Stock Market: వరుసగా రెండోరోజూ లాభాలు.. 18,200 ఎగువకు నిఫ్టీ!

Stock Market: సెన్సెక్స్‌ 126.41 పాయింట్ల లాభంతో 61,294.20 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 35.10 పాయింట్లు లాభపడి 18,232.55 వద్ద ముగిసింది.

Published : 03 Jan 2023 16:03 IST

 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే కోలుకున్నాయి. గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగతో మధ్యాహ్నం తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. మళ్లీ కొనుగోళ్ల మద్దతుతో పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలకు చేరాయి. ఇలా రోజంతా ఊగిసలాట మధ్య సాగిన సూచీల పయనం చివరకు లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, హెల్త్‌కేర్‌, ఐటీ రంగాల షేర్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. అదే సమయంలో లోహ, వాహన రంగ షేర్లు నష్టాలు చవిచూశాయి. మరోవైపు మధ్యాహ్నానికి అమెరికా ఫ్యూచర్స్‌, ఆసియా మార్కెట్లు లాభాల్లోకి ఎగబాకడం కూడా సూచీల సెంటిమెంటును  పెంచింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 61,074.88 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,343.96 వద్ద గరిష్ఠాన్ని, 61,004.04 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 126.41 పాయింట్ల లాభంతో 61,294.20 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,163.200 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి ఇంట్రాడేలో 18,251.95- 18,149.80 మధ్య కదలాడింది. చివరకు 35.10 పాయింట్లు లాభపడి 18,232.55 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.83 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో 17 షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, మారుతీ, ఇన్ఫోసిస్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర అంశాలు..

రిలయన్స్‌ నావల్‌ కొనుగోలుకు ఎన్‌సీఎల్‌టీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో స్వాన్‌ ఎనర్జీ షేరు ధర ఈరోజు 6.55 శాతం పెరిగి రూ.331.10 వద్ద నిలిచింది.

ఓరియెంట్‌ సిమెంట్‌ ప్రమోటర్‌ తన వాటాలను విక్రయించే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కొనుగోలుకు అదానీ గ్రూప్‌ సంసిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  ఈ వార్తల నేపథ్యంలో ఓరియెంట్‌ సిమెంట్‌ షేరు ఈరోజు 6.12 శాతం పెరిగి రూ.130 వద్ద స్థిరపడింది.

జొమాటో సీటీఓ, సహ వ్యవస్థాపకుడు గుంజన్‌ పాటిదార్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో కంపెనీ స్టాక్‌ ఈరోజు 2.49 శాతం కుంగి రూ.58.80 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు