్ను వర్తిస్తుంది. ఒకవేళ ఈక్విటీ షేర్లను విక్రయించి ఉంటే అందుకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. 

Also Read: ఐటీఆర్‌ను దాఖలు చేయాలా? ఆన్‌లైన్‌లో ఫైల్‌ చేయండిలా..

సెక్షన్ 80సి మినహాయింపు కోసం: పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, యులిప్స్, ఈఎల్ఎస్ఎస్, ఎల్ఐసీ పాలసీ వంటి పన్ను ఆదా పథకాలలో మదుపు చేసిన వారు వాటికి సంబంధించిన పత్రాలను సేకరించి పెట్టుకోవాలి.

ఫారం-26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్): ఫారం-26 ఏఎస్ ప్రాథమికంగా టీడీఎస్, టీసీఎస్ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది పన్ను క్రెడిట్‌ను సులభంగా క్లెయిమ్ చేసుకునేందుకు సాయపడుతుంది. ఒకవేళ ఫారం- 26 ఏఎస్‌లో ఉన్న సమాచారం, ఆదాయపు పన్ను రిటర్నులలో సమాచారంతో సరిపోలకపోతే ఆదాయపు అధికారులు దీనిపై విచారిస్తారు.

వార్షిక సమాచార స్టేట్‌మెంట్‌ (ఏఐఎస్ )లో టీడీఎస్ తగ్గింపుతో సంబంధం లేకుండా వివిధ మార్గాల ద్వారా అంటే స్టాక్స్, బీమా, క్రెడిట్ కార్డులు, ఆస్తుల కొనుగోలు/అమ్మకం, మ్యూచ్‌వ‌ల్‌ ఫండ్ లావాదేవీలు, జీతం ద్వారా వచ్చే ఆదాయం లేదా వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం, డివిడెండ్లు, బ్యాంకు పొదుపు ఖాతా డిపాజిట్లపై వడ్డీ... ఇలా పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఈ సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అయ్యి సర్వీసెస్ ట్యాబ్‌లోని ఈ-ఫైల్‌ని క్లిక్ చేయడం ద్వారా సంబంధిత పత్రాలను పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని