Mobile TV: సిమ్‌, ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్‌లో టీవీ ప్రసారాలు!

సిమ్‌, ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్‌లో టీవీ కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు కేంద్రం కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. 

Updated : 16 Jan 2024 21:39 IST

దిల్లీ: మొబైల్‌ యూజర్ల కోసం కేంద్రం మరో ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో సిమ్‌, ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్‌లో టీవీ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మంగళవారం దిల్లీలో జరిగిన బ్రాడ్‌కాస్టింగ్‌ సదస్సులో కేంద్ర సమాచార, ప్రసారశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘డైరెక్ట్‌-టు-మొబైల్‌’ (D2M) సాంకేతికత ద్వారా వాటిని ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం 19 నగరాల్లో 470-582 మెగాహెర్జ్‌ స్పెక్ట్రమ్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. 

‘‘గతేడాది డీ2ఎమ్‌ సాంకేతికతను బెంగళూరు, దిల్లీలోని కర్తవ్యపథ్‌, నోయిడా ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా పరీక్షించాం. భారత్‌లో 80 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లలో 69 శాతం మంది వీడియో ఫార్మాట్‌లో కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. దీని వల్ల మొబైల్‌ నెట్‌వర్క్‌పై భారం పెరిగి కంటెంట్‌ ప్రసారంలో అంతరాయం ఏర్పడుతోంది. కేంద్రం కొత్తగా పరిచయం చేయనున్న బ్రాడ్‌కాస్టింగ్‌ సాంకేతికతతో కోట్ల మంది యూజర్లు వీడియో ప్రసారాలను నిరంతరాయంగా వీక్షించవచ్చు’’ అని అపూర్వ చంద్ర తెలిపారు.

ఏంటీ డీ2ఎమ్‌?

ఇది దాదాపు ఎఫ్‌ఎం రేడియో, డీటీహెచ్‌ తరహాలో తరహాలో పనిచేస్తుంది. డీ2ఎమ్‌లో బ్రాడ్‌బ్యాండ్‌, బ్రాడ్‌కాస్ట్‌ టెక్నాలజీ కలిపి టీవీ కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. తద్వారా స్మార్ట్‌ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్‌ నేరుగా వస్తుంది. డీ2ఎమ్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్‌, శాంఖ్య ల్యాబ్స్‌ కలిసి అభివృద్ధి చేశాయి. ఈ సాంకేతికతతో ప్రసారాలకు అయ్యే ఖర్చు తగ్గడంతోపాటు నెట్‌వర్క్‌ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్‌ పంపేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని