Semiconductor: వాహన తయారీకి ఇంకా ‘చిప్‌’ల సమస్య: మారుతీ సుజుకీ

వాహన తయారీకి చిప్‌ల కొరత ఇంకా ఓ సమస్యగానే ఉందని మారతీ సుజుకీ సీఎఫ్‌ఓ తెలిపారు. సమస్య తీవ్రత తగ్గినప్పటికీ.. పూర్తిగా సమసిపోలేదని చెప్పారు.

Published : 29 Jan 2023 15:32 IST

దిల్లీ: వాహన తయారీకి సెమీకండక్టర్ల సరఫరా ఇంకా సవాల్‌గానే ఉందని మారుతీ సుజుకీ (Maruti Suzuki) సీఎఫ్‌ఓ అజయ్‌ సేథ్‌ అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్న మార్గాలపై తమ కంపెనీ దృష్టి సారించిందని తెలిపారు. అందుబాటులో ఉన్న సరఫరాదారుల నుంచే అధిక మొత్తంలో సెమీకండక్టర్లను సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

రెండో త్రైమాసికంతో పోలిస్తే.. డిసెంబరుతో ముగిసిన మూడు నెలల వ్యవధిలో ఎలక్ట్రానిక్‌ చిప్‌ల సరఫరా మెరుగైందని సేథ్‌ తెలిపారు. అయినా సెమీకండక్టర్ల కొరత వల్ల అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో 46,000 కార్ల తయారీ నిలిచిపోయిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో వీటి తయారీ ఎలా ఉండనుందనే విషయంపైనా ఎలాంటి స్పష్టత లేదని తెలిపారు.

డిసెంబరు త్రైమాసికం ముగిసే నాటికి మారుతీ సుజుకీ (Maruti Suzuki) పెండింగ్‌ ఆర్డర్ల సంఖ్య 3.63 లక్షల యూనిట్లకు చేరింది. కంపెనీకి ప్రస్తుతం మానేసర్‌, గురుగ్రామ్‌లో ఉన్న తయారీ కేంద్రాలకు 15 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యం ఉంది. అదనంగా గుజరాత్‌లో ఉన్న సుజుకీ మోటార్‌ ప్లాంట్‌ నుంచి కూడా 7.5 లక్షల యూనిట్ల తయారీని చేపట్టేందుకు కంపెనీకి అనుమతి ఉంది.

చమురు దిగుమతిని తగ్గించుకోవడం, 2070 నాటికి తటస్థ కర్బన ఉద్గార స్థాయిని చేరుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని సేథ్‌ తెలిపారు. అందులో భాగంగానే హైబ్రిడ్‌, సీఎన్‌జీ, బయో- సీఎన్‌జీ, ఇథనాల్‌, ఎలక్ట్రిక్‌.. ఇలా అన్ని సాంకేతిక హంగులతో కూడిన వాహనాలను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ యుటిలిటీలో మారుతీ సుజుకీ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన జిమ్నీ, ఫ్రాంక్స్‌ ద్వారా దాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని