SBI క్రెడిట్‌కార్డుతో అద్దె చెల్లిస్తే.. రేపట్నుంచి ఛార్జీలు

అద్దె చెల్లించినా.. కొనుగోళ్ల వ్యయాన్ని ఈఎంఐ కిందకు మార్చుకున్నా రేపట్నుంటి అంటే 2022 నవంబరు 15 నుంచి ఎస్‌బీఐ కార్డ్స్‌ ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేయనుంది.

Updated : 14 Nov 2022 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌ కార్డుతో ఇంటి అద్దె చెల్లించినప్పుడు ఆ మొత్తంపై రూ.99 సర్వీస్‌ ఛార్జీ విధించబోతున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ ప్రకటించింది. నవంబరు 15 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు తన ఖాతాదారులకు సందేశాలు పంపించింది. దీనికి 18 శాతం జీఎస్‌టీ అదనం. మరోవైపు ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్‌ ఫీజును రూ.100 మేర పెంచేసింది. ఇది కూడా మంగళవారం నుంచి అమల్లోకి రానుంది.

ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ మొత్తాన్ని ఈఎంఐ లావాదేవీగా మారిస్తే దానికి ప్రస్తుతం ఎస్‌బీఐ రూ.99తో పాటు అదనంగా జీఎస్‌టీ వసూలు చేస్తోంది. నవంబర్‌ 15 నుంచి ప్రాసెసింగ్‌ ఫీజును రూ.199 చేసింది. అంటే ఇకపై ఎస్‌బీఐ కార్డుదారులు ఈఎంఐ లావాదేవీ చేస్తే రూ.199+ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అద్దె చెల్లింపు లావాదేవీలపై ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలూ వేయని ఎస్‌బీఐ.. ఇకపై రూ.99+ జీఎస్‌టీ వసూలు చేయనుంది.

ఇంటి అద్దె ప్రతినెలా చెల్లించాలి కనుక, క్రెడిట్‌ కార్డుతో అద్దె చెల్లించే సేవను కొన్ని సంస్థలు తీసుకొచ్చాయి. కార్డు ద్వారా అద్దె చెల్లించినప్పుడు ఇవి 0.4శాతం నుంచి 2 శాతం వరకు సేవా రుసుముగా వసూలు చేస్తున్నాయి. కొన్ని అంకురాలు ప్రధానంగా దీన్నే తమ వ్యాపారంగా ఎంచుకున్నాయి. రూ.15వేల అద్దె ఉన్నప్పుడు 2 శాతం రుసుము అంటే.. దాదాపు రూ.300 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 18 శాతం జీఎస్‌టీ అదనం. అంటే.. సుమారు రూ.354 అవుతుంది. అయితే ఈ చెల్లింపుపై అధికంగా రివార్డు పాయింట్లు లభిస్తుండటం, కొన్నిసార్లు ఫీజులు విధించకపోవడం లాంటి ప్రయోజనాలతో చాలామంది ఈ సేవను వాడుకుంటున్నారు. చాలామంది ఇంటి అద్దె చెల్లిస్తున్నారా.. ఆ పేరుతో ఇతరులకు నగదు బదిలీ చేస్తున్నారా అనే విషయంలో ఎలాంటి తనిఖీ ఉండటం లేదు. క్రెడిట్‌కార్డు నుంచి నగదు అప్పు తీసుకునేందుకు అధిక ఛార్జీలు పడతాయి కనుక, ఇలా నగదు వాడుకుంటున్నారనీ చెబుతున్నారు. దీన్ని అరికట్టేందుకే తాజాగా క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు ప్రత్యేకంగా రుసుము వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు దీన్ని అమల్లోకి తీసుకురాగా.. తాజాగా ఎస్‌బీఐ కార్డ్స్‌ కూడా ఆ జాబితాలో చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని